సర్పంచ్ నుంచి సీఎం దాకా..ఒడిషా సీఎం మోహన్ చరణ్ రాజకీయ ప్రస్థానం

ఉపాధ్యాయ వృత్తి నుంచి సర్పంచ్‌గా..ఆపై నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గిరిజనుల సమస్యలపై వీరోచితంగా పోరాడారు. ఇప్పుడు ఒడిషా రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఆయనే..

Update: 2024-06-12 08:31 GMT

బీజేపీ గిరిజన నేత, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ చరణ్ మాఝీ ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరగనున్న మాఝీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారని సమాచారం.

78 స్థానాలతో అధికారంలోకి..

24 ఏళ్ల బీజేడీ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్‌ పాలనకు తెరపడింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు సాధించింది. 147 స్థానాలున్న ఒడిశా శాసనసభలో బీజేపీ 78 సీట్లు గెలుచుకోగా.. బీజేడీ 51 సీట్లు మాత్రమే వచ్చాయి.

మూడో గిరిజన సీఎంగా మాఝీ..

మోహన్ చరణ్ మాఝీ ఒడిశా మొదటి బిజెపి ముఖ్యమంత్రి. కాంగ్రెస్‌కు చెందిన హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగ్ తర్వాత ఒడిశా రాష్ట్ర మూడవ గిరిజన ముఖ్యమంత్రి కూడా.

జూన్ 11న భువనేశ్వర్‌లో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ సభ్యులు 52 ఏళ్ల మాఝీని సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, భూపేందర్‌ యాదవ్‌ హాజరయ్యారు.

రాజ్‌నాథ్ అభినందనలు..

మాఝీ పేరును సీఎంగా ప్రకటించిన తర్వాత కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ మాఝీ గురించి ఎక్స్‌లో ఇలా పోస్టు చేశారు “శ్రీ మోహన్ చరణ్ మాఝీ ఒడిశా బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం ఆనందంగా ఉంది. ఒడిశా కొత్త ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పురోగతి మార్గంలో ముందుకు తీసుకువెళతారని ఆశిస్తున్నా. మాఝీకి నా అభినందనలు.”

ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించిన తర్వాత మాఝీ మాట్లాడుతూ.. “జగన్నాథుని ఆశీస్సుల వల్లే ఒడిశాలో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించగలిగాం. మార్పు కోసం ఒడిశాలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్న 4.5 కోట్ల మంది ఒడియాలకు నా కృతజ్ఞతలు. ఒడిశా ప్రజల నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాం’’ అని చెప్పారు.

మోహన్ చరణ్ రాజకీయ ప్రస్థానం..

ఖనిజాలు అధికంగా ఉండే కియోంజర్ జిల్లాలోని రాయికాలా గ్రామానికి చెందిన మాఝీ సంతాలి తెగకు చెందిన వ్యక్తి. వాచ్‌మెన్ కొడుకు అయిన మోహన్ చరణ్ ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహిస్తున్న సరస్వతి శిశు విద్యా మందిర్‌లో ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించారు. రాయికల పంచాయతీ సర్పంచ్‌గా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది.

మాఝీ గిరిజనుల సమస్యలపై నిరంతరం పోరాడారు. బిజెపి ST మోర్చా జాతీయ కార్యదర్శిగా ఉంటూ 2000లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లోనూ మళ్లీ గెలిచారు. అయితే ఒడిశాలో బీజేపీ-బీజేడీ కూటమి వీగిపోవడంతో 2009, 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో అసెంబ్లీకి తిరిగి వచ్చిన మోహన్ చరణ్ ..2024లో నాలుగోసారి తిరిగి గెలుపొందారు. మొత్తం నాలుగు సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు.

గతంలో ఎమ్మెల్యేగా, 16వ ఒడిశా శాసనసభలో బీజేపీ చీఫ్‌విప్‌గా మాఝీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ చరణ్. ఏడు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. వాటిలో ఒకటి ఒడిషా విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ బిల్లు - 2020.

అసెంబ్లీలో యాక్టివ్‌గా ఉండే మాఝీ పలు చర్చల్లో పాల్గొన్నారు. 2022 నుంచి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు.

ఇటీవల ముగిసిన ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడంలో కూడా పాలుపంచుకున్నారు.

కందిపప్పు విసిరి సస్పెండ్ అయిన మోహన్ చరణ్..

2023లో స్పీకర్ పోడియంపై కందిపప్పు విసిరినందుకు మాఝీని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన ప్రాజెక్ట్ కోసం కంది పప్పు కొనుగోలులో రూ. 700 కోట్ల కుంభకోణాన్ని అందరి దృష్టికి తీసుకురావడానికి ఆయన తన ఎమ్మెల్యే సహోద్యోగి ముఖేష్ మహాలింగ్‌తో కలిసి ఇలా చేశాడు.

అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా గళం విప్పారు. దేశంలోనే అతిపెద్ద ఇనుప ఖనిజం నిక్షేపాలున్న కియోంఝర్ జిల్లాకు చెందిన ఈయన అసెంబ్లీలో మైనింగ్ స్కామ్‌ల అంశాన్ని బలంగా లేవనెత్తారు.

ఎంఏతో పాటు లా గ్రాడ్యుయేట్ అయిన మాఝీ అసెంబ్లీలో ప్రజా సంక్షేమానికి సంబంధించిన సమస్యలను లేవనెత్తడానికి విస్తృతమైన పరిశోధనలు చేయడంలో పేరుగాంచాడు.

వివాదరహిత వ్యక్తిగా పేరుగాంచిన మాఝీ బలమైన సంస్థాగత నాయకుడు. ఈయనకు ఆర్‌ఎస్‌ఎస్ సంబంధాలు బలంగా ఉన్నాయి. బిజెపి ఒడిశా రాష్ట్ర విభాగంలో కూడా పని చేసారు.

ప్రజల పక్షపాతి..

మాఝీ తన నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల్లో జరిగే సామాజిక కార్యక్రమాలకు తప్పక హాజరయ్యేవారు. అలా జనానికి ఆయన చాలాదగ్గరయ్యారు. ఆపదలో ఉన్న వారికి సాయపడేవారు.రోగులకు మెరుగైన చికిత్స చేయించారు. తన వ్యక్తిగత సహాయకుడు ప్రమాదంలో చనిపోయాడని తెలియడంతో.. పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని మధ్యలోనే వదిలేసి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వెళ్లారు.


Tags:    

Similar News