మహారాష్ట్ర ఎన్నికల్లో ‘రెబల్స్’ డేంజర్ బెల్స్..

మహారాష్ట్రలో రెబల్స్‌తో నామినేషన్లు విత్‌డ్రా చేయించడంలో పార్టీలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి? ఎంతమంది వెనక్కు తగ్గారు? తగ్గేదేలా అంటున్న వారెవరు?

Update: 2024-11-06 07:45 GMT

ఎన్నికలంటే మాటలు కాదు.. ప్రతి పార్టీకి ఎన్నో సవాళ్లు. ప్రతిబంధకాలు. పార్టీ టికెట్ దక్కని వారు రెబల్స్‌ బరిలోకి దిగడం సర్వసాధారణం. అయితే వీరిని ఒప్పించి వారితో నామినేషన్లను విత్‌డ్రా చేయించడం పార్టీలకు పెద్ద తలనొప్పి. రెబల్స్‌ను బరి నుంచి తప్పిస్తే తప్ప గెలవలేని పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి. అక్కడ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు కూటముల(అధికార మహాయుతి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ) మధ్య భీకర పోరు జరగబోతుంది. నవంబర్ 4న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో.. పార్టీలు తమ రెబల్స్‌కు నచ్చజెప్పి నామినేషన్లను విత్ డ్రా చేయించగలిగాయి. కొంతమంది మాత్రం తగ్గేదేలా అన్నట్లు బరిలో నిలిచారు.

రేస్‌లో 18 మంది రెబల్స్..

అధికార మహాయుతి కూటమి 25 మంది రెబర్ అభ్యర్థుల నామినేషన్లను విత్‌డ్రా చేయించగలిగింది. ఇంకా 18 మంది రేస్‌లో ఉన్నారు. బరి నుంచి తప్పుకున్న 25 మందిలో బీజేపీకి చెందిన 13 మంది, శివసేన (షిండే), అజిత్ పవార్ (ఎన్సీపీ) నుంచి ఆరుగురు చొప్పున ఉన్నారు. మిగిలిన 18 మంది రెబల్స్‌లో 9 మంది బీజేపీకి చెందినవారు కాగా ఆరుగురు షిండే సేన నుంచి, ముగ్గురు ఎన్‌సీపీ (అజిత్ పవార్) నుంచి బరిలో నిలిచారు.

MVA లో 22 మంది రెబల్స్..

ఇక మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి విషయానికొస్తే.. 20 మంది రెబల్స్‌తో నామినేషన్లు విత్‌డ్రా చేయించారు. మరో 22 మంది బరిలో ఉన్నారు. నామినేషన్లను ఉపసంహరించుకున్న వారిలో కాంగ్రెస్‌కు చెందిన 9 మంది, శివసేన (యుబీటీ) నుంచి ఏడుగురు, ఎన్‌సీపీ (ఎస్‌పీ) నుంచి నలుగురు ఉన్నారు. మిగిలిన 22 మంది రెబల్స్ అభ్యర్థుల్లో ఏడుగురు కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా.. 11 మంది శివసేన (యుబీటీ), నలుగురు ఎన్‌సీపీ (ఎస్‌పీ) నుంచి పోటీ చేస్తున్నారు.

బుజ్జగింపులతో వెనక్కు తగ్గిన బీజేపీ సీనియర్లు..

నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్న వ్యక్తులలో సీనియర్ బీజేపీ నాయకుడు, ముంబై నార్త్ మాజీ ఎంపీ గోపాల్ శెట్టి ఉన్నారు. ఈయన బోరివలి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఇక్కడి నుంచి పార్టీ అధికారిక అభ్యర్థి సంజయ్ ఉపాధ్యాయ పోటీ చేస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఢిల్లీ నుంచి విమానంలో వచ్చి మాట్లాడడంతో శెట్టి బరి నుంచి తప్పుకున్నారు.

అదే వరుసలో మరికొందరు..

ఉద్గీర్‌లో బీజేపీకి చెందిన విశ్వజిత్ గైక్వాడ్ అధికారిక మహాయుతి అభ్యర్థి సంజయ్ బన్సోడేపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అంధేరి (తూర్పు) నుంచి పోలీసు అధికారి ప్రదీప్ శర్మ భార్య స్వికృతి శర్మ కూడా బీజేపీ అధికారిక అభ్యర్థి ముర్జి పటేల్‌పై పోటీ చేసి తప్పుకున్నారు. వార్ధా జిల్లా ఆర్వీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే, రెబల్ దాదాబాహెబ్ కెచేను కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడేందుకు ఢిల్లీకి తీసుకువెళ్లారు. ఆయనతో మాట్లాడాక దాదాబాహెబ్ నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు.

అభ్యంతరాలున్నా.. బరిలో మాలిక్..

అయితే ముంబైలోని మన్‌ఖుర్ద్ శివాజీ నగర్, మహిమ్ నియోజకవర్గాలు మహాయుతి కూటమికి తలనొప్పిగా మారాయి. మన్‌ఖుర్డ్ శివాజీ నగర్‌లో దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న కారణంగా ఎన్‌సీపీ (అజిత్ పవార్) నాయకుడు నవాబ్ మాలిక్‌కు మద్దతు ఇవ్వడానికి బీజేపీ నిరాకరించింది. బదులుగా శివసేన (షిండే) అభ్యర్థి సురేష్ పాటిల్‌కు మద్దతు ఇస్తుందని ప్రకటించింది. బీజేపీ, షిండే సేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మాలిక్‌ను రంగంలోకి దించింది.

