తిరుమల:అనధికార వ్యక్తులదే పెత్తనం.. సేవా టికెట్ల బ్లాక్ మార్కెటింగ్
x

తిరుమల:అనధికార వ్యక్తులదే పెత్తనం.. సేవా టికెట్ల బ్లాక్ మార్కెటింగ్

సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఘాటు ఆరోపణలు. సీఎంకు బహిరంగ లేఖ.


తిరుమలలో ప్రముఖులకు దర్శనాలు చేయించడం, సేవా టికెట్ల జారీలో భారీగా అక్రమ కలాపాలు (బ్లాక్ బిజినెస్‌) జరుగుతున్నాయని సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించింది. అనధికారి పీఆర్ఓలు, ఏజెంట్ల వ్యవస్థ పాతుకుపోయిందని ఆ సమితి ప్రతినిధులు ఆరోపించారు.

"కొందరు ప్రజాప్రతినిధులు , టీటీడీ బోర్డు సభ్యులు జారీ చేసే లేఖలతో అనధికార ప్రతినిధులు వ్యాపారం సాగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది" అని సనాతన ధర్మ పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షుడు యర్రాకుల తులసీరామ్ యాదవ్, రాష్ట్ర చైర్మన్ సింగరయ్య యాదవ్ ఘాటు ఆరోపణలు చేశారు. తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాల కేటాయింపు, సేవా టిక్కెట్ల కేటాయింపుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలపై వివరణ కోరడానికి టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరిని సంప్రదించడానికి ప్రయత్ని, ఆయన పీఏ మాట్లాడారు. "సార్ బిజీగా ఉన్నారు" అని సమాధానం ఇచ్చారు.
తిరుమలలో జరుగుతున్న అవినీతి, శ్రీవారి సన్నిధిలో మూలమూర్తిని దర్శించుకునే సమయంలో వీఐపీ సిఫారసు లేఖల ద్వారా వెళ్లే యాత్రికులకు అవమానాలు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి ఫ్లైఓవర్ సమీపంలో వైటిఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న "సనాతన ధర్మ పరిరక్షణ సమితి" గౌరవాధ్యక్షుడు యర్రాకుల తులసీరాం యాదవ్, రాష్ట్ర చైర్మన్ సింగరయ్య యాదవ్, ప్రతినిధులు అనేక విషయాలను ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖ వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది.
అయ్యా,
"తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలకు, సేవల టిక్కెట్లకు సంబంధించి అనధికారికంగా జరుగుచున్న బ్లాక్ బిజినెస్‌ను నిలువరించండి. అనధికారిక పిఆర్ఓలు, ఏజెంట్ల వ్యవస్థ నిర్మూలించండి" అని అభ్యర్థించారు. కొందరు ప్రజాప్రతినిధులు, టిటిడి. బోర్డు మెంబర్లు తమ అనధికారిక ఏజెంట్ల ద్వారా తిరుమలలో విఐపి దర్శనాలు, సేవల టిక్కెట్లకు జారీ చేస్తున్న సిఫార్సు లేఖలతో బ్లాక్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు బలమైన ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి. ఇది బహిరంగ రహస్యంగా కనబడుతోందని ఆ లేఖలో ప్రస్తావించారు.

ప్రశ్నల వర్షం..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు "సనాతన ధర్మ పరిరక్షణ సమితి" ప్రతినిధుల లేఖలో అనేక ప్రశ్నలు సంధించారు.
"అనధికార పిఆర్ఓలు ఏజెంట్ల అవసరం తిరుమలలో ఏముంది? సిఫార్సు లేఖలు తీసుకు వెళ్ళేవారు వారంతట వారు సబ్మిట్ చేసుకోలేరా? ఎవరికైనా సందేహాలుంటే సహాయం చేయడానికి టిటిడి సిబ్బంది లేరా? అనధికారిక పిఆర్ఓలు పెట్టి బ్లాక్ బిజినెస్ చేయిస్తున్న విషయం బహిరంగ రహస్యం కాదా? గౌరవ ప్రజాప్రతినిధులు, టిటిడి బోర్డు మెంబర్లు పిఆర్ఓలకు జీతాలు ఇచ్చి భక్తులకు సేవ చేయిస్తున్నారా? గతానికి ప్రస్తుతానికి తేడా ఏమిటి? తిరుమలలో ఈ తరహా కార్యకలాపాలు మీ ప్రభుత్వం చేసిన ప్రక్షాళన ఏమిటి" అని సూటిగా నిలదీశారు.

