Maharashtra Politics | ఈ రోజు సాయంత్రం సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.;

Update: 2024-12-05 09:37 GMT

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు (గురువారం) సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు/డిప్యూటీ సీఎంలు హజరుకానున్నాయి. ఇక ప్రతిపక్ష నేతలు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, రాష్ట్రంలోని ఇతర ప్రధాన రాజకీయ నేతలకు ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వానం అందింది. మరాఠీ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, ముఖేష్ అంబానీతో సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, 100 మందికి పైగా ఆధ్యాత్మిక నాయకులు, ప్రముఖ విద్యావేత్తలు, సాహిత్య ప్రముఖులు, బీజేపీ, ఎన్‌సీపీ, శివసేన కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సంగీత స్వరకర్త ద్వయం అజయ్-అతుల్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రదర్శన ఇవ్వనున్నారు.

డిప్యూటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండే?

ఎన్‌సీపీ అధినేత అజిత్ పవార్, శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని కొన్ని వర్గాల సమాచారం. పదవీ విరమణ చేసిన సీఎం ఏక్‌నాథ్ షిండే కొత్త మంత్రివర్గంలో భాగమవుతారా? అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఫడ్నవీస్ ఇప్పటికే శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండేను కలిసి తన మంత్రివర్గంలోకి ఆహ్వానించారు.

“నిన్న నేను ఏక్‌నాథ్ షిండేని కలిశాను. మహాయుతి కూటములో షిండే కూడా ఉండాలన్నది మహాయుతి కార్యకర్తల కోరిక. ఆయన మా వెంటే ఉంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది." అని తన రాజ్ భవన్ పర్యటన తర్వాత ఫడ్నవీస్ అన్నారు. షిండే మాట్లాడుతూ.. ఫడ్నవీస్ సీఎం కావడానికి మేం అంగీకరించాం. ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రభుత్వం ఏర్పడుతోంది. అయితే తాను డిప్యూటీ సీఎం పదవిని చేపడతానన్న విషయాన్ని షిండే వెల్లడించలేదు.

విస్తృతమైన భద్రత..

బీజేపీ నేత ప్రసాద్ లాడ్ ప్రకారం.. ఈరోజు ముంబైలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు 42వేల మంది హాజరయ్యేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, 2వేల మంది వీఐపీలకు ప్రత్యేక సీటింగ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.40 వేల మంది బీజేపీ మద్దతుదారులకు కూడా బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లుచేశారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా భద్రత కోసం 4,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించినట్లు ఒక అధికారి తెలిపారు.

ట్రాఫిక్ క్రమబద్ధీకరణ..

ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని రూట్లలో ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. వేదిక సమీపంలో పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో హాజరువుతున్నవారు ఆజాద్ మైదాన్ చేరుకోవడానికి ప్రజా రవాణాను, లోకల్ రైళ్లను ఉపయోగించాలని సూచించారు.

సీఎంగా మూడోసారి

మూడోసారి మహారాష్ట్ర సీఎంగా నాగ్‌పూర్ ఎమ్మెల్యే ఫడ్నవీస్ (54) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవంబర్ 20న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడిన తర్వాత రెండు వారాల తీవ్ర చర్చల తర్వాత ఫడ్నవీస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. 288 మంది సభ్యుల సభలో 132 సీట్లు సాధించి, ఎన్నికల్లో బీజేపీ బలమైన ప్రదర్శన కారణంగా ఫడ్నవీస్ ప్రతిష్టాత్మకమైన పదవికి ముందంజలో ఉన్నారు. దాని మిత్రపక్షాలు శివసేన మరియు ఎన్‌సిపితో కలిసి, బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమికి 230 సీట్ల మెజారిటీ ఉంది.

Tags:    

Similar News