‘ప్రియాంకకు జమాతే ఇస్లామీ మద్దతిస్తోంది’

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తమ అభ్యర్థి సత్యన్‌ మొకేరి తరుపున ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రియాంకపై పలు విమర్శలు చేశారు.

Update: 2024-11-08 07:03 GMT

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో యూడీఎఫ్ తరపున హస్తం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఇక వామపక్ష అభ్యర్థిగా సత్యన్‌ మొకేరి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. మొకేరి ఎన్నికల ప్రచార సభలో ప్రియాంకాను లక్ష్యంగా చేసుకుని విజయన్ పలు విమర్శలు చేశారు. ఆమెకు జమాతే ఇస్లామీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. “కాంగ్రెస్ పార్టీ లౌకిక ముసుగు బట్టబయలైంది. ప్రియాంక గాంధీ జమాతే ఇస్లామీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. మనకు జమాతే ఇస్లామీ గురించి తెలియంది కాదు. ఆ సంస్థ దేశానికి, ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వదు. జమ్మూ కాశ్మీర్‌లో వాళ్లు చాలా కాలంగా ఎన్నికలను వ్యతిరేకించారు. తర్వాత వారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.’’ అని చెప్పారు.

అక్కడ బీజేపీతో జతకట్టారు..

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావిస్తూ.. జమాతే ఇస్లామీ అక్కడ మూడు లేదా నాలుగు స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. అయితే చివరికి సీపీఐ(ఎం) నాయకుడు మహ్మద్ యూసుఫ్ తరిగామి స్థానంపై దృష్టి సారించారు. ఆయనను ఓడించడమే లక్ష్యం. బీజేపీ కూడా అదే లక్ష్యంగా పనిచేసింది. అతివాదులు, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలు మాత్రం తరిగామిని ఎన్నుకున్నారు" అని చెప్పారు. వయనాడ్‌లోని జమాతే ఇస్లామీ కశ్మీర్‌లోని జమాతే ఇస్లామీకి భిన్నమైనవని కొందరి వాదనలను విజయన్ తప్పుబట్టారు." సంస్థ భావజాలం ఒకటే. కాశ్మీర్‌తో పొత్తుపెట్టుకున్నారు. ఇక్కడ యుడీఎఫ్‌కు మద్దతు ఇవ్వాలని చూస్తున్నారు. అంతే తేడా అని పేర్కొన్నారు.

‘‘లౌకికవాదం కోసం నిలబడే కాంగ్రెస్ మతోన్మాదులను వ్యతిరేకించగలరా?’’ అని ప్రశ్నించారు. ‘‘ముస్లిం లీగ్‌తో సహా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు జమాతే ఇస్లామీతో పొత్తును కొనసాగించడానికి త్యాగాలు చేస్తున్నాయని అన్నారు.

ఇక బీజేపీ అభ్యర్థిగా కోజికోడ్‌ కార్పొరేషన్‌ కౌన్సిలర్‌ నవ్య హరిదాస్‌‌ను కాషాయం పార్టీ బరిలోకి దింపింది. నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది.

రాహుల్ గాంధీ గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీచేసి రెండు చోట్ల గెలిచారు. అయితే పార్లమెంట్‌కు ఒక స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించాల్సి ఉండడంతో ఆయన వయనాడ్‌ను వదులుకున్నారు. దాంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

Tags:    

Similar News