‘మహారాష్ట్రలో నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణం బీజేపీ’

"యువతీ, యువకులు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి ఉపాధి దొరకడం లేదు. ’’ - ప్రియాంక

Update: 2024-11-17 11:32 GMT

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలను సంధించారు. భారీ ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించడం వల్లే మహారాష్ట్రలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆరోపించారు. నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అక్కడి గడ్చిరోలి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక ప్రసంగించారు. ఫాక్స్‌కాన్‌, ఎయిర్‌బస్‌ ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించడం వల్లే ఇక్కడ యువతకు ఉద్యోగాల్లేకుండా పోయాయన్నారు.

"యువతీ, యువకులు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి ఉపాధి దొరకడం లేదు. 2.5 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటికి భర్తీ చేయడం లేదు. దేశంలో యువకుల ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి కారణం నిరుద్యోగ సమస్య. ’’ అని పేర్కొన్నారు.

"ఈ దేశంలో నిజంగా సురక్షితంగా ఉన్నది వ్యాపారవేత్త అదానీ మాత్రమే. ఎందుకంటే విమానాశ్రయాలు, ఓడరేవులు, పెద్ద పెద్ద కంపెనీలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు ఒక వ్యక్తికి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పట్టికైనా జాతీయ ఆస్తులను ఒకరికే కేటాయించకుండా ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అదానీ కంపెనీలకు ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల్లో గిరిజనుల భూములను కేటాయిస్తున్నారు. ఎన్ని గిరిజనుల భూములు ఇచ్చారో ఛత్తీస్‌గఢ్ ప్రజలను అడగండి?’’ అని బీజేపీని కడిగి పారేశారు.

‘‘లడ్కీ బహిన్ పథకం’’ గురించి ప్రియాంక మాట్లాడుతూ.. మహిళలు మెరుగైన జీవితం కోసం ఓటు వేయాలని, తమకు నెలకు రూ. 1,500 అందుతున్నందున కాదని అన్నారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) అధికారంలోకి వస్తే సోయాబీన్ పంటకు క్వింటాంకు రూ. 7,000 కనీస మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్ నాయకురాలు చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు లేవనెత్తిన "ఏక్ హై టు సేఫ్ హై" (మనం ఐక్యంగా ఉంటే, మేము సురక్షితంగా ఉంటాం) అనే నినాదంపై సోనియా స్పందించారు. 'సేఫ్' అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయని, ఒకటి భద్రత, మరొకటి ఖజానా అని పేర్కొన్నారు.

జవాబుదారితనం లోపించింది..

పాలనలో బీజేపీ వాళ్లకు జవాబుదారీతనం లోపించిందని ప్రియాంక విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండేవారని..అయితే బీజేపీ హయాంలో ఆ జవాబుదారీతనం లోపించిందన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని మంత్రి ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు.

‘‘వారి ప్రవర్తనే భిన్నంగా ఉంటుంది. అధికార కూటమి నాయకులు వాస్తవ సమస్యల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని, సమాజాన్ని పోలరైజ్ చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News