జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో ‘కుటుంబ ఆధిపత్య’ పోరు..

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బర్హైత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా..మాజీ సీఎం చంపై సోరేన్ బీజేపీ తరుపున సరైకెలా నుంచి బరిలో దిగుతున్నారు.

Update: 2024-10-27 08:32 GMT

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. రెండు దశల్లో జరిగే ఎన్నికలలో కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో రాజకీయ కుటుంబాల సభ్యులు పోటీపడుతున్నారు. ఈ సారి చాలావరకు పాతవాళ్లే పోటీచేస్తుండంగా.. కొన్ని కొత్త ముఖాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బర్హైత్ నియోజకవర్గం నుంచి, ఆయన భార్య కల్పనా సోరెన్ గాండే స్థానం నుంచి పోటీ చేయనుండగా..హేమంత్ సోదరుడు బసంత్ దుమ్కా నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) తరపున పోటీకి దిగుతున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో లోక్‌సభకు ఎన్నికైన జేఎంఎం సీనియర్‌ నేతలు జోబా మాఝీ, నలిన్‌ సోరెన్‌ కుమారులకు మనోహర్‌పూర్‌, షికారిపరా స్థానాలను కేటాయించారు.

JMM టర్న్‌కోట్, మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బీజేపీ టిక్కెట్‌పై సరైకెలా నుంచి పోటీ చేయనుండగా, ఆయన కుమారుడు బాబులాల్ సోరెన్ కూడా ఘట్‌సిలా నుంచి బరిలో దిగారు. హేమంత్ కోడలు సీతా సోరెన్ జమతారా స్థానం దక్కించుకున్నారు.

ఇక మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ సాహు జంషెడ్‌పూర్ ఈస్ట్ స్థానానికి పోటీ చేయగా, మరో మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా ముండాకు పొత్కా స్థానం దక్కింది. ఎన్నికలలో తలపడుతున్న ప్రధాన వ్యక్తుల వివరాలు క్లుప్తంగా మీ కోసం..

1. హేమంత్ సోరెన్ (JMM) - బర్హైత్

హేమంత్ సోరెన్ 2014, 2019 ఎన్నికలలో బర్హైత్ స్థానం నుంచి గెలుపొందారు. ఈ ఏడాది ప్రారంభంలో ఒక ల్యాండ్ డీల్‌కు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలతో ఆయనను ED అరెస్టు చేసింది. హేమంత్ 2010 నుంచి 2012 వరకు బీజేపీ నేతృత్వంలోని అర్జున్ ముండా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం కూలిపోవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. 2013లో 38 ఏళ్ళ వయసులో కాంగ్రెస్, RJD మద్దతుతో జార్ఖండ్‌‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కొంతకాలం మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. 2014లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో రఘుబర్ దాస్ ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో హేమంత్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 2016లో BJP నేతృత్వంలోని ప్రభుత్వం చోటానాగ్‌పూర్ కౌలు చట్టం, సంతాల్ పరగణ కౌలు చట్టాన్ని సవరించి గిరిజనుల భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం లీజుకు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు భారీ ఆందోళనకు నాయకత్వం వహించాడు హేమంత్. 2019లో రెండోసారి కాంగ్రెస్, RJD మద్దతుతో మళ్లీ అధికారంలోకి వచ్చారు. JMM ఒంటరిగా 30 స్థానాలను గెలుచుకుంది. 81 మంది సభ్యుల సభలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థానాలను గెలుచుకుంది. గత రెండు ఎన్నికల్లో బర్హైత్‌లో హేమంత్ ఓట్ల శాతం క్రమంగా పెరిగింది. అయితే అవినీతి ఆరోపణలు, అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం చంపై సోరెన్‌ కూడా ఇటీవల బీజేపీలో చేరి, ఆయన కూడా ఈ సారి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికలు జార్ఖండ్ వాసులకు ఆసక్తికరంగా మారాయి.

2. కల్పనా సోరెన్ (JMM) - గాండే

ఈ ఏడాది జనవరిలో హేమంత్ అరెస్టయిన తర్వాత కల్పన సోరెన్ రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి ఆమె రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారారు. జూన్‌లో జరిగిన గండే ఉపఎన్నికల్లో ఆమె గెలుపొందారు. ఈ సారి ఎన్నికల JMM స్టార్ క్యాంపెనయిర్‌ మారారు.

