కేరళ వయనాడ్ లోక్‌సభ, 31 అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నికలు

10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలతో పాటు కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి బుధవారం ఉపఎన్నికలు జరగనున్నాయి.

Update: 2024-11-13 07:05 GMT

10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలతో పాటు కేరళలోని వయనాడ్ (Wayanad) లోక్‌సభ నియోజకవర్గానికి బుధవారం ఉపఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక (Priyanka) గాంధీ వాద్రా తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు.

ప్రియాంకకు పోటీగా ఎల్‌డీఎఫ్‌ నుంచి సత్యన్ మొకేరి, ఎన్‌డీఎ నుంచి నవ్య హరిదాస్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ గత ఎన్నికలలో రాయ్‌బరేలి, వయనాడ్ నుంచి పోటీచేశారు. రెండు స్థానాల నుంచి ఆయన గెలుపొందారు. అయితే పార్లమెంట్‌కు ఒక స్థానం నుంచే ప్రాతినిథ్యం వహించాల్సి ఉండడంతో ఆయన వయనాడ్‌ను వదులుకున్నారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఎంపీలుగా గెలువడంతో ఉపఎన్నికలు..

సిట్టింగ్ ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలువడంతో కొన్ని స్థానాలు ఖాళీ అయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల మరణంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ లెక్కన రాజస్థాన్‌లో 7, పశ్చిమ బెంగాల్‌లో 6, అస్సాంలో 5, బీహార్‌లో 4, కర్ణాటకలో 3, మధ్యప్రదేశ్‌లో 2, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మేఘాలయలో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

సిక్కింలో..

సిక్కింలో సోరెంగ్-చకుంగ్, నామ్చి-సింఘితాంగ్ స్థానాలకు పోలింగ్ షెడ్యూల్ ఖారారయినా.. ప్రత్యర్థులు రేసు నుంచి తప్పుకోవడంతో సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) అభ్యర్థులు ఆదిత్య గోలే, సతీష్ చంద్ర రాయ్‌లను ఏకగ్రీవంగా ప్రకటించారు.

రాజస్థాన్‌లో..

రాజస్థాన్‌లో ఝుంఝును, దౌసా, డియోలీ-ఉనియారా, ఖిన్వ్‌సర్, చౌరాసి, సలుంబర్, రామ్‌గఢ్‌లలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. సలుంబర్, రామ్‌గఢ్‌లలో, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అమృతలాల్ మీనా (బిజెపి), జుబేర్ ఖాన్ (కాంగ్రెస్) మరణించడంతో ఇక్కడ బై ఎలక్షన్లు అనివార్యమయ్యాయి.

అసోంలో..

అసోంలో ఐదు స్థానాలకు (ధోలై, బెహాలి, సమగురి, బొంగైగావ్, సిద్లీ) ఉపఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 34 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బెహలీ స్థానానికి CPI(ML) లిబరేషన్‌, కాంగ్రెస్‌కు మధ్య పొత్తు కుదరలేదు. దాంతో ఈ స్థానం కాంగ్రెస్ జయంత బోరాను తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బీజేపీ అభ్యర్థి దిగంత ఘటోవర్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు.రెండు బహిరంగ సభల్లో సంగించారు. బోరా, ఘటోవర్‌తో పాటు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నుంచి లఖికాంత కుర్మీ, ఆప్‌ నుంచి అనంత గొగోయ్‌ బెహలీలో పోటీలో ఉన్నారు. ఇక ఉప ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి సమగురిలో ప్రతిరోజూ హింసాత్మక సంఘటన చోటుచేసుకుంటున్నాయి. నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్‌ మద్దతుదారులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఎన్నికల కార్యాలయాలను ధ్వంసం చేశారు. ఎన్నికల సంఘానికి రెండు పార్టీలు ఫిర్యాదులు చేశాయి. ఇక సమగురిలో బీజేపీకి చెందిన డిప్లు రంజన్ శర్మపై పార్టీ అభ్యర్థిగా ధుబ్రీ ఎంపి రకీబుల్ హుస్సేన్ కుమారుడు తాంజిల్‌ను కాంగ్రెస్ ప్రకటించింది.

బీహార్‌లో..

బీహార్‌లో రామ్‌గఢ్, తరారీ, ఇమామ్‌గంజ్, బెలగంజ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

కర్ణాటకలో..

కర్ణాటకలో చన్నపట్న అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే హెచ్‌డీ కుమారస్వామి లోక్‌సభకు పోటీచేసి గెలవడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. దాంతో ఇక్కడి నుంచి ఆయన తనయుడు జేడీ(ఎస్) తరుపున నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. కాగా బీజేపీ మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కుమారుడు భరత్‌ బొమ్మైని బరిలో నిలపగా.. కాంగ్రెస్ తరుపున యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్‌ తలపడుతున్నారు.

మధ్యప్రదేశ్‌లో..

మధ్యప్రదేశ్‌లోని బుద్ని, విజయ్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు కూడా ఓటింగ్ జరగనుంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాంనివాస్ రావత్ బీజేపీలో చేరి మోహన్ యాదవ్ కేబినెట్‌లో మంత్రి కావడంతో షియోపూర్ జిల్లాలోని విజయ్‌పూర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభకు ఎన్నిక కావడంతో బుధ్ని స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.

కేరళలోని చెలక్కర, గుజరాత్‌లోని వావ్, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ సిటీ సౌత్, మేఘాలయలోని గంబెగ్రే (ఎస్టీ) ఇతర స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది, పంజాబ్‌లో నాలుగు, కేరళలో మరో స్థానానికి బుధవారం ఓటింగ్ జరగాల్సి ఉన్నా.. పండుగల దృష్ట్యా ఎన్నికల సంఘం నవంబర్ 20కి వాయిదా వేసింది.

Tags:    

Similar News