కల్తీ నెయ్యి:క్లీన్ చిట్ ఎరిచ్చారు..? మాటలతో వైసీపీ నేతల మోసం..
x

వైసీపీ నేతలు వైవి.సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిపై మాటల తూటాలు పేల్చిన టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు

కల్తీ నెయ్యి:క్లీన్ చిట్ ఎరిచ్చారు..? మాటలతో వైసీపీ నేతల మోసం..

ముఠామేస్త్రీ పాత్ర ఏమిటని.. జగన్ ను టార్గెట్ చేసిన టీటీడీ చైర్మన్


శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై క్లీన్ చిట్ ఇచ్చారంటూ వైసీపీ నేతలు మరోసారి భక్తులను మోసం చేస్తున్నారని టిటిడి చైర్మన్ బీఆర్. నాయుడు మండిపడ్డారు. నెయ్యి కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు వైవి. సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ముఠా మేస్త్రీ సహకారం లేకుండా ఈ తరహా అవినీతి, అక్రపాలకు పాల్పడగలరా అని మాజీ సీఎం వైఎస్. జగన్ ను కూడా టీటీడీ చైర్మన్ నాయుడు టార్గెట్ చేశారు.

శ్రీవారి పవిత్రకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

"వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలో చేసింది 'శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం' కాదు. చావుకు భయపడే మృత్యుంజయ హోమం నిర్వహించారు" అని నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి యాత్రికుల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీ నేతలు హిందూ స‌మాజానికి క్ష‌మాప‌ణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తిరమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై నెల్లూరు సీబీఐ కోర్టులో ఈ నెల 21న చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆరోపించినట్టు గొడ్డు కొవ్వు కలవలేదు. కూరగాయల ప్రేరకాలు, రసాయనాలు మాత్రమే కలిశాయని సీబీఐ తన నివేదికలో ప్రస్తావించింది. దీనిపై వైసీపీ సంబరాలు, ఎదురుదాడికి దిగింది. ఈ పరిస్థితుల్లో..

తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారం టీటీడీ పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి, జీ. భానుప్రకాష్ రెడ్డి, న‌రేష్‌కుమార్‌, ద‌ర్శ‌న్, తుడా చైర్మన్, ఎక్స్ అఫీషియా సభ్యుడు డాలర్ దివాకరరెడ్డితో కలసి చైర్మన్ బీఆర్. నాయుడు మీడియాతో మాట్లాడారు.

మైక్రో డీఎన్ఏ చేయిస్తాం..

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో గొడ్డు కొవ్వు కలిసిందా? లేదా? అని తేల్చడానికి మైక్రో డీఎన్ఏ (Micro DNA) చేయించడం ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తెగేసి చెప్పారు.
"శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పడం వాస్త‌వం కాదు. సీబీఐ సారధ్యంలోని సిట్ ఛార్జ్‌షీట్‌లోనే కల్తీ స్పష్టంగా నమోదు అయింది" అని ఆయన అన్నారు. నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘన జరిగాయని, కొందరికి లాభం కలిగించే విధంగా నిబంధనలను మార్చారని చైర్మన్ నాయుడు ఆరోపించారు. కమీషన్ల కోసమే భోలేబాబా డైరీ నుంచి నెయ్యి తీసుకున్నారని ఆయన చెప్పారు. ఈ నెయ్యిలో రసాయనాలు వాడిన విషయం కూడా స్పష్టంగా తేలిందని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. "గతంలో నివేదికలు అనుకూలంగా మార్చుకోవడానికి అప్పటి ఛైర్మన్, వైసీపీ నేత వైవీ. సుబ్బారెడ్డి కార్యాలయం నుంచి మెయిల్స్ వెళ్లాయి" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒక ప్రైవేటు వ్యక్తి ఇన్ని కోట్ల లావాదేవీలు చేయడం అసాధ్యమని అన్నారు.
"సరైన సామర్థ్యం లేని సంస్థలకు నెయ్యి టెండర్లు అప్పగించి, సుమారు రూ. 250 కోట్ల రూపాయలతో 60 ల‌క్ష‌ల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు చేశారు. ఈ నెయ్యిని ప‌రీక్షించిన NDDB జంతు కొవ్వు ఉంద‌ని నివేదిక ఇచ్చింది" అని కూడా ఆయన స్పష్టం చేశారు.

సీబీఐ నివేదికపై అసంతృప్తి


నెయ్యి కొనుగోలు వ్యవహారంలో కొందరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో సీబీఐ విచారణ చేయకపోవడంపై టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.

"కొంతమంది ఖాతాల్లోకి వెళ్లిన కోట్ల రూపాయల లావాదేవీలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి" అని ఆయన సిట్ (CBI, Special Investigative Team SIT) అధికారులను కోరారు. దర్యాప్తు సమయంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి, ఆయన భార్య బ్యాంకు ఖాతాలు ఇవ్వడానికి నిరాకరించిన విషయాన్ని గుర్తు చేసిన నాయుడు.. వారి బ్యాంక్ ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ కావడం వాస్తవమా? కాదా? బినామీల వెనుక అసలు పెద్దలు ఎవరో? నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, టిటిడి పవిత్రతను కాపాడేందుకు ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

క్షమాపణ చెప్పాలి..

కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వంలో తిరుమల పవిత్రతకు తీవ్రమైన భంగం కలిగించారని టీటీడీ చైర్మన బీఆర్. నాయుడు అన్నారు. ఐదేళ్ల కాలంలో హిందూ దేవుళ్లను, హిందూ సమాజాన్ని హేళన చేసిన వైసీపీ నేతలు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
"ఒక్క ఆవు లేకుండా, చుక్క నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా నెయ్యి తయారు చేశామని చెప్పడం అబద్ధం. నెయ్యి తయారీలో వాడిన కొన్ని రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవి" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైంద‌వ‌ స‌మాజాన్ని నాశ‌నం చేయ‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయన వైసీపీ నేతల తీరుపై విరుచుకుపడ్డారు.
"వైసీపీ అధ్యక్షుడితో పాటు టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వారంతా క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వారే. వారికి హిందూ దేవుళ్లు, ఆలయాలపై విశ్వాసం లేదు" అని కూడా నాయుడు నిందించారు.
Read More
Next Story