మహారాష్ట్రలో రేపే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..

నవంబర్ 26తో పదవీకాలం ముగియనుండడంతో 25లోగా కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. వాంఖడే స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది.

Update: 2024-11-24 12:22 GMT

మహారాష్టలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ మేరకు మహాయుతి కూటమి నేతలు సమావేశమయ్యారు. ఇదే సమయంలో సీఎం ఎవరనేది కూడా తేలిపోనుంది. కూటమి నేతలతో సంప్రదించి ముఖ్యమంత్రి పేరును బీజేపీ నాయకత్వం ప్రకటిస్తుందని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే తెలిపారు. రేపు (సోమవారం) ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎలాంటి వివాదం లేదని శివసేన నేత దీపక్ కేశకర్ పేర్కొన్నారు. నవంబర్ 26తో పదవీకాలం ముగియనుండడంతో 25లోగా కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయాల్సి ఉందన్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని చెప్పారు.

మహారాష్ట్ర ఎన్నికల గణాంకాలు..

షిండేకు చెందిన శివసేన, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీతో కూడిన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి శనివారం రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాల్లో 230 స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక

కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే కల చెదిరిపోయింది. ఆ కూటమి 46 సీట్లను మాత్రమే గెలుచుకుంది.

మహాయుతి కూటమిలో బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయి. ఎంవీఏలో ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థులు 10, కాంగ్రెస్ 16, శివసేన (యూబీటీ) 20 స్థానాల్లో విజయం సాధించాయి.

గుణపాఠం నేర్చుకోవాలి..

ఆదివారం ముంబైలో విలేకరుల సమావేశంలో బవాన్‌కులే మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను "తిరస్కరించారని" అన్నారు. సకోలి స్థానంలో కేవలం 200 ఓట్ల తేడాతో కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే గెలిచారని అన్నారు. "ఈ ఫలితం నుంచి ఆయన గుణపాఠం నేర్చుకోకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతను సభలో ఉండకపోవచ్చు" అని బవాన్‌కులే అన్నారు.

ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం కాంగ్రెస్ కర్మ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సమాజంలోని అన్ని వర్గాలు బీజేపీకి మద్దతిచ్చాయని బవాన్‌కులే పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పదవికి ఏ పార్టీకి సరిపడా సీట్లు రాకపోవడానికి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ “అబద్ధాలు” కారణమని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ విజయం సాధించిందని, అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ విజయాన్ని పునరావృతం చేయడంలో విఫలమైందన్నారు.

‘‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం కాంగ్రెస్ కర్మ' అని బవాన్కులే అన్నారు. మహారాష్ట్రలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ప్రారంభించే యోచనలో ఉన్నామన్నారు 1.51 కోట్ల మంది కొత్త ప్రాథమిక సభ్యులు పొందడమే తమ లక్ష్యంమని చెప్పారు.

సేన లెజిస్లేచర్ పార్టీ సమావేశం..

కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ ముంబై చేరుకున్న తర్వాత ఆదివారం సాయంత్రం శివసేన లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది. శనివారం సాయంత్రం సిఎం షిండే తన పార్టీ వర్కింగ్ కమిటీ,కొత్తగా ఎన్నికైన సభ్యుల ఆన్‌లైన్ సమావేశాన్ని నిర్వహించారని, వారు మిత్రపక్షాలతో చర్చలు జరపడానికి అధికారం ఇచ్చారని పార్టీ కార్యకర్త ఒకరు తెలిపారు. లెజిస్లేచర్ పార్టీ గ్రూప్ లీడర్, చీఫ్ విప్, ఇతర ఆఫీస్ బేరర్లను నియమించే అధికారం కూడా ఆయనకు ఉంది.

శాసనసభాపక్ష నేతగా అజిత్..

ఎన్సీపీ అజిత్ పవార్‌ను అసెంబ్లీ నాయకుడిగా ఎన్నుకున్నారు. శాసనసభాపక్ష నేతగా ఆయన కొనసాగనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లోక్‌సభ ఎంపీ సునీత్ తట్కరే అధ్యక్షతన జరిగిన సమావేశంలో పవార్‌ను శాసనసభా పక్ష నేతగా, ఆయన సహచరుడు అనిల్ పాటిల్‌ను మళ్లీ చీఫ్‌విప్‌గా నియమించారు.

Tags:    

Similar News