
టీటీడీ మాస్టర్ ప్లాన్: ఒంటిమిట్టలో రూ. 37 కోట్లతో వంద గదుల సముదాయం..
రాష్ట్ర పండుగగా శ్రీరామనవమి నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు
కడప జిల్లా ఒంటిమిట్ట ఏకశిలా నగరం శ్రీరామనవమి ఉత్సవాలకు సిద్ధం అవుతోంది. రాష్ట్ర విభజన తరువాత ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయాన్ని ఆంధ్రా భద్రాద్రిగా మార్చుకుని, రాష్ట్ర పండుగగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత తిరుమలకు తీసిపోని రీతిలో ఉత్సవాల నిర్వహణకు టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. టీటీడీ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ లో భాగంగా 37 కోట్ల రూపాయలతో వంద గదుల యాత్రికుల వసతి గదుల సముదాయం నిర్మించనున్నారు.
కడప జిల్లా అధికారులతో కలిసి టీటీడీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ ఏడాది రూ. 4 కోట్ల రూపాయలతో విద్యుత్ దీపాలంకరణ ఎల్ఈడి , పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. ఈపాటికే కోదండరామాలయం వద్ద తిరుమల తరహాలోనే రోజూ వెయ్యి నుంచి రెండు వేల మందికి అన్నప్రసాదాలు వడ్డించేందుకు నిత్యాన్నదాన పథకం ప్రారంభించారు.
"ఆలయం వద్ద మూడు పూటలా యాత్రికులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు వడ్డించడానికి ఏర్పాట్లు చేశాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. ఒంటిమిట్ట వద్ద నిత్యాన్నదాన పథకం విస్తరించడానికి గత ఏడాది జూలై 22వ తేదీ జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో 4.35 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఈ నెల 27వ తేదీ అంకురార్పణలో ప్రారంభమయ్యే శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లకు మాస్టర్ ప్లాన్ అమలు చేయడంతో టీటీడీ తిరుపతి జేఈఓ వి. వీరబ్రహ్మం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు పోలీసుల సమన్వయంతో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నామని టిటిడి సివిఎస్వో కేవీ మురళీకృష్ణ తెలిపారు. సమస్య ఏర్పడిన వెంటనే కమాండ్ కంట్రోల్ ద్వారా స్పందించేందుకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆంధ్రా భద్రాద్రి... ఒంటిమిట్ట
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీరామనవమి ఉత్సవాలు భద్రాచలం రామాలయం వద్ద అధికారికంగా నిర్వహించే వారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి సీతారాములవారికి పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉంది.
2014లో రాష్ట్ర విభజన తరువాత శ్రీరామనవమిని రాష్ట్ర ఉత్సవంగా ఎక్కడ నిర్వహించాలనే విషయంలో తీవ్ర చర్చ జరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి డిమాండ్లు తెరమీదకు వచ్చాయి. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని పట్టాభిరామస్వామి ఆలయాన్ని 1997 ఫిబ్రవరి 23వ తేదీ దేవాదాయ శాఖ నుంచి టీటీడీ స్వాధీనం చేసుకుంది. ఈ ఆలయం వద్ద శ్రీరామనవమి రాష్ట్ర పండుగగా అధికారింగా నిర్వహించాలని ప్రభుత్వంపై కుల, మతాలకు అతీతంగా ఒత్తిళ్లు వచ్చాయి.
ఒంటిమిట్ట వద్ద క్రీస్తుశకం 1356లో బుక్కరాయలు శ్రీకోదండరామాలయనిర్మాణం ప్రారంభించారు. విజయనగర రాజుల కాలంలో ఆలయ అంతరాలయం ,రంగమండపం, మహాప్రాంగణం గోపురం నిర్మించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 2015 ఏప్రిల్ 30వ తేదీ ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాద్రిగా నిర్ణయం ప్రకటించారు.
2016లో కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద ఉన్న 14 వ శతాబ్దం (17వ శతాబ్దంలో నిర్మాణం పూర్తయింది) నాటి శ్రీకోదండరామస్వామి ఆలయం వద్ద అధికారిక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
శ్రీరామనవమి ఉత్సవాల్లో యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ చెప్పారు. టీటీడీ యంత్రాంగంతో జిల్లా అధికారులను సమన్వయం చేసే విధంగా బాధ్యతలు వికేంద్రీకరించామని చెప్పారు.
టీటీడీ మాస్టర్ ప్లాన్
ఒంటిమిట్ట వద్ద శ్రీకోదండరామాలయాన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా తీర్చిదిద్దే ప్రణాళికలు టీటీడీ అమలు చేస్తోంది. దీనికోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఆలయం వద్ద యాత్రికులకు వసతుల కల్పనకు 37 కోట్ల రూపాయలతో వంద గదుల వసతి సముదాయం నిర్మించనున్నారు. 195 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్దచెరువులో రూ. 20. 17 కోట్లతో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది.
తిరుమల తరహాలో ఏర్పాట్లు..
కడప, తిరుమల మధ్య ఆలయాల సర్క్యూట్ కు టీటీడీ ఒంటిమిట్ట కేంద్ర బిందువుగా ఎంపిక చేసింది. ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలు మరింత శోభాయమానంగా నిర్వహించడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
"ఈ నెల 27వ తేదీ నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం. టిటిడి ద్వారా 2016 నుంచి శ్రీరామ నవమి ఉత్సవాలు శ్రీరాముల వారి కళ్యాణం నిర్వహిస్తున్నాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు.
తిరుమల తరహాలోనే ఒంటిమిట్ట కోదండరామాలయం వద్ద నిత్యాన్నపథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. రోజు మూడు పూటలా 1500 నుంచి రెండు వేల మందికి అన్నప్రసాదాలువడ్డించడానికి టీటీడీ శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేసింది. తాత్కాలికంగా భక్తులకు అన్నప్రసాదాలను అందించేందుకు జర్మన్ షెడ్ ఏర్పాటు చేశారు.
బ్రహ్మోత్సవాల్లో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ప్రత్యేక అలంకరణలు ఉండాలని టీటీడీ, కడప జిల్లా అధికారులకు :
టీటీడీ అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి సూచనలు ఇచ్చారు.
ఏప్రిల్ ఒకటిన
ఒంటిమిట్టలో ఏప్రిల్ ఒకటో తేదీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునా పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
"శ్రీ సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తులకు ఉచితంగా రూ. 50 విలువైన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అందిస్తాం. అన్నప్రసాదాలు తాగు నీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణి చేస్తాం. జిల్లా అధికారులు, టిటిడి సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేస్తున్నాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వివరించారు.
"శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి వచ్చే యాత్రికులకు ఇబ్బంది లేకుండా, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రత, అన్నప్రసాదాల పంపిణీ, కల్యాణాన్ని భక్తులు ఆనందంగా వీక్షించేలా ఏర్పాట్లు చేయండి" అని నాయుడు సూచించారు.
"కళ్యాణ వేదిక వద్ద గ్యాలరీల్లో భక్తులకు అసౌకర్యం లేకుండా శ్రీవారి సేవకులు, పోలీస్ సిబ్బంది, టీటీడీ ఉద్యోగులు సమన్వయంతో పనిచేయండి" అని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ప్రత్యేక సూచనలు చేశారు.
Next Story

