
TIRUPATI | వికసించిన బాలికల నిజాయితీ.. తీరిన అంగన్వాడీ వేదన
వెంకటగిరిలో దొరికిన ఆరు లక్షల నగలు, నగదు పోలీసులకు అప్పగింత.
బడి వదిలిన తరువాత సాయంత్రం పల్లె వెలుగు బస్సు కోసం నిరీక్షిస్తున్న ఆరుగురు బాలికలకు ఓ పర్సు దొరికింది. తెరిచి చూసిన ఆరు, ఏడో తరగతి చదువుతున్న బాలికలు అవాక్కయ్యారు. విలువైన నగ, నగదు కనిపించడంతో కళ్లు చెదిరిపోయాయి. ఇళ్లకు వెళ్లడం తరువాత అని ఆ బాలికలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి, పర్సు పోలీసులకు అప్పగించి, నిజాయితీ చాటుకున్నారు. మహిళా దినోత్సవం ముందు రోజే బంగారు బిడ్డల్లా మెరిసిన ఆ బాలికలు ఓ అంగన్ వాడీ వర్కర్ కన్నీళ్లు తుడిచారు.
"ఆరు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదు అప్పగించిన విద్యార్థినులు ఆదర్శంగా నిలిచారు" అని వెంకటగిరి సీఐ అభినందించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుకు ఈ విషయం తెలిసింది. ఆరుగురు విద్యార్థినుల తోపాటు వెంకటగిరి జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రాధను తిరుపతికి పిలిపించారు. విద్యార్థినులను అభినందిస్తూ ప్రశంసాపత్రం అందించారు.
"ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పేదలే ఉంటారు. వారి నిజాయితీ ఆదర్శవంతంగా నిలిచింది. ఈ విద్యార్థినులను స్ఫూర్తిగా తీసుకుని పాఠశాలల్లో విలువలు పెంచే విద్య బోధించాలి" అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ .సుబ్బారాయుడు సూచించారు. ఈ సంఘటన
"వెంటగిరిలో ఆదివారం నిర్వహించే మహిళా దినోత్సవ సభలో ప్రత్యేకంగా సత్కరిస్తాం" అని సీఐ ఏవీ. రమణ చెప్పారు. ఈ వివరాల్లోకి వెళితే..
తిరుపతి జిల్లా వెంకటగిరి జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు ఆదర్శంగా నిలిచిన ఘటన ఇది. గురువారం సాయంత్రం బడి వదలగానే విద్యార్థులంతా ఇంటిబాట పట్టారు. మన్నవరం గ్రామం వెళ్లడానికి ఎస్బీఐ సమీపంలోని బస్టాపులో పల్లె వెలుగు బస్సు కోసం కొత్తపల్లి గుంటకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు బి. గురుప్రియ, బి. గీతిక, ఎం. గీతిక, 6వ తరగతి విద్యార్థిని పద్మజ, 7వ తరగతి విద్యార్థిని హేమలత నిరీక్షిస్తున్నారు. వారిలో కొందరు ఆటలాడుకుంటే ఉన్నారు. వారికి బస్టాపు వద్ద ఒక పర్సు కనిపించింది. ఆ పర్సులో బంగారు ఆభరణాలు, నగదు, ఆధార్ కార్డు ఉండడం చూసి నోరెళ్లబెట్టారు. వారిలో వారు చర్చించుకున్న తరువాత నేరుగా వెంకటగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.
పోలీసుల కంగారు..
పోలీస్ స్టేషన్ కు ఆరుగురు విద్యార్థినులు ఒకేసారి రావడంతో విజుబుల్ పోలీసింగ్ లో ఉన్న వెంకటగిరి సీఐ ఏవీ. రమణ, ఎస్ఐ స్వరూప, సిబ్బంది ఏదో జరిగిందని సందేహించారు. స్టేషన్ వద్దకు వచ్చిన విద్యార్థినులు పర్సు అప్పగించి, జరిగిన విషయం చెప్పారని సీఐ ఏవీ. రమణ వివరించారు. అదే సమయంలో..
కన్నీటి పర్యంతంగా..