ఇంజనీరింగ్, MBA పూర్తి చేసిన కల్పన హిందీ, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఢిల్లీలో జరిగిన AAP ర్యాలీలో ఆమె ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్షం తరపున ప్రచారం చేసి, 6 వేల ఓట్ల తేడాతో గాండే ఉప ఎన్నికల్లో గెలుపొందారు. కల్పన జార్ఖండ్ అంతటా 70 బహిరంగ సభలను నిర్వహించి మహిళలకు నగదు బదిలీ పథకం ‘మైయాన్ సమ్మాన్ యోజన’ గురించి విస్తృత ప్రచారం చేశారు. JMM తరుపున ముమ్మరంగా ప్రచారం చేస్తే మహిళా ఓట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

3. చంపై సోరెన్ (బీజేపీ) - సరైకేలా

JMM తరపున సరైకేలా స్థానం నుంచి 6 సార్లు గెలుపొందిన "టైగర్ ఆఫ్ జార్ఖండ్"గా పేరున్న చంపై సోరెన్ ఈసారి బీజేపీ తరుపున రంగంలోకి దిగుతున్నారు. హేమంత్ తండ్రి శిబు సోరెన్‌తో కలిసి జార్ఖండ్ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన చంపై ఈ సంవత్సరం ప్రారంభంలో హేమంత్ అరెస్టు కావడంతో కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. జూన్‌లో తిరిగి హేమంత్ బెయిల్‌పై విడుదల కావడంతో సీఎం పదవి వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన కాషాయపార్టీలో మారారు. గిరిజన ప్రాంతాల్లోనూ చంపైకి మంచి పట్టుంది. ఈ సారి గిరిజనులు ఓట్ల చీలికతో BJP గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది మొదట్లో జరిగిన సాధారణ ఎన్నికలలో BJP షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన ఐదు లోక్‌సభ స్థానాలు మినహా అన్ని స్థానాల్లో గెలుపొందింది. ఐదింటిలో కాంగ్రెస్ 2, JMM మూడు స్థానాలు దక్కించుకుంది. గిరిజనుల ఓట్లను చీల్చగలిగితే.. జార్ఖండ్‌ను బీజేపీ తిరిగి కైవసం చేసుకునే అవకాశం ఉంది. చంపై కుమారుడు బాబులాల్ సోరెన్‌కు కూడా ఘట్‌సీల నుంచి టిక్కెట్‌ దక్కడంతో బీజేపీ గెలుపునకు చంపై తీవ్రంగా శ్రమించవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

4. బాబూలాల్ మరాండీ (బీజేపీ) - ధన్వర్

ఉపాధ్యాయుడి నుంచి రాజకీయవేత్తగా ఎదిగిన బాబులాల్ మరాండీ జార్ఖండ్ మొదటి ముఖ్యమంత్రి. 1998 లోక్‌సభ ఎన్నికలలో దుమ్కా నుంచి పోటీచేసిన JMM వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌ను ఓడించారు. బీజేపీ జార్ఖండ్ యూనిట్ చీఫ్‌గా ఉంటూనే.. అదే ఏడాదిలో జార్ఖండ్ ప్రాంతంలోని 14 లోక్‌సభ స్థానాల్లో 12 స్థానాలను గెలిపించడంలో విశేష కృషి చేశారు. 2000 నుంచి 2003 వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గిరిజనుల ఆధిపత్య రాష్ట్రానికి పలు అభివృద్ధి పనులు చేయించారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో జార్ఖండ్‌లోని ఇతర NDA సిట్టింగ్ ఎంపీలందరూ ఓడిపోగా..మరాండీ మాత్రం కోదర్మా స్థానం నుంచి గెలుపొందారు. బీజేపీతో విభేదాల నేపథ్యంలో చివరికి మరాండీ 2006లో పార్టీని వీడి జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం)ని ప్రారంభించారు. 2009లో మళ్లీ కోదర్మా నుంచి జేవీఎం తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అయితే 2014 నాటి నరేంద్ర మోదీ వేవ్‌ను అధిగమించడంలో JVM విఫలమైంది. మరాండీ పార్టీ రాష్ట్రంలో ఏ ఒక్క సీటుకూడా గెలుచుకోలేకపోయింది. మరోవైపు 14 పార్లమెంట్ స్థానాలకు 12 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కోడెర్మాలో బీజేపీ అభ్యర్థి రవీంద్ర కుమార్‌రే మరాండీని ఓడించారు.

