తిరుమల: శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి సాహసయాత్ర ఎలా సాగుతుందంటే..
x

తిరుమల: శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి సాహసయాత్ర ఎలా సాగుతుందంటే..

ఫిబ్రవరి1న నిర్వహణకు టీటీడీ ఏర్పాట్లు.


తిరుమల ప్రకృతి సోయగాలకు నెలవు. చారిత్రక తీర్థాలు ఉన్న శేషాచలం అడవుల్లో ఫిబ్రవరి ఒకటో తేదీ శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవం నిర్వహించనున్నారు. దీనికోసం టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది. అడవుల్లో ప్రయాణం కావడం వల్ల యాత్రికులకు కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు.

ఫిబ్రవరి ఒకటో తేదీ నిర్వహించే ఈ ఉత్సవానికి హాజరయ్యే యాత్రికులకు పాపవినాశనం వద్ద యాత్రికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆ రోజు ఉదయం తిరుమల నుంచి పాపవినాశనం వరకు ప్రయివేటు వాహనాలకు అనుమతి ఉండదు. ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

"దీర్ఘకాలిక రోగాలు, ఆస్థమా, బరువు ఎక్కువ ఉన్న వారు. గుండె జబ్బు ఉన్నా వారు యాత్రకు రాకుండా ఉండడం మంచిది" అని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి సూచించారు.
ఎలా వెళ్లాలంటే..

తిరుమల నుంచి ఆర్టీసీ బస్సుల్లో పాపవినాశనం వరకు చేరుకోవాలి. అక్కడి నుంచి పాపవినాశనం డ్యాం పైనుంచి అడవుల్లో దాదాపు ఆరు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. ఇది ఓ సాహసయాత్రగా చెప్పవచ్చు. కొండ, కోనలు, అడవిలో సాహసోపేతంగా నడక సాగించాల్సి ఉంటుంది.

ఈ అడవి మార్గంలో సాగే యాత్ర ద్వారా ప్రకృతి అనేక పాఠాలు కూడా నేర్పుతుంది. పాపవినాశనం నుంచి శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి వద్దకు అడవిలోనే ప్రయాణం చేయాలి.

మార్గమధ్యలోని కొండకోనల్లో కొన్ని చోట్ల తాళ్లతో ఏర్పాటు చేసిన నిచ్చెనపై నుంచి లోయలోకి దిగాల్సి ఉంటుంది. ఏపుగా పెరిగిన బోద గడ్డి, రాళ్ల మధ్య నడిచి వెళితే.. ఏడాదికి ఒకసారి నిర్వహించే శ్రీరామకృష్ణ ముక్కోటి తీర్థానికి చేరవచ్చు. విశాలమైన కొండ పైనుంచి జారే జలపాతం, బండరాళ్ల మధ్య ప్రవహించే సెలయేటిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి యాత్రికులు ఆసక్తి చూపిస్తారు.

అధికారులతో సమీక్ష..

శేషాచలం అడవుల్లోని శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవం ఫిబ్రవరి ఒకటో తేదీ ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బుధవారం అధికారులతో సమీక్షించారు. తిరుమలలో నిర్వహించే ముఖ్యమైన తీర్థ ఉత్సవాల్లో ఒకటైన రామకృష్ణతీర్థ ముక్కోటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తీర్థముక్కోటికి హాజరయ్యే యాత్రికులకు పాపవినాశనం వద్ద షామియానా ఏర్పాటు చేసి, మంచినీరు ఆహార పదార్ధాలు అందించడానికి ఏర్పాటు చేయడంతో పాటు అటవీమార్గంలో కల్పించాల్సిన వసతులపై కూడా టిటిడి అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి సూచనలు చేశారు.
ఆయన ఏమన్నారంటే..
భక్తుల కోసం షామియానా, రేడియో బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. టీటీడీ భద్రతాసిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం భద్రత, అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం, ఆరోగ్యం, అటవీ విభాగాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పాపవినాశనం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీకి అవసరమైన శ్రీవారి సేవకులను నియమించాలని కోరారు.
వారికి అనుమతి లేదు..
శ్రీరామకృష్ణ తీర్థముక్కోటికి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు దూరంగా ఉండడం మంచిది అని టిటిడి అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి సూచించారు.
"అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులను, చిన్న పిల్లలను అనుమతించం" అని వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. పాపవినాశనం వద్ద భక్తులను మెడికల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే తీర్థానికి అనుమతించాలని స్పష్టంగా ఆదేశించారు. అత్యవసర పరిస్థితిలో చికిత్స అందించేందుకు రెండు అంబులెన్సులు, నాలుగు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కూడా వైద్య శాఖ సిబ్బందిని ఆదేశించారు.
ప్రయివేటు వాహనాలు
పాపవినాశనం మార్గంలో ఫిబ్రవరి ఒకటో తేదీ ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను అనుమతించరు. గోగర్భం డ్యామ్ పాయింట్ నుంచి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి అధికారులకు సూచనలు చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతించనున్నట్లు తెలిపారు.
నేపథ్య కథనం..

తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి ఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణ కథనాల నేపథ్యం.
ఫిబ్రవరి1 వతేదీ : తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అర్చ‌క సిబ్బంది మంత్రోచ్ఛారణలతో ఊరేగింపుగా ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకుంటారు. అక్క‌డ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చంద‌నం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేస్తారు. ప్రత్యేక పూజల అనంతరం నైవేద్యం సమర్పిస్తారు.
యాత్రికుల కోసం..

ఫైల్ ఫొటో

రామ‌కృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాపవినాశనం డ్యామ్‌ వద్ద పొంగలి, ఉప్మా, సాంబారు అన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మ‌జ్జిగ ప్యాకెట్లు పంపిణీకి ఏర్పాట్లు చేయడానికి అన్నదానం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌, ఫారెస్ట్‌ అధికారులు సమన్వయంతో పనిచేసే దిశగా కార్యాచరణ అమలు చేయనున్నారు. పాపవినాశనం డ్యాం వద్ద అంబులెన్స్‌తో పాటు మూడు పాయింట్ల వద్ద వైద్య బృందాలను గత ఏడాది అందుబాటులో ఉంచారు. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు యాత్రికులకు అన్నప్రసాదాలను అందించేందుకు వంద మంది శ్రీవారి సేవకులు సేవలు అందించారు. ఈ ఏడాది కూడా అదే తరహాలో ఏర్పాట్లు చేయడం ద్వారా ఈ యాత్రలో లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు.
Read More
Next Story