మహారాష్ట్రలో కొనసాగుతోన్న ప్రతిష్టంభన: తన గ్రామానికి బయల్దేరిన షిండే

సీఎం ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడుతున్న వేళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన స్వగ్రామానికి బయల్దేరడం దేనికి సంకేతం?

Update: 2024-11-29 11:55 GMT

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. తన అసంతృప్తికి సూచకంగా ఈ రోజు (నవంబర్ 29) ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన స్వగ్రామానికి బయలేర్దారు. షిండే శుక్రవారం న్యూఢిల్లీ నుంచి ముంబైకి తిరిగి వచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి తదుపరి సమావేశం శుక్రవారం ముంబైలో ఉంటుందని నిన్న రాత్రి ప్రకటించారు కూడా. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అవాంతరాలకు తెరదీస్తూ..షిండే సతారా జిల్లాలోని తన గ్రామానికి వెళ్లిపోయారని ఆయన సహచరులు తెలిపారు.

డిప్యూటీ సీఎం పోస్టు నచ్చలేదా?

ప్రభుత్వ ఏర్పాటుకు తాను అడ్డంకి కాబోనని, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని షిండే ఇదివరకు మీడియాతో అన్నారు.వార్తా నివేదికల ప్రకారం.. శివసేనలోని ఒక వర్గం షిండే ఉప ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటోంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉపముఖ్యమంత్రి కావడం ఏంటని మరోవర్గం వాదిస్తోంది. శివసేన ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి సంజయ్ షిర్సాత్ ఇదే విషయం చెప్పారు. "ఆయన (షిండే) ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అది తగదు’’ అని పేర్కొన్నారు.

అడ్డంకులు ఎదుర్కోబోతుందా?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిని మట్టికరిపించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కూటమి ఘనవిజయం సాధించింది. బీజేపీ తన శాసనసభా పక్ష నేతను ప్రకటించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని సేన నాయకుడు ఒకరు తెలిపారు. సేన, అజిత్ పవార్‌ల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)తో జతకట్టిన బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటులో కొన్ని అడ్డంకులు తప్పవని సేన వర్గాలు సంకేతాలిస్తున్నాయి.

శాఖల కోసం డిమాండ్

ఇద్దరు డిప్యూటీలతో ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడానికి అంగీకారం కుదిరినా.. మంత్రుల శాఖలకు సంబంధించి లాబియింగ్‌లు కొనసాగుతుందని సమాచారం. కీలక పోస్టుల కోసం కొందరు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ హోం శాఖను తన వద్దే ఉంచుకుని అవకాశం ఉంది. ఎన్‌సీపీకి ఆర్థిక శాఖ అప్పగించి, అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ వర్క్స్ శాఖలను శివసేన పార్టీకి అప్పగించే అవకాశం ఉంది.

ఎవరికి ఎన్ని బెర్త్‌లు..

బీజేపీకి 22 కేబినెట్‌ బెర్త్‌లు, సేన, ఎన్‌సీపీలకు వరుసగా 12, 9 పోర్ట్‌ఫోలియోలు కేటాయించే అవకాశం ఉంది. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ 132 సీట్లు గెలుచుకోగా, సేన, ఎన్సీపీ వరుసగా 57, 41 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News