తిరుపతి:MBU గుర్తింపు రద్దు చేయాలన్న అఖిలపక్షం...
x

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు

తిరుపతి:MBU గుర్తింపు రద్దు చేయాలన్న అఖిలపక్షం...

ఎస్ఎఫ్ఐ నేతలను కిడ్నాప్ చేసిన నిందితుల అరెస్టు.


విద్యార్థి నాయకులపై కౌంటర్ కేసులు ఎత్తివేయండి

అక్రమంగా వసూలు చేసిన రూ. 26 కోట్లు ఫీజును తిరిగి చెల్లించండి

శుక్రవారం విద్యా సంస్థల బంద్ కు పిలుపు

తిరుపతికి సమీపంలోని మోహన్ బాబు యూనివర్శిటీ (MBU) రద్దు చేయాలని విద్యార్థి, రాజకీయ పార్టీల అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. ఎస్ఎఫ్ఐ నేతలపై దాడి, కిడ్నాప్ కేసులో సినీ నిర్మాత, నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కొడుకు మంచు విష్ణును అరెస్టు చేయాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. అక్రమంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఎంబీయూ తిరిగి చెల్లించడానికి వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా అఖిలపక్ష సమావేశం తీర్మానించింది.
తిరుపతిలో ఎస్ఎఫ్ ఐ నేతలు అక్బర్, వినోద్ ను మోహన్ బాబు యూనివర్శిటీ మద్దతుదారులు బుధవారం కిడ్నాప్ చేశారని తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తిరుపతి యశోద నగర్ లోని వేమన విజ్ఞాన కేంద్రంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి. సుబ్రమణ్యం అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి, సిపిఐ ఎంఎల్ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం,ఆర్.పి.ఐ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు పి. అంజయ్య మాట్లాడారు.

తీర్మానాలు ఇవీ..

1. మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఎస్ఎఫ్ఐ నాయకులు అక్బర్ వినోద్ లపై నమోదు చేసిన కౌంటర్ కేసులను పోలీసులు ఎత్తివేయాలి. ప్రధాన నిందితులు మోహన్ బాబు, మంచు విష్ణు తోపాటు ఘటనలో ఉన్న బౌన్సర్లు, ఇతర దోషులను అరెస్టు చేసి జైలుకు పంపాలని సమావేశం తీర్మానించింది.
2. విద్యార్థులపై జరిగిన దాడి, కిడ్నాప్ చర్యలను నిరసించింది. అన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం బాలాజీ కాలనీలోనే జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మోహన్ బాబు మంచు విష్ణు దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని తీర్మానించారు.
3. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. తిరుపతిలోని అన్ని ప్రైవేటు ప్రభుత్వ విద్యాసంస్థలు బందుకు సంఘీభావం ప్రకటించి మూసివేయాలని నేతలు యాజమాన్యాలకు అఖిలపక్షం కోరింది.

ప్రశ్నిస్తే కిడ్నాప్ చేస్తారా..?

