2024 ఎన్నికలు: మహారాష్ట్రలో రెండు కూటముల మధ్య భీకర పోరు..

మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) అధికారమే లక్ష్యంగా పోటీకి దిగాయి.

Update: 2024-11-17 13:36 GMT

మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెండు శివసేన వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అదే తరహా పోరు శరద్ పవార్, అతని మేనల్లుడు అజిత్ పవార్ నేతృత్వంలోని రెండు NCP వర్గాలు కూడా నడుస్తోంది.

రెండు ప్రాంతీయ శక్తులు విడిపోయిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో మహారాష్ట్రలోని ఈ నలుగురు అగ్రనేతలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షే అని చెప్పాలి.

ఎన్‌సీపీకి చెందిన 52 మంది శాసనసభ్యులలో 40 మంది అజిత్ పవార్‌కు మద్దతు ఇవ్వడంతో పోల్ ప్యానెల్ అజిత్ పవార్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అలాగే బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన పార్టీ విల్లు, బాణం గుర్తును ఎన్నికల సంఘం ఏక్నాథ్ షిండే శివసేన వర్గానికి కేటాయించింది.

కోస్టల్ బెల్ట్‌లో సేన vs సేన

288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 75 స్థానాలు ఉన్న థానే-కొంకణ్ (39 సీట్లు), ముంబై రీజియన్ (36 సీట్లు)లోని 47 స్థానాల్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన (UBT), ఏక్నాథ్ షిండే శివసేన ప్రత్యక్ష పోటీలో ఉన్నాయి.

ముంబయి, థానే, కళ్యాణ్, పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి-సింధుదుర్గ్ జిల్లాల్లో విస్తరించి ఉన్న తీరప్రాంతం అవిభక్త శివసేనకు కంచుకోట అని చెబుతారు. నారాయణ్ రాణే వంటి సీనియర్ నాయకుల తిరుగుబాటు తర్వాత కూడా ఈ ప్రాంతంలో పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికలలో ఉద్ధవ్ వర్గం 9 నియోజకవర్గాలతో పోలిస్తే థానే, కళ్యాణ్, ముంబై నార్త్ వెస్ట్‌లతో సహా 7 స్థానాలను షిండే వర్గం సత్తా చాటింది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిశితంగా పరిశీలిస్తే.. షిండే సేనకు సేన (యుబీటీ) గణనీయమైన రాజకీయ స్థలాన్ని కేటాయించి ఉండవచ్చు. అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికొస్తే.. కోస్టల్ బెల్ట్‌లోని 75 సీట్లలో 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో MVA ఆధిక్యంలో ఉండగా... అధికార మహాయుతి 48 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఈ ఎన్నికలు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సేనకు వాస్తవంగా అస్తిత్వ యుద్ధం. ఎందుకంటే నలుగురు మాజీ ఎంపీలలో ఇద్దరు, కొంకణ్‌లోని 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 20 మందికి పైగా నాయకులు షిండే నేతృత్వంలోని సేనలోకి మారారు.

2019 అసెంబ్లీ ఎన్నికలలో అవిభక్త సేన 29 సీట్లు గెలుచుకుంది. అప్పటి మిత్రపక్షమైన బీజేపీ 27 సీట్లు గెలుచుకుంది. దాంతో మొత్తం 56కి చేరుకుంది. బీజేపీ-సేన కూటమి అప్పుడు కాంగ్రెస్, NCPకి 15 కంటే తక్కువ స్థానాలు ఇచ్చి దాని ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.

కీలక పోరు ఎక్కడెక్కడంటే..

వర్గీ నియోజకవర్గంలో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య థాకరే, ప్రత్యర్థి సేన వర్గం నుంచి మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా పోటీ పడుతున్నారు. థానేలోని కోప్రి పచ్చడి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే..తన గురువు, దివంగత శివసేన నాయకుడు ఆనంద్ డిఘే మేనల్లుడు కేదార్ దిఘేతో పోటీ పడుతున్నారు.

