వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక.. మరి బీజేపీ నుంచి..

రాహుల్ స్థానాన్ని భర్తీ చేయాలనుకున్న కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంకను వయనాడ్ నుంచి పోటీ చేయించబోతుంది. ఈ నిర్ణయంపై బీజేపీ ఎలా రియాక్టయ్యింది?

Update: 2024-06-18 06:47 GMT

కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఖర్గే నిర్ణయాన్నికాంగ్రెస్ కేరళ యూనిట్ స్వాగతించింది. త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో ప్రియాంకను భారీ మెజార్టీతో గెలిపిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

రాయ్‌బరేలికే రాహుల్ మొగ్గు..

కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీతో పాటుగా వయనాడ్ నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలుపొందారు. పార్లమెంటుకు ఆయన ఒక నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. దాంతో రాహుల్ రాయ్‌బరేలీకే మొగ్గు చూపారు. వయనాడ్ నుంచి ప్రియాంక పోటీచేయనున్నారు.

వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికల్లో ప్రియాంక చారిత్రాత్మక విజయం సాధించడం ద్వారా ఆమె ప్రజాదరణ పొందిన వ్యక్తిగా గుర్తింపుపొందుతారని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు VD సతీశన్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.

‘సంతోషించదగ్గ విషయం’

ఇదే అభిప్రాయాన్నికెపిసిసి చీఫ్ కె సుధాకరన్ వ్యక్తం చేశారు. రాహుల్ వారసురాలిగా ప్రియాంక గాంధీని వయనాడ్‌ నుంచి ప్రాతినిధ్యం వహించాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకోవడం.. తనతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలందరికీ సంతోషకరమని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రియాంక రాక వయనాడ్ ప్రజలకు సంతోషకరమైన క్షణమని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కే మురళీధరన్ పేర్కొన్నారు. “వయనాడ్ ప్రజలకు ఇది సంతోషకర విషయం. ప్రస్తుతం ఉన్నపరిస్థితుల దృష్ట్యా రాహుల్ రాయ్ బరేలీని వదులుకోకూడదు. యూపీలో పార్టీ మళ్లీ జీవం పోసుకోవడానికి ఆయనే కారణం.’’ అని తెలిపారు.

‘వంశపారంపర్య రాజకీయాలు’

వయనాడ్ నుంచి రాహుల్ స్థానంలో ప్రియాంకను పోటీ చేయించడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. కాంగ్రెస్ "వంశపారంపర్య రాజకీయాలకు" పాల్పడుతోందని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా ఆరోపించారు. రాహుల్ గాంధీ వయనాడ్ సీటును ఖాళీ చేసి, ఆ స్థానాన్ని ఆయన సోదరి ప్రియాంకాతో భర్తీ చేయాలనుకోవడం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

“తల్లి (సోనియా గాంధీ) రాజ్యసభలో, కుమారుడు (రాహుల్ గాంధీ) లోక్‌సభలో ఉన్నారు. ప్రియాంక వయనాడ్ స్థానం నుంచి దిగువ సభలో ఉండాలనుకోవడం రాజవంశానికి ప్రతీక’’ అని ఆయన పేర్కొన్నారు.

రాయ్‌బరేలీ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాహుల్ గెలుపొందిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రాయ్‌బరేలీ సీటును వదలకూడదని రాహుల్ నిర్ణయించుకున్నారని, అలా చేస్తే ఉపఎన్నికల్లో ఆ స్థానం బీజేపీకి దక్కుతుందని ఆయనకు తెలుసని పూనావాలా పేర్కొన్నారు.

‘గెలవడం అంత సులభం కాదు’

రాహుల్ వాయనాడ్ సీటును ఖాళీ చేయడంపై బీజేపీ నేత అజయ్ అలోక్ కూడా విరుచుకుపడ్డారు.

“కానీ (ప్రియాంక గాంధీకి) ఎన్నికలు అంత సులభం కాదు. గట్టిగా పోటీ చేస్తాం. సహజంగానే కమ్యూనిస్ట్ పార్టీ కూడా మంచి ప్రయత్నం చేయబోతోంది. అయితే ఆమె వయనాడ్ నుండి గెలిస్తే అది లోక్‌సభలో ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రియాంకను ఎవరు పోటీకి దింపాలని నిర్ణయించారు? దాని వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సృష్టించడం కోసమేనా?” అని బీజేపీ నేత ప్రశ్నించారు.

మళ్లీ సురేంద్రన్‌కే ఛాన్స్..

వాయనాడ్ నుంచి బీజేపీ టికెట్‌పై రాహుల్‌పై పోటీ చేసిన కే సురేంద్రన్‌ను ఈ ఉపఎన్నికలో ప్రియాంక గాంధీపై పోటీకి దింపాలని భావిస్తోంది బీజేపీ.

Tags:    

Similar News