మోహన్ బాబు విద్యాసంస్థలో విద్యార్థుల వద్ద అక్రమంగా 26 కోట్ల రూపాయలు ఫీజులు పేరుతో వసూలు చేయడాన్ని ప్రశ్నిస్తే కిడ్నాప్ చేస్తారా? అని అఖిలపక్ష నేతలు ప్రశ్నించారు. మోహన్ బాబు నీచ సంస్కృతిని మానవతావాదులందరూ కూడా ఖండించాలన్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విద్యాసంస్థలో రౌడీలు, గుండాలు, బౌన్సర్లను పెట్టుకొని ప్రశ్నించిన వారిపై బెదిరించడం, భౌతిక దాడులకు పాల్పడడం వంటి చర్యలుకు పాల్పడుతున్నారని అన్నారు.
ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్, యూనివర్సిటీ విద్యార్థి నేత వినోద్ ను మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన వారు వాహనాల్లో వచ్చి కిడ్నాప్ చేసి నేతలను తీవ్రంగా కొట్టారని సీఐటీయూ రాష్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళీ తెలిపారు.
మోహన్ బాబునే ప్రశ్నించేంత గొప్ప వాళ్లా??? మా మాట వినకపోతే చంపేస్తామని విద్యార్థి సంఘ నాయకులను బౌన్సర్లు బెదిరించారని ఆయన తెలిపారు. విద్యార్థి సంఘ నేతలను కిడ్నాప్ చేశారని సమాచారం ఇవ్వగానే జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, కలెక్టర్ సకాలంలో స్పందించి, న్యాయం చేశారని ఆయన జిల్లా యంత్రాంగానికి కృతజ్ణతలు తెలిపారు.
"కిడ్నాప్ కు పాల్పడిన యూనివర్సిటీ పీఆర్వో సతీష్, బౌన్సర్లు, ఈ సంఘటనకు కారకులైన మోహన్ బాబు, ఆయన కొడుకు విష్ణును అరెస్టు చేయండి" అని డిమాండ్ చేశారు.
కిడ్నాప్ కు గురైన అక్బర్, వినోద్ మాట్లాడుతూ, సిపిఎం, సిపిఐ నేతలు తక్షణం స్పందించి పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు స్పందించడం వల్లే ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నగేష్, బీసీ సంక్షేమ సంఘం అఖిల భారత నాయకులు ఆల్ మెన్ రాజు, తిరుపతి స్థానిక హక్కుల పోరాట కమిటీ నాయకులు డిఎంసి భాస్కర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి చలపతి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు పవిత్ర, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున్, ఎన్ ఎల్ ఎస్ ఏ అధ్యక్షులు సుందర్రాజు, జై భారత్ నేషనల్ పార్టీ స్టూడెంట్ విభాగం అధ్యక్షులు భార్గవ్ సాయి, తిరుపతి యూత్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ గౌడ్ ఈ సమావేశంలో సంఘీభావం తెలిపారు.

13 మంది నిందితుల అరెస్టు..


తిరుపతిలో ఎస్ఎఫ్ఐ నేతలు అక్బర్, వినోద్ ను కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ వివరాలను తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ రవిమనోహరాచారి మీడియాకు వెల్లడించారు.

"కిడ్నాప్ కేసులో 13 మందిని అరెస్టు చేసాం. ఇంకొంతమందిని అరెస్టు చేస్తాం" అని అదనపు ఎస్పీ రవిమనోహరాచారి చెప్పారు. విద్యార్థి సంఘం నేతలు వినోద్ కుమార్, అక్బర్ ను ఈనెల 3వతేదీ కిడ్నాప్ చేశారనీ, నిందితుల్లో విద్యానికేతన్ పిఆర్ఓ సతీష్ తో టు మరో 12 మందిని అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు.

బౌన్సర్లు ఆత్మరక్షణ కోసమే

విద్యార్థి సంఘ నేతలపై మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం బౌన్సర్లతో దాడి చేయించిందని అదనపు ఎస్పీ రవిమనోహరాచారి వెల్లడించారు. పట్టుబడిన వారిలో బౌన్సర్లు, సిబ్బంది కూడా ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు.

"బౌన్సర్లను స్వీయరక్షణ కోసమే ఉపయోగించాలి" అని రవిమనోహరాచారి గుర్తు చేశారు. అయితే విద్యానికేతన్ నిర్వాహకులు బౌన్సర్లతో నేరాలు చేయించారని వ్యాఖ్యానించారు. వారి నుంచి మూడు ఇన్నోవా కార్లు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

"విద్యానికేతన్ పిఆర్ ఓ సతీష్ ఫిర్యాదుతో విద్యార్థి సంఘాల నేతలను కేసులు నమోదయ్యాయి. వాటిని కూడా విచారణ చేస్తాం. విద్యార్థి సంఘాల నేతలు డబ్బు డిమాండ్ చేశారా? లేదా? అనేది తేలాల్సి ఉంది" అని అదనపు ఎస్పీ రవిమనోహరాచారి వివరించారు.

Read More
Next Story