భారత్ తో మా సంబంధాలు బలపడతాయి: వైట్ హౌజ్
ఇరు దేశాధినేతలు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నారన్నా కరోనా లీవిట్
By : Praveen Chepyala
Update: 2025-11-05 05:45 GMT
భారత్- అమెరికా సంబంధాలు భవిష్యత్ లో ఇంకా బలంగా మారతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. వైట్ హౌజ్ లోని ఓవల్ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు.
‘‘అతను(ట్రంప్) దాని గురించి(భారత్) సానుకూలంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. కొన్ని వారాల క్రితం భారత ప్రధానిమంత్రితో ఆయన నేరుగా మాట్లాడారని మీకు తెలుసు. ఆయన వైట్ హౌజ్ లోని అనేకమంది ఉన్నత స్థాయి భారతీయ అమెరికన్ అధికారులతో కలిసి ఓవల్ కార్యాలయంలో దీపావళి జరుపుకున్నారు’’ అని లీవిట్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వాషింగ్టన్ కు గొప్ప రాయబారీ అయిన సెర్గియో గోర్ ను న్యూఢిల్లీకి పంపినట్లు ఆమె పేర్కొన్నారు.
‘‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన బృందం భారత్ తో తీవ్రమైన వాణిజ్య చర్చలు జరుపుతున్నారు. కాబట్టి అధ్యక్షుడికి ప్రధాని మోదీపై చాలా గౌరవం ఉందని తెలుస్తుంది. వారు తరుచుగా మాట్లాడుకుంటున్నారు’’ అని ఆమె అన్నారు.
గత నెలలో ట్రంప్ వైట్ హౌజ్ లోని ఓవల్ కార్యాలయంలో దీపావళి వేడుక నిర్వహించారు. దీనికి అమెరికాలోని భారత రాయబారీ వినయ్ క్వాత్రా, అనేకమంది భారతీయ అమెరికన్ వ్యాపార నాయకులు సమాజ ప్రముఖులు హజరయ్యారు.
ట్రంప్ కూడా ప్రధాని మోదీకి ఫోన్ లో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భారత్- అమెరికా రెండూ ప్రపంచాన్ని ఆశతో వెలుగుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడతాయని తాను విశ్వసిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
‘‘అధ్యక్షుడు ట్రంప్, మీ ఫోన్ కాల్, దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. ఈ దీపాల పండగనాడు మన రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచాన్ని ఆశతో ప్రకాశింపజేయడం కొనసాగించాలి. అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి’’ అని మోదీ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
భారత్ పై టారిఫ్ లు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై సుంకాల మోత మోగించిన తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయవద్దనే అమెరికా కోరికను సైతం భారత్ తిరస్కరించింది. దీనితో ఆయన 50 శాతం పెనాల్టీ విధించారు.
అంతేకాక పాక్ తో స్నేహం చేస్తూ కవ్వించారు. పాక్ కు ఆర్థిక, సైనిక సాయం అందించేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీనితో భారత్ కూడా తన విదేశాంగ విధానానికి పదును పెట్టింది. రష్యా, చైనాతో తన స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేసింది.