‘హర్యానాలాగే మహారాష్ట్రలో..మళ్లీ అధికారంలోకి మహాయుతి కూటమి’

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి "అద్భుతమైన" మెజారిటీతో గెలుస్తుందని మహారాష్ట్ర సీఎం షిండే విశ్వాసం వ్యక్తం చేశారు.

Update: 2024-10-18 07:51 GMT

హర్యానాలో బీజేపీ గెలుపును ఉటంకిస్తూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి సంకీర్ణం "అద్భుతమైన" మెజారిటీతో గెలుస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విశ్వాసం వ్యక్తం చేశారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఎన్‌డీఏ ముఖ్యమంత్రుల మండలి సమావేశానికి హాజరైన షిండే.. చండీగఢ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పూణె విమానాశ్రయంలో గురువారం అర్థరాత్రి విలేకరులతో మాట్లాడారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి సారించారని షిండే చెప్పారు. ఇలాంటి సమావేశాలు ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని ఏకాభిప్రాయం వ్యక్తమైందని చెప్పారు.

హర్యానా ఫలితాలు మహారాష్ట్రలో..

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో మొత్తం 90 స్థానాలకు గాను 48 సీట్లు గెలుచుకుని బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. "హర్యానాలోని ప్రజలు 'డబుల్ ఇంజిన్' సర్కారుకు ఓటు వేశారు. ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సంక్షేమ పథకాలకు మెచ్చి జనం కాషాయ పార్టీకి పట్టంకట్టారు. మేము 'లడ్కీ బహిన్ యోజన' సహా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం. హర్యానా ఫలితాలు మహారాష్ట్రలోనూ పునరావృతమవుతాయి.” అని షిండే పేర్కొన్నారు. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

శివసేనకు నేతృత్వం వహిస్తున్న షిండే, బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మహాయుతి కూటమిలో భాగస్వాములు. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన (UBT), శరద్ పవార్ NCP (SP) ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) భాగస్వాములు. ఈ రెండు కూటముల మధ్య ఉత్కంఠభరిత పోరు సాగనుంది.

లోక్‌సభ ఎన్నికల్లో పాలక కూటమి సత్తాచాటలేకపోయింది. అయితే ఈ సారి ఓటర్లను ఆకట్టుకునేందుకు మహాయుతి ప్రభుత్వం లడ్కీ బహిన్ యోజన పథకంపై ఆధారపడింది.

Tags:    

Similar News