రాబర్ట్ వాద్రా మాటలు నిజమేనా?

అరవింద్ కేజ్రీవాల్, డేరా బాబా బెయిల్‌పై బయటకు రావడం వెనక బీజేపీ ప్రమేయం ఉందా? కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకోవడం కోసం వారిని రిలీజ్ చేశారా?

Update: 2024-10-01 10:57 GMT

హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలను భారతీయ జనతా పార్టీ దెబ్బకొట్టాలని చూస్తోందని, అందులో భాగంగానే ఎన్నికల ప్రచారం కోసం డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌‌ను జైలు నుంచి విడుదల చేయించారని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా ఆరోపించారు.

“హత్య, అత్యాచారం, అభియోగాలు ఎదుర్కొంటున్న బాబా రామ్ రహీమ్‌ను ఎన్నికలకు 20 రోజుల ముందు విడుదల చేశారు. కేజ్రీవాల్‌ కూడా కొద్ది రోజుల ముందే బయటకు వచ్చారు. వీరిద్దరికి బెయిల్ రావడం వెనక బీజేపీ ప్రమేయం, ఆలోచన ఉంది.’’ అని వాద్రా పేర్కొన్నారు.

అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగ్ 20 రోజుల పెరోల్ కోరడం, దానికి కోర్టు అంగీకరించడం..అలాగే ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ పొందిన కేజ్రీవాల్ హర్యానా అంతటా ప్రచారం చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన వాద్రా.. హర్యానాలోని తన కంపెనీలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేవాడినని అయితే బీజేపీ ప్రభుత్వం తన సహచరులందరినీ భయభ్రాంతులకు గురిచేసి ఆర్థికంగా నన్ను దెబ్బ కొట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. హర్యానాలో ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారని, ఈ సారి భారీ మెజారిటీ సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుండగా, ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి.  

Tags:    

Similar News