అయితే మహిమ్ అసెంబ్లీ నియోజకవర్గంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. షిండే సేన తన సిట్టింగ్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్‌ను బరిలోకి దించగా.. సేన (యుబీటీ) మహేష్ సావంత్‌ను రంగంలోకి దించింది. రాజ్ థాకరే తన కుమారుడు అమిత్‌ను ఇక్కడి నుంచి బరిలో దింపారు. అమిత్ మొదట్లో BJP మద్దతు కూడా పొందగలిగాడు. అయితే సర్వాంకర్‌కు మద్దతు ఇవ్వాలని షిండే సేన ఒత్తిడి చేయడంతో కాషాయ పార్టీ వెనక్కి తగ్గింది.

NCP vs NCP..

మహారాష్ట్రలోని 38 స్థానాల్లో శరద్ పవార్ NCP (SP) అజిత్ పవార్ నేతృత్వంలోని NCP మధ్య పోరు ఉండబోతుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 10 స్థానాల్లో ఈ రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే NCP (SP) 8 సీట్లు గెలుచుకోగా..అజిత్ పవార్ వర్గం పోటీ చేసిన నాలుగు స్థానాల్లో ఒక్కటిని మాత్రమే గెలుచుకోగలిగింది.

మహాయుతిలో సీట్ల సర్దుబాటు ప్రకారం..

అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ ఎనిమిది స్థానాల్లో స్నేహపూర్వక పోటీతో సహా మొత్తం 60 స్థానాల్లో పోటీ చేస్తోంది. MVAలో సీట్ల షేరింగ్ ప్రకారం NCP (SP) ఒక స్నేహపూర్వక పోరుతో సహా 86 స్థానాల్లో పోటీ చేస్తోంది.

ఈ సారి కూడా శరద్ పవార్‌కు మేనల్లుడిపై ఎడ్జ్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అజిత్ పార్టీ నుంచి బయటకు వెళ్లి మహాయుతి కూటమిలో చేరడంతో శరత్ పవార్‌కు సానుభూతి చేకూర్చే అంశం. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ ఎన్‌సీపీ కంటే ఎన్‌సీపీ (ఎస్‌పీ) విజేతల సంఖ్య ఎక్కువగా ఉంటే ఆశ్చర్యపోనవసరం లేదు. శరద్ పవార్ వర్గం ఇప్పటికే అజిత్ పవార్ కంటే దాదాపు 30 స్థానాల్లో ఎక్కువగా పోటీ చేస్తోంది. ప్రస్తుతం 40 మంది ఎన్‌సీపీ శాసనసభ్యులు అజిత్ పవార్‌కు మద్దతు ఇస్తున్నారు. మిగిలిన 12 మంది శరత్ పవార్‌తో ఉన్నారు.

కీలక స్థానం భారామతి ..

అందరి దృష్టి భారామతిపైనే ఉంది. పవార్ల కుటుంబానికి కంచుకోటగా భావించే ఈ నియోజకవర్గంలో ఈ సారి అజిత్ పవార్ తన మేనల్లుడు యుగేంద్ర పవార్‌తో తలపడుతున్నారు. అజిత్ 1991 నుంచి ఇక్కడి నుంచి విజయం సాధిస్తున్నారు.

నాసిక్ జిల్లాలో మూడు ఎన్సీపీ వర్సెస్ ఎన్సీపీ పోరు జరుగుతోంది. కేబినెట్ మంత్రి, OBC నాయకుడు ఛగన్ భుజ్‌బల్ యోలా నియోజకవర్గంలో NCP (SP)కి చెందిన మరాఠా నాయకుడు మాణిక్‌రావ్ షిండేపై పోటీపడుతున్నారు. మరాఠా-ఓబీసీ పోలరైజేషన్ ఇక్కడ ప్రభావం చూపే అవకాశం ఉంది.

కొంతమంది కీలక ఎన్‌సీపీ (ఎస్‌పి) నాయకులకు గట్టి పోటీ ఇచ్చేందుకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇస్లాంపూర్‌లో రాష్ట్ర ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ జయంత్ పాటిల్, తాస్గావ్‌లో రోహిత్ ఆర్ఆర్ పాటిల్, పార్నర్‌లో రాణి లంకే, షిరూర్‌లో సిట్టింగ్ శాసనసభ్యులు అశోక్ పవార్, ఫాల్టాన్‌లో దీపక్ చవాన్, సింధ్‌ఖేడ్ రాజాలో రాజేంద్ర శింగనే, ముంబ్రాలో జితేంద్ర అవద్‌లకు గట్టి సవాల్ విసిరారు. 

Tags:    

Similar News