‘సాత్ వాదే, పక్కే ఇరదే’.. కాంగ్రెస్ హర్యానా ఎన్నికల మ్యానిఫెస్టో..

‘అధికారంలోకి వస్తే పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు కల్పించడంతో పాటు కుల గణన చేపడతాం’ - కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

Update: 2024-09-18 11:13 GMT

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో పార్టీలు మ్యానిఫెస్టోలపై దృష్టి పెట్టాయి. జనాకర్షక పథకాల రూపకల్పనలో బిజీ అయ్యాయి. ‘సాత్ వాదే, పక్కే ఇరదే’ అంటూ ఏడు హామీలతో హస్తం పార్టీ ముందుకొచ్చింది. తాము అధికారంలోకి వస్తే పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు కల్పించడంతో పాటు కుల గణన చేపడతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. మరో ఐదు హామీలను కూడా ఆయన వెల్లడించారు. మహిళా సాధికారతలో భాగంగా ప్రతి ఇంటికి రూ.500లకే గ్యాస్ సిలిండర్, 18 నుంచి 60 ఏళ్ల మధ్య ప్రతి మహిళకు నెలకు రూ. 2వేలు ఇస్తామన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నెలకు రూ. 6వేలు పింఛన్ పంపిణీ చేస్తామన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. క్రిమిలేయర్ పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, హర్యానా ఎన్నికల ఏఐసీసీ సీనియర్ పరిశీలకులు అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్, పర్తాప్ సింగ్ బజ్వా సమక్షంలో మల్లికార్జున్ ఖర్గే ఈ హామీలను ప్రకటించారు. 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఓటింగ్ జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Tags:    

Similar News