Mumbai Politics | థానే ఆస్పత్రికి మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం షిండే

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను థానేలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఆయన కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు.

Update: 2024-12-03 11:42 GMT

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను థానేలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వ ఏర్పాటు తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆయన గత శుక్రవారం సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ ఆయనకు తీవ్ర జ్వరం వచ్చింది. మందులు వాడినా తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం థానేలోని ఆసుపత్రికి తీసుకొచ్చారు. షిండేకు అవసరమైన పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వైద్యులు చెప్పినట్లు సమాచారం.

చురుగ్గా ఏర్పాట్లు..

ఇదిలా ఉండగా డిసెంబర్ 5న మహారాష్ట్రలో కొత్త మహాయుతి ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాటు చేసుకుంటోంది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.

సీఎం ఫడ్నవీస్ ?

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం..సీఎం రేసులో బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. అయితే బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి పేరును రేపు (డిసెంబర్ 4) అధికారికంగా ప్రకటించనుంది. ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 అసెంబ్లీ స్థానాలకు గానూ 230 స్థానాలను మహాయుతి కైవసం చేసుకుంది. బీజేపీ 132 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, శివసేన (షిండే)కి 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయి.

Tags:    

Similar News