2019 ఎన్నికలలో BJP గిరిజన సీట్లలో రెండింటికే పరిమితమైంది. JMM నేతృత్వంలోని కూటమి 28 ST-రిజర్వ్‌డ్ స్థానాల్లో 25 గెలుచుకుంది. ఈ ఓటమి కారణంగా మరాండీతో BJP తన సంబంధాలను సరిదిద్దుకుంది. ఫిబ్రవరి 2020లో మరాండీ తన పార్టీ JVMని కుంకుమ పార్టీతో విలీనం చేశారు. దీంతో 2022లో మరాండీని బీజేపీ స్టేట్ చీఫ్‌గా తిరిగి నియమించారు.

5. మహువా మాజి (JMM) - రాంచీ

JMM రాజ్యసభ ఎంపీ మహువా మాజి కూడా జార్ఖండ్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి. రాంచీ స్థానం నుంచి గతంలో రెండుసార్లు ఓడిపోయి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో బీజేపీ నేత చంద్రేశ్వర్ ప్రసాద్ సింగ్‌

చేతిలో మాజి వరుసగా రెండోసారి ఓడిపోయారు. JMM మొదటి మహిళా రాజ్యసభ MP, జార్ఖండ్ మహిళా కమిషన్ మాజీ చీఫ్ అయిన మహువా ఈసారి రాంచీలో ఎలా రాణిస్తారో వేచి చూడాలి.

6. సీతా సోరెన్ (బీజేపీ) - జమ్తారా

సోరెన్ కుటుంబానికి చెందిన సీతా సోరెన్ - హేమంత్ అన్నయ్య దుర్గా సోరెన్ భార్య. శిబు సోరెన్ తన రాజకీయ వారసుడిగా దుర్గా సోరెన్‌ను మొదట ఎంపిక చేసుకున్నారు. అయితే 2009లో దుర్గా సోరెన్‌ చనిపోయారు. ఈ సంవత్సరం ప్రారంభంలో JMMను వీడి బీజేపీలో చేరారు సీతా సోరెన్. హేమంత్ సోరెన్ అరెస్ట్ నేపథ్యంలో తరువాత ముఖ్యమంత్రి కల్పన అవుతారని బాగా ప్రచారం జరిగింది. తనకు పార్టీ తగిన గౌరవం దక్కడం లేదని సీతా సోరెన్ JMM ను వీడి కాషాయ పార్టీతో జతకట్టారు. అయితే హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత సీనియర్ నాయకుడు చంపై సీఎం అయ్యారు. జామా అసెంబ్లీ స్థానం నుంచి సీత మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో JMM జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా. ప్రస్తుతం బీజేపీ తరపున జామా స్థానం నుంచి సీత పోటీ చేయడం లేదు. 2014, 2019లో రెండుసార్లు సీత చేతిలో ఓడిపోయిన సురేష్ ముర్ముని జామా నుంచి తన అభ్యర్థిగా నిలబెడుతోంది. సురేష్ ఈ స్థానం నుంచి రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే, కేబినెట్ మంత్రి అయిన ఇర్ఫాన్ అన్సారీతో పోటీ పడుతున్నారు. సోరెన్ కొడలిగా తన సత్తా చాటుకోడానికి ఈ ఎన్నికలు ఆమెకు అగ్ని పరీక్షే.

7. బసంత్ సోరెన్ (JMM) - దుమ్కా

హేమంత్ తమ్ముడు బసంత్ సోరెన్. 2016 రాజ్యసభ ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2020లో పోటీ చేసేందుకు మరో అవకాశం వచ్చింది. హేమంత్ సోరెన్ గతంలో బర్హైత్‌తో పాటు దుమ్కా స్థానం నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల గెలుపొందారు. అయితే బర్హైత్‌ నుంచి మాత్రమే ప్రాతినిథ్యం వహించడంతో బసంత్ JMM అభ్యర్థిగా దుమ్కా ఉపఎన్నికల్లో పోటీ చేసి 6,842 ఓట్ల తేడాతో BJPకి చెందిన లూయిస్ మరాండీని ఓడించాడు. చంపై సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా బసంత్‌కు ఈ ఏడాది ప్రారంభంలో రెండో అవకాశం వచ్చింది. బసంత్ ప్రతిష్టాత్మకమైన దుమ్కా సీటును ఈ సారి నిలబెట్టుకోగలడో? లేదో వచ్చే నెలలో తేలిపోనుంది.

Tags:    

Similar News