మహిమ్‌పై నిర్ణయం తీసుకుంటాం..

మహిమ్‌లో MNS చీఫ్ రాజ్ థాకరే కుమారుడు అమిత్‌కు బీజేపీ మద్దతు ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే శివసేన (షిండే) అభ్యర్థి సదా సర్వాంకర్ అందుకు నిరాకరించారు. సర్వాంకర్‌ను ఒప్పించలేకపోయినందుకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై శివసేన రాజ్ థాకరే ఆగ్రహంగా ఉన్నారు.

ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారం మాట్లాడుతూ.. “మా మాట విని తిరుగుబాటుదారులలో 95% మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు పోటీలో 2-3% మంది రెబల్స్ మాత్రమే ఉన్నారు. మూడు పార్టీలు అధికారిక మహాయుతి అభ్యర్థుల కోసం మాత్రమే ప్రచారం చేస్తాయి. మహిమ్‌పై చర్చించుకుంటున్నాం. త్వరలో ఒక నిర్ణయానికి వస్తాము.’’ అని చెప్పారు.

కాంగ్రెస్‌కు హ్యండిచ్చిన మధురిమా రాజే..

కొల్హాపూర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి మధురిమా రాజే ఛత్రపతి తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో పశ్చిమ మహారాష్ట్రలో హస్తం పార్టీకి ప్రాతినిధ్యం కరువైంది. కాంగ్రెస్ పార్టీ గతంలో లత్కర్‌ను ఈ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన్ను తప్పించి, మధురిమా రాజేకు కేటాయించారు. దాంతో లత్కర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇతన్నే బలపరిచే అవకాశం ఉంది.

వెనక్కు తగ్గిన హస్తం పార్టీ రెబల్స్..

కాంగ్రెస్ రెబల్స్ నాసిక్ సెంట్రల్ నుంచి హేమలతా పాటిల్, బైకుల్లా నుంచి మధు చవాన్, నందుర్బార్ నుంచి విశ్వనాథ్ వాల్వీ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మిత్రపక్షమైన శివసేన (యుబీటీ) మాజీ ఎమ్మెల్యే బాబూరావు మానే ధారావిలో నామినేషన్ విత్ డ్రా చేసుకోగా.. మరో మిత్రపక్షం, ఎన్సీపీ (ఎస్పీ), తిరుగుబాటుదారుడు సందీప్ బజోరియాను యవత్మాల్‌లో తన నామినేషన్‌ వెనక్కు తీసుకున్నారు.

తప్పుకుని మద్దతు ప్రకటించిన ముక్తార్..

కస్బా పేత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముక్తార్ షేక్ వైదొలిగారు. పార్టీ అధికారిక అభ్యర్థి రవీంద్ర ధంగేకర్‌కు మద్దతు ఆయన ప్రకటించారు. రెబల్స్‌ను బరి నుంచి తప్పించడంలో తాము సక్సెస్ అయ్యామని పార్టీ చెబుతోంది. తిరుగుబాటుదారులను శాంతింపజేసేందుకు రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ రమేష్ చెన్నితాల ఐదు రోజులుగా ముంబైలో మకాం వేశారు.

పార్టీ నుంచి బహిష్కరణ..

ఇదిలావుండగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఐదుగురు రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడంతో శివసేన (యుబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం వారిని బహిష్కరించారు. ఆ జాబితాలో భివాండి తూర్పు ఎమ్మెల్యే రూపేష్ మ్హత్రే, విశ్వాస్ నాందేకర్, చంద్రకాంత్ ఘుగుల్, సంజయ్ అవారి, ప్రసాద్ థాకరే ఉన్నారు.

6 స్థానాల నుంచి సమాజ్‌వాదీ అభ్యర్థులు..

MVA కూటమి అధికారంలోకి రావడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 10 స్థానాలపై ఇతర మిత్రపక్షాలతో సర్దుబాటు చర్చలు ఫలించలేదు. దాంతో సమాజ్‌వాదీ పార్టీ ఆరు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అబూ అసిమ్ అజ్మీ మాట్లాడుతూ.. "మమ్మల్ని చర్చలకు పిలవలేదు. వారు మాకు కేవలం రెండు సీట్లు (మన్‌ఖుర్డ్-శివాజీ నగర్ భివాండి ఈస్ట్) మాత్రమే ఇచ్చారని మాకు తెలిసింది. అయితే భివాండీ వెస్ట్, ఔరంగాబాద్ ఈస్ట్, మాలేగావ్ సెంట్రల్, ధులే సిటీ, పరండా, తుల్జాపూర్ అసెంబ్లీ స్థానాల నుంచి కూడా సమాజ్ వాదీ పార్టీ పోటీ చేస్తుందని అజ్మీ ప్రకటించారు.

Tags:    

Similar News