లేఖ ఇవ్వడానికి రెండు గంటలా..?

తిరుమలలో సిఫారసు లేఖ దాఖలు చేయడానికి రెండు గంటలకు పైగానే సమయం పడుతోంది. అంటే, సిఫారసు లేఖల ద్వారా వచ్చే యాత్రికుల సంఖ్య ఆ స్థాయిలో ఉందనే విషయాన్ని "సనాతన ధర్మ పరిరక్షణ సమితి" ప్రతినిధులు ప్రధానంగా ప్రస్తావించారు.
"విఐపి బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖ సబ్మిట్ చేయడానికి సుమారు రెండు గంటలు పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం వారికి గది కేటాయించడానికి సమయం పడుతోంది. విఐపి బ్రేక్ అర్థాన్నే మార్చేశారు. ఈ పేరుతో విపరీతంగా బ్లాక్ బిజినెస్ బహిరంగంగా చేయిస్తున్నారు" అని "సనాతన ధర్మ పరిరక్షణ సమితి" ప్రస్తావించింది.
శ్రీవారి సన్నిధిలో కూడా విఐపి దర్శన సమయంలో కూడా లాగేస్తున్నారు, తోసేస్తున్నారు. మెడలో వేసుకున్న కండువా కిందికి పడిపోయే స్థాయిలో తోసేస్తున్నారంటే ఇక విఐపి ఏమిటి?" అని నిరసిస్తూనే, విజిలెన్స్ విభాగంతో నిష్పక్షపాతంగా విచారణ చేయించి, బ్లాక్ మార్కెట్ నివారించాలని సమితి ప్రతినిధులు కోరారు.

బ్లాక్ లో విఐపీ టికెట్లు

తిరుమలలో జరుగుతున్న అనేక వ్యవహారాలను సమితి ప్రతినిధులు తెరపైకి తెచ్చారు.
"శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ రూ.500 మాత్రమే. దీనిని బ్లాక్ లో రూ. ఐదు వేలక విక్రయిస్తున్నారు. సేవా టికెట్లు రూ. పది వేల నుంచి 25 వేలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి" అని సమితి ప్రతినిధులు ఘాటైన విషయాలను ప్రస్తావించారు. ఈ విషయాలపై విచారణ చేయించాలని వారు కోరారు.
"విఐపి బ్రేక్‌, సేవా టికెట్లకు సిఫార్సులు రద్దు చేయండి. ఆన్‌లైన్‌లో 72 లేదా 96 గంటల ముందు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోండి" అని సమితి ప్రతినిధులు సూచన చేశారు.
"సామాన్య యాత్రికులు కనీసం రెప్పపాటు శ్రీవారిని చూసే అవకాశం ఇవ్వడం లేదు. సేవకులు, సిబ్బంది నిర్దాక్షిణ్యంగా తోసేస్తున్నారు. టీటీడీ చైర్మన్ గా కనుమూరి బాపిరాజు ఉన్న సమయంలో యాత్రికులను టచ్‌ చేస్తే కుదరదంటూ కఠిన ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన సమితి ప్రతినిధులు ఆ తరహాలో ఎందుకు చేయలేరు" అని కూడా ప్రశ్నించారు. శ్రీవాణి తరహాలోనే విఐపి దర్శనాలు, సేవా టికెట్లకు కూడా వర్తింప చేయండి. స్వచ్ఛందంగా నచ్చినవారు వెళతారు. ఆ ధరలు చెల్లించలేని వారు సర్వదర్శనానికి వెళతారు. దీనివల్ల దళారుల బాధ ఉండదు. తిరుమల అపవిత్రం అవ్వదు" అని కూడా ఒకింత నిరసన వ్యక్తం చేస్తున్నట్లే ఈ బహిరంగ లేఖలో ప్రస్తావించిన అంశాలు కనిపించాయి.
ఈ విషయాలపై మాట్లాడాలని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరికి కాల్ చేయగా..
"తెప్పోత్సవాల నిర్వహణలో సార్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడడం సాధ్యం కాదు" అని అదనపు ఈఓ సమాధానం చెప్పారు. ఆయన పేరు చెప్పడానికి కూడా ఇబ్బంది పడ్డారు. "పీఆర్ పెంచుకునే ప్రయత్నం చేయవద్దు. పీఏ అని మాత్రమే చెప్పండి" అని అదనపు ఈఓ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని ఆయన మాటల ద్వారా తెలిసింది.
Read More
Next Story