అఫిడవిట్‌లో ప్రియాంక ఆస్థులపై బీజేపీ విమర్శలు..

కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.

Update: 2024-10-24 12:53 GMT

కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో ఆమె తన ఆస్తిని రూ.12 కోట్లుగా ప్రకటించారు. తన భర్త రాబర్ట్ వాద్రాకు దాదాపు రూ. 66 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నారని వెల్లడించారు.

ప్రియాంక నామినేషన్ పత్రం ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆమె మొత్తం ఆదాయం రూ. 46.39 లక్షలు. ఇది అద్దె రూపంలో, బ్యాంకులు, ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే మొత్తం ఆదాయంగా చూపారు.

అత్యంత విలువైన ఆస్తి

కాంగ్రెస్ నాయకురాలి అత్యంత విలువైన ఆస్తి సిమ్లా సమీపంలోని 12,000 చదరపు అడుగుల ఫామ్‌హౌస్. దీని విలువ ₹5.64 కోట్లు. ఆమె తన భర్త నుంచి బహుమతిగా పొందినట్లు చెప్పుకుంటున్న హోండా CRV విలువ రూ. 8 లక్షలు. PTI ప్రకారం.. మూడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), రూ.1.15 కోట్ల విలువైన 4,400 గ్రాముల బంగారం సహా ఆమె చరాస్తులు రూ. 4.24 కోట్లకు పైగా ఉన్నాయి.

స్థిరాస్థుల విషయానికొస్తే.. న్యూఢిల్లీలోని తన పేరున ఉన్న మెహ్రౌలీలో వ్యవసాయ భూమి విలువ రూ.2.10 కోట్లు కాగా ఆమె సిమ్లా ఆస్తి విలువ రూ. 7.74 కోట్లు.

2012-13 పన్ను సంవత్సరానికి ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించిన రీ-అసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌ల కారణంగా ప్రియాంక బాధ్యతలు ₹15.75 లక్షలకు చేరాయి. ఈ అప్పీల్ ప్రస్తుతం ఆదాయపు పన్ను కమిషనర్ (అప్పీల్స్) ముందు పెండింగ్‌లో ఉందని ఆమె తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

వాద్రా సంపద..

ఇదిలా ఉంటే రాబర్ట్ వాద్రా సంపద ఆయన భార్య కంటే చాలా ఎక్కువ. ఆయనకు రూ.53 లక్షల విలువైన ల్యాండ్ క్రూయిజర్, రూ.1.5 లక్షల విలువైన మినీ కూపర్, రూ. 4.22 లక్షల విలువైన సుజుకి మోటార్‌సైకిల్ ఉన్నాయి.

PTI ప్రకారం ఆయన చరాస్తుల విలువ రూ. 37.9 కోట్లు. స్థిరాస్తుల విలువ రూ. 27.64 కోట్లు.

బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ LLP, నార్త్ ఇండియా IT పార్క్ LLP, స్కై లైట్ హాస్పిటాలిటీ LLP వంటి సంస్థలలో వాద్రా పార్ట్‌నర్‌గా ఉన్నారు. స్కై లైట్ హాస్పిటాలిటీలో ₹31.93 కోట్ల బ్యాలెన్స్‌తో సహా మొత్తం రూ. 35.5 కోట్ల హోల్డింగ్‌లు ఉన్నాయి. అప్పులు రూ. 10 కోట్లు.

2010 నుంచి 2021 వరకు వాద్రా పన్ను రిటర్న్‌లపై ఆదాయపు పన్ను శాఖ అసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లు మార్చి 28, 2023న ప్రారంభమయ్యాయి. 2019-20 అసెస్‌మెంట్ సంవత్సరంలో అత్యధికంగా రూ. 24.16 కోట్లు సేకరించిన మొత్తం డిమాండ్ రూ. 80 కోట్లు. వాద్రా డిమాండ్లపై అప్పీల్ చేశారని, ఈ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొంది. 2023-24లో ఆయన ప్రకటించిన ఆదాయం రూ. 15.09 లక్షలు. ఇది 2019-20కి ఆయన ప్రకటించిన రూ. 55.58 లక్షల నుంచి గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోంది. కాగా ప్రియాంక గత ఆర్థిక సంవత్సరంలో రూ. 46.39 లక్షల ఆదాయాన్ని ప్రకటించింది.

FIRలు

ప్రియాంకపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని పీటీఐ నివేదించింది. 2023లో మధ్యప్రదేశ్‌లో ఆమెపై ఒక కేసు నమోదయ్యింది. 'తప్పుదోవ పట్టించే' ట్వీట్‌పై ఫిర్యాదు ఆధారంగా ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 420, 469 కింద కేసు నమోదయ్యింది.

2020లో ఉత్తరప్రదేశ్‌లో మరో కేసు దాఖలైంది. హత్రాస్ ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ఆమెపై ఐపీసీ సెక్షన్‌లు 188, 269, 270 కింద కేసు నమోదయ్యింది.

బీజేపీ విమర్శలు

ప్రియాంక గాంధీ తన అఫిడవిట్‌లో కనపర్చిన ఆస్థులపై బీజేపీ విరుచుకుపడింది. అఫిడవిట్‌లో కనపర్చిన ఆస్థులు వారి వాస్తవ ఆస్థుల కంటే చాలా తక్కువగా ఆరోపించారు. రాబర్ట్ వాద్రా ఆస్తుల ఆధారంగా ఆయన చెల్లించాల్సిన ఆదాయపు పన్ను రూ. 75 కోట్లు అని పేర్కొన్నారు.

ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ కారణంగా ఖాళీ అయిన వయనాడ్ స్థానానికి ప్రియాంక కాంగ్రెస్ తరుపున తొలిసారిగా పోటీ చేస్తున్నారు. వయనాడ్‌లో నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది.

Tags:    

Similar News