యూపీలో ఎస్సీలు, మహారాష్ట్రలో ఓబీసీలను బీజేపీ ఎలా ఆకట్టుకోబోతుంది?

లోక్‌సభ ఎన్నికలలో యూపీలో, మహారాష్ట్రలో సత్తా చాటలేకపోయిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికలలో పుంజుకోవాలని చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Update: 2024-10-20 08:23 GMT

దశాబ్ద కాలంలో తొలిసారి లోక్‌సభలో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో మహాయుతి కూటమి చేతిలో అధికార పగ్గాలున్నా.. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది. ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించని నేతలకు ఓటమికి కారణాలు తెలిశాయి. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని అసంతృప్త దళిత ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సభ్యత్వ నమోదుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక మహారాష్ట్రలో ఓబీసీకి 'నాన్-క్రిమీ లేయర్' ఆదాయ పరిమితిని పెంచడం ద్వారా ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మోదీ చరిష్మా గెలిపించలేకపోయింది.

అయోధ్య రామమందిర పవిత్రోత్సవం, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న ఆదరణతో ఉత్తరప్రదేశ్‌లో మెజారిటీ సీట్లు వస్తాయని బీజేపీ నాయకత్వం భావించింది. అయితే ఆశించిన రిజల్ట్ రాలేదు. మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్‌లో జరిగే ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గట్టిపోటీ ఇవ్వాలని పార్టీ సీనియర్ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ పతనావస్థకు చెక్ పెట్టేందుకు కాషాయనాథులు స్కెచ్ కూడా సిద్ధం చేశారు.

యూపీలో బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్..

సంఘ్‌ పరివార్‌ సభ్యులతో సమన్వయంలోపం వల్ల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పేలవమైన ప్రదర్శనకు కారణం కావచ్చు. అయితే ప్రతిపక్ష పార్టీలు ప్రజలను, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలను (ఎస్‌సీ), షెడ్యూల్స్ ట్రైబ్స్‌ను(ST) తమ వైపు తిప్పుకోవడంతో విజయం సాధించాయని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ఈ కమ్యూనిటీల నుంచి కోల్పోయిన ఓట్లను తిరిగి పొందేందుకు ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్‌‌ మొదలుపెట్టింది.

తప్పుడు ప్రచారంపై అవగాహన కల్పిస్తాం..

“రాజ్యాంగాన్ని మార్చడానికే NDA 400 కంటే ఎక్కువ సీట్లు గెలవాలనుకుంటోందని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేశాయి. అదే బీజేపీకి అతిపెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు మేం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే అవకాశం దొరికింది. అసలు ప్రమోషన్లలో రిజర్వేషన్లను వ్యతిరేకించింది సమాజ్ వాదీ పార్టీ (SP). 2012లో పార్లమెంటు సమావేశాలలో బిల్లును చించివేసిన ఘటనను ప్రజలకు వివరిస్తున్నాం. ఎస్సీ వర్గాలకు రిజర్వేషన్లను వ్యతిరేకించే పార్టీతో కాంగ్రెస్ జతకట్టిందని, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కూటమి వాగ్దానాలను ప్రజలు నమ్మకూడదని ప్రజలకు చెబుతున్నాం.’’ అని ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకుడు రామచంద్ర కన్నూజియా అన్నారు.

హర్యానాలో ఎస్సీ సబ్ కోటా అమలు..

సమాజ్‌వాదీ పార్టీ రిజర్వేషన్ల వ్యతిరేకి అని బీజేపీ చెప్పే ప్రయత్నం చేస్తోంది. అలాగే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా రిజర్వేషన్లపై చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా కాషాయపార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు కూడా చేపట్టింది. అయితే రిజర్వేషన్లను పెంచాలన్న తన వ్యాఖ్యలను వక్రీకరించారని రాహుల్‌ తర్వాత వివరణ ఇచ్చుకున్నా లాభం లేకుండా పోయింది. SC కమ్యూనిటీకి దగ్గర కావడానికి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం SC ఉప-వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ఉపవర్గీకరణ అంశం బీజేపీ, కూటమి భాగస్వామ్యాల మధ్య విభేదాలను సృష్టించినా..సుప్రీం నిర్ణయానికి బీజేపీ కట్టుబడి నడుచుకుంటుంది.

మహారాష్ట్రలో OBCల ఆదాయ పరిమితి పెంపుతో..

ఇటు మహారాష్ట్రలో ఇతర వెనుకబడిన తరగతుల (OBC) కమ్యూనిటీ ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎన్నికల ప్రకటన తేదీకి కొద్ది రోజుల ముందు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం 'నాన్-క్రిమీ లేయర్' ఆదాయ పరిమితిని ప్రస్తుత రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తద్వారా రిజర్వేషన్ల ప్రయోజనాలు ఎక్కువ సంఖ్యలో ప్రజలకు చేరతాయి.

“ప్రధానమంత్రికి ఉన్న ప్రజాదరణ, ఆయన OBC ఐడెంటిటీ ప్రజలకు చేరువ కావడానికి బీజేపీకి సహాయపడతాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకత్వ నిర్ణయాల్లో OBC కమ్యూనిటీ పాత్ర కీలకంగా ఉంటుందనే చెప్పాలి.’’ అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి నరేంద్ర కశ్యప్ ది ఫెడరల్‌తో అన్నారు.

మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సరిగా స్పందించకపోవడంతోనే లోక్‌సభ ఎన్నికలలో సీట్లు తగ్గాయని కొంతమంది బీజేపీ సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా నాన్ క్రిమీలేయర్ పరిమితిని పెంచాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, 2012లో పదోన్నతుల్లో రిజర్వేషన్లు వద్దని చెప్పిన సమాజ్‌వాదీ పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బీజేపీ లాభపడాలని చూస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట.

‘‘రిజర్వేషన్ల గురించి పార్టీ ఎక్కువగా మాట్లాడితే.. హిందుత్వ ఓటర్లు, మధ్యతరగతి ఓటర్లు కోల్పోతారనే భయం ఉంది. కాబట్టి ఎన్నికల ముందు బీజేపీ నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.” అని బరోడా మహారాజా సాయాజీరావు యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అమిత్ ధోలాకియా ది ఫెడరల్‌తో అన్నారు.

Tags:    

Similar News