పార్లమెంటుకు పోటీచేస్తున్న తెలుగువాళ్లలో క్రిమినల్ కేసులన్న వారు వీరే

పార్లమెంటుకు పోటీ చేస్తున్న తెలుగు వాళ్లలోనూ నేరస్తుల సంఖ్య భారీగానే ఉంది. ఏయే పార్టీలలో ఎంతెంత మంది ఉన్నారంటే..

By :  Admin
Update: 2024-05-06 03:16 GMT

సార్వత్రిక ఎన్నికల సంరంభం కొనసాగుతోంది. ఇప్పటికి రెండు దశల ఎన్నికలు ముగిశాయి. మూడో దశ మే 7న, నాలుగో దశ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల పర్వం ముగిసినప్పటి నుంచి ప్రచారం హోరెత్తుతోంది. తెలుగు రాష్ట్రాలలో 42 పార్లమెంటు సీట్లకు ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి.

దేశవ్యాప్తంగా నాలుగో విడత
ఎన్నికల్లో 1717 నామినేషన్లు దాఖలైతే వారిలో 1710 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. ప్రస్తుతం బరిలో ఉన్న వారిలో 21 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండడం ఇప్పుడు గుబులు పుట్టిస్తోంది. అభ్యర్థుల నామినేషన్లతో పాటు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించిన ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఏడీఆర్) ఈ విషయాల్ని ప్రకటించింది. ఈ 1710లో 24మంది తమకు అసలు ఎటువంటి ఆస్తులు కూడా లేవని ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉందంటే...
నాలుగో దశ ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో అత్యధిక సంపన్నులు, అధిక క్రిమినల్ కేసులున్న వారు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం గమనార్హం. అత్యధిక సంపన్నుల జాబితాలో గుంటూరు లోక్ సభ సీటు నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన తన మొత్తం ఆస్తులు 5,700 కోట్ల రూపాయలని ప్రకటించారు.
క్రిమినల్ కేసులున్న వారిలో వందకు వంద శాతం కేసులున్న పార్టీ ఎంఐఎం. ఈ పార్టీ తరఫున ముగ్గురు పోటీ చేస్తుంటే వీరందరిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. నాలుగో విడత పోలింగ్ జరిగే సీట్లలో పోటీ పడుతున్న 1710లో 360 మంది స్వచ్ఛందంగానే తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారు. మరో 17 మంది వివిధ కేసుల్లో శిక్షలు పడిన వారున్నారు. 11మంది కులాల కుమ్ములాటలు, కులానికి సంబంధించిన హత్యలతో సంబంధాలున్న వారున్నారు. 30మంది హత్యాయత్నం కేసుల్ని ఎదుర్కొంటున్నారు. 50 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో ఇరుక్కున్న వారున్నారు. ఐదుగురు అభ్యర్థులు అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్ని ఎదుర్కుంటున్నట్టు ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ విశ్లేషించింది.
ఎంఐఎం అభ్యర్థులు ముగ్గురిపైనా కేసులు..
ఏఐఎంఐఎం తరఫున పోటీ చేస్తున్న ముగ్గురిపైనా క్రిమినల్ కేసులు ఉన్నాయి. శివసేన నుంచి ముగ్గురు పోటీ చేస్తుంటే ఇద్దరిపైన, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని బీఆర్ఎస్ తరఫున 17 మంది పోటీలో ఉంటే వారిలో పది మందిపైన కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ తరఫున నాలుగో విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 61 మంది పోటీ చేస్తుంటే 35 మందిపైన, బీజేపీ నుంచి 70 మంది పోటీ చేస్తుంటే 40మందిపైన,ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ తరఫన 17మంది పోటీ చేస్తుంటే వారిలో 9 మందిపైన, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం వహిస్తున్న వైఎస్సార్ సీపీ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్న 25 మందిలో 12 మందిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.
ఇక మిగతా పార్టీలలో ఆర్జేడీ పార్టీకి చెందిన నలుగురిలో ఇద్దరిపైన, ఒడిశాలోని బీజేడీకి చెందిన నలుగురిలో ఇద్దరిపైన, శివసేన (ఉద్ధవ్ ఠాకరే వర్గం)కి చెందిన నలుగురిలో ఇద్దరిపైన, పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన 8 మందిలో ముగ్గురిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.
భారత రాజకీయాలు నేరమయం అవుతున్నాయని చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడీ లెక్కలు చూస్తుంటే అది నిజమేమోనని అనిపిస్తోంది. హత్యలు చేసినట్టు కోర్టుల్లో నిర్ధారణ అయిన వాళ్లు, కుల,మత ఘర్షణల్లో ప్రత్యక్ష జోక్యం ఉన్న వాళ్లు, మహిళలపై లైంగిక కేసులు నమోదు అయిన వాళ్లు ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఇదెవరో చేసిన ఆరోపణ కాదు. సాక్షాత్తు అభ్యర్థులే ప్రకటించిన నేరాల చిట్టాలు. ఓటర్ల విజ్ఞతకు పరీక్షే.


Tags:    

Similar News