ఆంధ్రప్రదేశ్‌లో రాళ్ల రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాళ్లది ప్రత్యేక ప్రాధాన్యత. రాళ్లే రాజకీయాలు చేస్తున్నాయి. నాయకులపై గురిచూసి రాళ్లు విసురుతున్నారు.
Byline : G.P Venkateswarlu
Update: 2024-04-15 06:40 GMT
ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతలపై రాళ్ల దాడులు రెండు రోజుల్లో వరుసగా జరిగాయి. ఈ రాళ్ల దాడులతో నేతలు బెంబేలెత్తుతున్నారు. అధికార పక్ష నేత వైఎస్ జగన్‌ను విజయవాడలో శనివారం రాత్రి రాయితో కొడితే ఆయన చావునుంచి తప్పించుకున్నారు. సరిగ్గా కణతకు పై భాగాన కనుబొమ్మ పైభాగాన నుదుటిపై తగిలింది. బలమైన గాయమైంది. కుట్లు కూడా పడ్డాయి. ఆదివారం ప్రచారానికి విరామం ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పరడింది. చంపేందుకు రాయితో కొట్టిన వాడిని మాత్రం ఇంతవరకు పోలీసులు గుర్తించలేదు.
చంద్రబాబుపై గురి తప్పిన రాయి
ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును విశాఖ నగరంలోని గాజువాకలో ఆదివారం రాత్రి రాయితో కొట్టారు. అయితే ఆ రాయి గురి తప్పింది. కొట్టిన వ్యక్తి పక్కనే ఉన్న గోడదూకి పరారయ్యాడు. అందరూ చూస్తుండగానే పరారయినా ఆ యువకుడిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. రాయి గురితప్పింది. లేకుంటే ఎక్కడ తగిలినా ప్రానానికి ప్రమాదం ఏర్పడేదని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.
పవన్‌పై రాయితో దాడి
తెనాలిలో జనసేన నేత పవన్‌కళ్యాణ్‌పై రాయి విసిరాడో వ్యక్తి. పవన్ సెక్యూరిటీ సిబ్బంది రాయిని పవన్‌పై పడకుండా పట్టుకున్నారు. ఆ వెంటనే రాయి విసిరిన యువకుడిని పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది. చితక బాదారు. దీంతో ఆ యువకుడికి ముక్కుల్లో నుంచి రక్తం కూడా వచ్చింది. మాట్లాడలేని స్థితిలో ఉన్న యువకుడిని పోలీసులు తీసుకెళ్ళారు. తెనాలి డీఎస్‌స్పీ మాట్లాడుతూ రాయి విసిరిన వ్యక్తి ఆకతాయి. ఆడపిల్లలపై రాళ్లు విసిరేవాడు. పవన్‌పై రాళ్లు విసిరేందుకు అసలే వచ్చిన వాడు కాదంటూ మాట్లాడారు.
రాళ్లే కాదు చెప్పులు కూడా విసిరారు
ఇవన్నీ చూస్తుంటే రాళ్లే రాజకీయాలు చేస్తున్నాయని చెప్పాల్సి వస్తోంది. రాళ్లే కాదు చంద్రబాబుపై, జగన్‌పై చెప్పులు కూడా ఇప్పటికే విసిరారు. జనం మద్యలో నుంచి పైకి లేచిన చెప్పును గుర్తించగలిగారు కాని ఎవరి చేతిలో నుంచి చెప్పు పైకి లేచిందో ఇంతవరకు గుర్తించలేదు. నేతలపై గురిచూసి చెప్పులు విసిరారంటే వారిని అవమానించడానికనేది స్పష్టమవుతుంది. అయితే రాళ్లతో కొట్టారంటే సందర్భాన్ని బట్టి చావును కళ్లారా చూడాలనే ఉద్దేశ్యంతోనే ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్‌ను రాళ్లతో కొట్టిన వారు ఎవరు? అనే విషయం ఇంతవరకు పోలీసులు నిర్థారించలేదు. పవన్‌పై రాళ్లు రువ్విన వ్యక్తి మాత్రం దొరికాడు. చంద్రబాబుపై రాళ్లు వేసిన వ్యక్తి పరారయ్యాడు.
