రిజర్వేషన్లపై ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ పవార్ డిమాండ్ ఏమిటి?

మహారాష్ట్రలో రిజర్వేషన్లను పెంచాలన్ని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ డిమాండ్‌కు శివసేన అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ ఎలా కౌంటర్ ఇచ్చారు?

Update: 2024-10-04 13:08 GMT

విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న 50 శాతానికి మించి రిజర్వేషన్లను పెంచేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని కోరారు. కోటా కోసం ఉద్యమిస్తున్న మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేటపుడు, ఇతర వర్గాలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తమిళనాడులో 78 శాతం (వివిధ వర్గాలకు కోటా) ఉంటే, మహారాష్ట్రలో 75 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేరని ప్రశ్నించారు. కోటా పరిమితిని పెంచేందుకు రాజ్యాంగ సవరణ తెస్తే మద్దతు ఇస్తామని ఆయన విలేఖరుల సమావేశంలో హామీ ఇచ్చారు. ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) నేతల మధ్య సీట్ల పంపకం చర్చలు వచ్చే వారం కూడా కొనసాగుతాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

MVA భాగస్వాములు NCP (SP), ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (UBT), కాంగ్రెస్ ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో ఉమ్మడిగా పోరాడి రాష్ట్రంలోని 48 స్థానాలకు గాను 30 స్థానాలను గెలుచుకుని అద్భుతమైన పనితీరును కనబరిచాయి. నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

కేంద్రానికి ప్రశంసలు..

మరాఠీకి "క్లాసికల్ లాంగ్వేజ్" ట్యాగ్‌ ఇవ్వడాన్ని NCP (SP) చీఫ్ స్వాగతిస్తూ.. కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు పవార్. మరాఠీ నేర్చుకోవడానికి ఇష్టపడే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, రాష్ట్రంలో మరాఠీ భాషా పాఠశాలలు మూసివేయడం గురించి ఆందోళనగా ఉందని, ఈ అంశంపై చర్చ నిర్వహించి సమస్య పరిష్కారానికి మార్గం కనుగొనాలని సూచించారు.

బకాయిల మాటేమిటి?

రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలతో వరాల జల్లు కురిపిస్తూనే ఇతర కార్యక్రమాలకు రావాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తోందని పవార్ ఆరోపించారు.“సాంగ్లీ క్యాన్సర్ ఆసుపత్రికి రూ.4 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా కేన్సర్‌ ఆసుపత్రులకు రూ.700 కోట్లు కావాలి. ప్రజాకర్షక పథకాలకు నిధులు మళ్లించడం వల్ల పాలన గాడి తప్పింది. వైద్యరంగంలో పరిస్థితి ఇలా ఉంటే మిగతా రంగాల సంగతి చెప్పనక్కర్లేదు.”అని పవార్ అన్నారు.

మహిళలకు ఆర్థిక సాయం అందించే 'లడ్కీ బహిన్' పథకం వల్ల ఇతర రంగాలకు సబ్సిడీని సకాలంలో అందదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించడంపై పవార్..’’ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటువంటి పథకాలను 'రెవ్డీ సంస్కృతి' అని పేర్కొన్నారని సమాధానమిచ్చారు.

అలాంటి ఆఫర్లేమీ ఇవ్వలేదు..

విపక్షాలు తనకు ప్రధానమంత్రి కుర్చీని చాలాసార్లు ఆఫర్ చేశాయని గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై పవార్ స్పందించారు. “మేము అలాంటి ఆఫర్లేమీ ఇవ్వలేదు. మాకు ఎంపీల సంఖ్యాబలమే లేనపుడు, అలాంటి ఆఫర్ ఎలా ఇస్తాం’’ అని సమాధానమిచ్చారు. తన శక్తి వెనుక ఉన్న "రహస్యాలు" గురించి అడిగిన ప్రశ్నకు.. అది తన వయస్సుతో పాటు పెరుగుతుందని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ మహారాష్ట్రలో పర్యటించే అవకాశం గురించి మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని 18 ర్యాలీల్లో ప్రసంగించారు. 14 నియోజకవర్గాల్లో వారి అభ్యర్థులు ఓడిపోయారు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆయన ర్యాలీల్లో ప్రసంగించాలి.’’ అని పవార్ చమత్కరించారు.

సీఎంగా ఉండి ఎందుకు చేయలేదు?

పవార్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని శివసేన అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ ప్రశ్నించారు.

“శరద్ పవార్ నాలుగు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీతో ఉంది. అప్పుడు ఆయనకు ఎందుకు గుర్తుకు రాలేదు? పవార్ పట్టించుకునే ఉంటే కోటా సమస్య చాలా కాలం క్రితమే పరిష్కారమయ్యేది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన ఎందుకోసం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు జనం గమనిస్తున్నారు. ప్రభుత్వం ఆ విషయంలో చేయగలిగినదంతా చేస్తోంది.’’ అని ఛత్రపతి శంభాజీనగర్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News