మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటుపై వీడని చిక్కుముడి..

మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు సీట్ల పంపకంపై నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని శివసేన (యుబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

Update: 2024-10-19 11:38 GMT

మహా వికాస్ అఘాడి (MVA) కూటమి భాగస్వాముల మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా.. సీట్ల పంపకాలపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి. మొత్తం 28 స్థానాలపైనే ప్రతిష్టంభన నెలకొంది. సీట్ల సర్దుబాటు విషయంలో ఇటు శివసేన (యుబీటీ) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌, అటు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వెనక్కు తగ్గడం లేదు.

రంగంలోకి రమేష్ చెన్నితాల..

సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో.. శివసేన (యుబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేను కలవడానికి కాంగ్రెస్ పార్టీ తన సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రమేష్ చెన్నితాలను ఆ పార్టీ శనివారం ముంబైకు పంపింది. సీట్ల సర్దుబాటుపై పటోలేతో చర్చలు జరపకూడదని శివసేన (యుబీటీ) నిర్ణయించుకున్నందువల్లే రమేష్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే థాకరే ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు రమేష్ ముంబై వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

విదర్భ సీట్ల విషయంలోనే..

పోలింగ్‌కు నెల రోజులు మాత్రమే సమయం ఉందని, సీట్ల సర్దుబాటుపై మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు త్వరగా నిర్ణయాలు తీసుకోలేకపోవడాన్ని రౌత్ తప్పుబట్టారు. ''ఎన్నికలకు చాలా తక్కువ సమయం మిగిలి ఉంది. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయాలు తీసుకోలేరు. వారు జాబితాను ఢిల్లీకి (కేంద్ర నాయకత్వం) పంపాలి. ఆపై చర్చలు జరుగుతాయి. (నియోజక వర్గాల కేటాయింపుపై) వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి’’ అని రౌత్ సూచించారు.

మా కార్యకర్తలు కోరుకుంటున్నది కరెక్టే..

తూర్పు విదర్భలో కాంగ్రెస్ కొన్ని సీట్లను వదులుకోడానికి నిరాకరిస్తుందని రౌత్ చెబుతూ..“విదర్భ మహారాష్ట్రలో ఒక భాగం. ప్రత్యేక రాష్ట్రం కాదు. మేము లోక్‌సభ ఎన్నికల్లో మేం ఎప్పటి నుంచో పోటీచేస్తున్న అమరావతి, రామ్‌టెక్‌లను కాంగ్రెస్‌కు కేటాయించాం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఎక్కువ సీట్లు రావాలని మా కార్యకర్తలు కోరుకుంటున్నారు. మేం ఆశించడంలో తప్పు లేదని అనిపిస్తుంది’’ అని పేర్కొన్నారు.

హైకమాండ్ నిర్ణయమే ఫైనల్..

మీడియా సమాచారం ప్రకారం.. రామ్‌టెక్‌, నాగ్‌పూర్‌లో కొన్ని సీట్లతో పాటు విదర్భ ప్రాంతంలో 10 సీట్ల కోసం శివసేన (UBT) పట్టుబడుతోంది. అయితే శివసేన డిమాండ్‌ను కాంగ్రెస్ చీఫ్ తిరస్కరించారు. ఆ స్థానాల నుంచి తమ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని నానా పటోలే అంటున్నారు. MVAలో 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలకు ప్రతిష్టంభన ఏర్పడిందని, సీట్ల సర్దుబాటుపై హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని చెప్పారు పటోలే.

“శివసేన (యుబీటీ) జాబితాలో దాదాపు 48 సీట్లు ఉన్నాయి. వాటిలో 18 స్థానాలను మేం వదులుకున్నాం. 25 నుంచి 30 సీట్లపై వివాదం నెలకొంది. ఈ విషయాన్ని మా పార్టీ హైకమాండ్‌కు తెలియజేశాం. మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేం కట్టుబడి ఉంటాం’’ అని పటోలే చెప్పారు.

సంబంధాలు తెగిపోయేలా వ్యవహరించొద్దు..

కాంగ్రెస్, శివసేన(యూబీటీ)కి కలిపి 100 సీట్లు, ఎన్‌సీపీ (ఎస్‌పీ)కి 88 సీట్ల ఫార్ములాను శివసేన(యూబీటీ) ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే పటోలే కాంగ్రెస్‌కు 125 స్థానాలు కేటాయించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. విదర్భలో సేన (యుబీటీ)తో సీట్లు సర్దుబాటుకు తాము సిద్ధంగా లేమని పటోలే స్పష్టం చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు సీట్ల సర్దుబాటు విషయంలో పార్టీల మధ్య సంబంధాలు తెగేలా వ్యవహరించొద్దని సేన (యుబీటీ) చీఫ్ థాకరే కూటమి పార్టీలకు హెచ్చరించినట్లు సమాచారం.

రెండ్రోజుల్లో ఫైనల్ చేస్తాం..

ప్రతిపక్ష కూటమిలోని భాగస్వామ్య పక్షాలు - కాంగ్రెస్, శివసేన (యుబీటీ), ఎన్‌సీపీ (ఎస్‌పీ) మధ్య సీట్ల పంపకం చర్చలు చివరి దశలో ఉన్నాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఫైనలయిపోతుందని థాకరే చెప్పారు. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ఎంవీఏను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని థాకరే నొక్కి చెప్పారు.

288 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags:    

Similar News