జగన్‌పై రాళ్ల దాడి శనివారం జరిగితే ఆదివారం అం»ే ద్కర్ జయంతి సందర్బంగా వైఎస్సార్‌సీపీకి చెందిన మహిళా కార్యకర్తలు, నాయకులు నల్ల రిబ్బన్లు మూతికి కట్టుకుని అంబేద్కర్ విగ్రహాల వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనలు చేశారు. ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. చంద్రబాబు, పవన్‌లపై కూడా రాళ్ల దాడి జగరటంతో జగన్‌పై జరిగిన రాళ్ల దాడి వ్యవహారం ఒక్కసారిగా మరుగున పడింది.
దాడుల వెనుక అలజడులు సృష్టించేందుకు ఎవరిదైనా హస్తం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజకీయ అనిచ్చితిని రాష్ట్రంలో సృష్టించేందుకు ఎవరైనా ఈ దాడులు చేయించి ఉంటారనే భావన అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది.
రాయి దాడిపై పవన్ కళ్యాణ్ ఏమని స్పందించారో చూద్దాం...
ప్రతిపక్షాల మీద రాళ్లు విసిరిన వాళ్లు అప్పటికప్పుడే దొరికిపోతారు. అంత సెక్యూరిటీ ఉన్నా సీఎం మీద రాళ్లు విసిరిన వాళ్లు మాత్రం ఎవరో తెలియదు. ఒక్క ‘మనస్సాక్షి’కి తప్ప. చిన్న దెబ్బకే ఏ బంధమూ లేకపోయినా కళ్లబొల్లి ఏడ్పులు ఏడుస్తున్నారు. కన్నకూతురు తన తండ్రిని గొడ్డలితో నరికి చంపారని సునీతమ్మ ఎంత ఏడ్చినా పట్టించుకోరు. ఇదేమి చిత్రమో. పైగా సునీతమ్మపైనే నిందలు మోపుతారు. జగన్‌కు గాయమైతే రాష్ట్రానికి గాయమైందట. 15 ఏళ్ల అమర్‌ను కాల్చేస్తే గాయం కాలేదట. ప్రజలారా ఇక మీరే ఆలోచించుకోండి అంటూ తెనాలి సభలోనే పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్‌పై రాయి విసిరిన వ్యక్తి పలానా అని నేషనల్ మీడియాకు డీఎస్పీ సమాచారం ఇచ్చిన అనంతరం పవన్ చెప్పిన మాటలివి.
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ఈనెల 13న ప్రచారంలో పాల్గొన్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు జగన్‌ను రాళ్లతో కొట్టాలని పిలుపు నిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా డిస్‌ప్లే చేసి విలేకరులకు చూపించడం విశేషం.
గాజువాకలో రాయి విసిరిన వ్యక్తి గంజాయి మత్తులో చేసి ఉంటాడనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు వెనుకవైపు నుంచి లారీల చాటునుంచి రాయి విసిరాడు. ఆ రాయిన తరువాత చంద్రబాబు నాయుడు ఆ సభలోనే చేతిలో పట్టుకుని సభకు వచ్చిన ప్రజలకు చూపించడం విశేషం.
రాళ్ల రాజకీయం ద్వారా రాష్ట్ర ప్రజలకు నేతలు ఏమి చెప్పదలుచుకున్నారనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా చెప్పులు, రాళ్ల దాడులు జరగటం విశేషం. అంటే నేతలుగా మీరు పనికి రారని ఓటర్లు పరోక్షంగా సంకేతం ఇస్తున్నారా? రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయా? మొత్తంమీద ఏపీ రాజకీయాలు దేశంలో చర్చకు తెరలేపాయి.