‘ధ్యాన’ మోదీ
ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ముగిశాక ఈ సారి ఎక్కడకు వెళ్లారు? 2014, 2019లో ఆయన సందర్శించిన క్షేత్రాలేంటి?;
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కన్యాకుమారిలోని వివేకానంద స్మారక స్థూపం వద్ద ధ్యానం ప్రారంభించారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా జూన్ 1 వరకు ఆయన అక్కడే ఉండి ధ్యానం కొనసాగిస్తారు.
లోక్‌సభ చివరి దఫా ఎన్నికలు జూన్ 1వ తేదీ జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల కోసం ప్రధాని మోదీ గురువారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. అనంతరం తమిళనాడుకు సమీపంలోని భగవతి అమ్మన్ ఆలయంలో గురువారం ప్రార్థనలు చేశారు.
ఎన్నికల ప్రచారం ముగిశాక ప్రధాని మోదీ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టడం కొత్తేమి కాదు. 2019లో కేదార్‌నాథ్, 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్‌ను ఆయన సందర్శించారు.
కన్యాకుమారి భారతదేశానికి దక్షిణాన ఉంది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం కలిసే ప్రదేశం కూడా. పార్వతీ దేవి కూడా శివుని కోసం ఇక్కడే తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.
బిజెపి మూడోసారి అధికారంలోకి రావడం కోసం మోదీ దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. ర్యాలీలు, రోడ్‌షోలు కలుపుకొని 75 రోజుల్లో దాదాపు 206 ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ మీడియా ఛానళ్లకు దాదాపు 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు.
543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.