వెంకటగిరి పట్టణంలో అంగన్ వాడీ వర్కర్ మాతంగి మహాలక్ష్మి కన్నీటి పర్యంతం అవుతూ, స్టేషన్కు వచ్చారు. తాను పొగొట్టుకున్న నగలు, నగదు విద్యార్థులకు దొరికిందని, అవన్నీ పోలీసులకు విద్యార్థినులు అప్పగించారని ఆ వర్కర్ కు తెలియదు. సీఐ రమణ, ఎస్.ఐ స్వరూప సాధారణంగానే ఏమి జరిగిందనే విషయం ఆ అంగన్ వాడీ వర్కర్ నుంచి వివరాలు సేకరించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం బంగారు ఆభరణాలు సరిపోయినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు.
దీనికి ముందేమి జరిగిందంటే..
మహిళా దినోత్సవం సందర్భంగా వెంకటగిరి పట్టణంలో అంగన్ వాడీ వర్కర్లకు పోలీసులు అవగాహన కార్యక్రమాల్లో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిగతా వారితో పాటు మాతంగి మహాలక్ష్మి కూడా హాజరయ్యారు. ఈ శిబిరం పూర్తయ్యాక, మధ్యాహ్నం తరువాత బ్యాంకులో తాకట్టులో ఉంచిన 14.50 సవర్ల నగలు, రూ.28.50 వేల నగదు ఓ పర్సులో ఉంచి, ప్లాస్టిక్ కవర్లో వేసుకుని వెళుతుంటే ఎక్కడో జారి పోయిందని పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన మహాలక్ష్మి కన్నీరుమున్నీరైంది. నా కష్టంతో సంపాదించుకున్నా సర్ అని మాతంగి మహాలక్ష్మి చెప్పిన మాటలు వినిన సీఐ ఏవీ. రమణ, ఎస్ఐ స్వరూప విద్యార్థినులకు ఏమి మాట్లాడవద్దని సంజ్ణలు చేశారు.
బాధితురాలు మహాలక్ష్మి చెప్పిన వివరాల మేరకు నగలు, నగదు పర్సులో సరిపోవడంతో ఆధార్ కార్డు కూడా ఆధారం ఉండడం వల్ల ఆ పర్సును మహాలక్ష్మికి పోలీసులు అప్పగించారు. దీంతో నగలు దొరికిన విద్యార్థులు అవాక్కయితే, గంటల వ్యవధిలోనే తాను పొగొట్టకున్న నగలు, నగదు తిరిగి దొరకడంతో మహాలక్ష్మి కళ్ల నుంచి వేదనతో కూడిన కన్నీటి స్థానంలో ఆనంద భాష్పాలు జలజలరాలాయి. విద్యార్థినులను పోలీసులతో పాటు, బాధితురాలు కూడా కృతజ్ణతలు చెప్పారు.
సీఐ ఏవీ. రమణ 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రదినిధితో మాట్లాడుతూ, పోలీసు శాఖ నిర్వహించిన కార్యక్రమానికి హాజరై, తిరిగి వెళ్లే సమయంలో బ్యాంకులోని నగలు విడిపించుకున్నారని చెప్పారు. పాఠశాల ఉపాధ్యాయుల మాటల ప్రభావంతో విద్యార్థినుల నిజాయితీ చాటుకున్నారని సీఐ ఏవీ. రమణ అభినందించారు.
ఎస్పీ కార్యాలయంలో సన్మానం..
వెంకటగిరిలో విద్యార్థినుల నిజాయితీగా వ్యవహరించిన తీరును తిరుపతి జిల్లా ఎస్పీకి తెలియజేశామని సీఐ ఏవీ. రమణ చెప్పారు. దీంతో కొత్తపల్లి గుంటకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు బి. గురుప్రియ, బి. గీతిక, ఎం. గీతిక, 6వ తరగతి విద్యార్థిని పద్మజ, 7వ తరగతి విద్యార్థిని హేమలతను జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించారు. వారి వెంట వెంకటగిరి జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం రాధ కూడా ఉన్నారు. విద్యార్థినులను అభినందించిన ఎస్పీ సుబ్బారాయుడు వారికి ప్రత్యేకంగా తయారు చేసిస పశంసాపత్రాలు అందించారు.
"చిన్న వయసులోనే విద్యార్థినులు చూపిన నిజాయితీ ప్రతి ఒక్కరికీ ఆదర్శం. వారిని మిగతా విద్యార్థినులు ఆదర్శంగా తీసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలి" అని ఎస్పీ సుబ్బారాయుడు ఆకాంక్షించారు.
Next Story

