హర్యానాలో 9 గంటలకు 9.5% పోలింగ్ - ఓటేసిన సీఎం సైనీ, ఖట్టర్

ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, భూపిందర్ సింగ్, కాంగ్రెస్‌కు చెందిన వినేష్ ఫోగట్‌తో పాటు జెజెపికి చెందిన దుష్యంత్ చౌతాలా మరో 1027 మంది ఎన్నికల బరిలో నిలిచారు.

Update: 2024-10-05 06:35 GMT

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. 9 గంటల వరకు 9.5% ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఉవిల్లూరుతోంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ దశాబ్దం కాలం తర్వాత మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇక బీజేపీ, ఆప్, ఐఎన్‌ఎల్‌డీ-బీఎస్పీ, జేజేపీ-ఆజాద్ సమాజ్ పోటీలో నిలిచిన ప్రముఖ పార్టీలుగా చెప్పుకోవచ్చు.

ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, భూపిందర్ సింగ్ హుడా, కాంగ్రెస్‌కు చెందిన వినేష్ ఫోగట్‌తో పాటు జెజెపికి చెందిన దుష్యంత్ చౌతాలా మరో 1027 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి సైనీ, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఒలింపిక్ పతక విజేత మను భాకర్ ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2 కోట్లకు పైగా ఓటర్లు..

మొత్తం 2,03,54,350 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులని, ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని హర్యానా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పంకజ్ అగర్వాల్ తెలిపారు. అక్టోబర్ 8న కౌంటింగ్ జరగనుంది.

మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 101 మంది మహిళలు కూడా ఈ సారి పోటీలో నిలిచారు. 464 మంది స్వతంత్ర అభ్యర్థులు. ఓటింగ్ కోసం మొత్తం 20,632 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు అగర్వాల్ శుక్రవారం తెలిపారు.

గురువారం సాయంత్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. బీజేపీ ప్రచారానికి నాయకత్వం వహించిన ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు ర్యాలీల్లో ప్రసంగించారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రామ మందిర సమస్యతో సహా దేశానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన అంశాన్ని చిక్కులో ఉంచారని అన్నారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ కూడా అనేక బహిరంగ సభల్లో ప్రసంగించారు. పేదలు, రైతులకు అండగా నిలిచే తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

2019లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10 సీట్లు గెలుచుకున్నాయి.

Tags:    

Similar News