పార్లమెంటరీ డిఎంకె పార్టీ నాయకురాలిగా కనిమొళి

డీఎంకే పార్టీ పార్లమెంటరీ నేతగా కనిమొళి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

Update: 2024-06-11 06:13 GMT

డీఎంకే పార్టీ పార్లమెంటరీ నేతగా కనిమొళి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. తూత్తుకుడి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందిన విషయం తెలిసిందే. గతంలో ఈ బాధ్యతలు శ్రీపెరంబుదూర్ ఎంపి టిఆర్ బాలు డీఎంకే బాలు నిర్వహించారు.

చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దయానిధి మారన్ లోక్‌సభలో పార్టీ ఉపనేతగా వ్యవహరిస్తారని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నీలగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికయిన కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా లోక్‌సభ విప్‌గా, తిరుచ్చి ఎన్ శివ రాజ్యసభలో డీఎంకే నాయకుడిగా కొనసాగనున్నారు.

డీఎంకే ట్రేడ్ యూనియన్ ఎల్‌పీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎం షణ్ముగం రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా, సీనియర్ న్యాయవాది పీ విల్సన్ రాజ్యసభలో పార్టీ విప్‌గా, అరక్కోణం ఎంపీ ఎస్ జెగత్రాట్‌చగన్‌ డీఎంకే కోశాధికారిగా ఉభయ సభలకు వ్యవహరించనున్నారు.

కనిమొళి గురించి క్లుప్తంగా..

డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి కరుణానిధి. వృత్తి రీత్యా జర్నలిస్ట్ అయిన ఈమె 2007లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికై వివిధ కమిటీల్లో సభ్యురాలిగా కొనసాగారు. 2009 వరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కమిటీలో సభ్యురాలిగా, 2009లో విదేశీ వ్యవహారాల కాన్సులేటివ్ కమిటీ, పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఆహార నిర్వహణపై ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీలో సభ్యురాలిగా కొనసాగారు. 2010లో గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటు చేసిన కమిటీలో కనిమొళి సభ్యురాలిగా వ్యవహరించారు. 2012లో హోమ్ అఫైర్స్ కమిటీలో సభ్యురాలిగా పని చేశారు. 2012 ఆగస్టు నుంచి మానవ వనరుల అభివృద్ధిపై విద్యా హక్కు చట్టం అమలు కోసం ఏర్పాటైన సబ్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. ఇక 2012లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ జనరల్ అసెంబ్లీలో సభ్యురాలిగా కనిమొళి సేవలు అందించారు.

ఉత్తమ పార్లమెంటేరియన్‌గా..

ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు అందుకున్న కనిమొళి 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. దేశాన్నికుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కనిమొళికి చివరికి సుప్రీంకోర్టులో ఊరట కల్పించింది. సరైన ఆధారాలు లేని కారణంతో కనిమొళి సహా మొత్తం 14 మందిని సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

వ్యక్తిగత జీవితం..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరిలకు ఈమె సోదరి. కనిమొళి భర్త పేరు జి. అరవిందన్. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు కనిమొళి కవయిత్రిగా, జర్నలిస్ట్‌గా పనిచేశారు. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. కుంగుమం అనే తమిళ వార పత్రికకు ఇన్‌ఛార్జ్ ఎడిటర్‌గానూ పని చేశారు.

Tags:    

Similar News