శాసనమండలి ఛైర్మన్ కు మతం రంగు పులమటం నీచమైంది
అవినీతిపరులను శిక్షించండి... సాగదీయడం మానండి
లడ్డూ కల్తీపై సిట్ నివేదిక బహిర్గతం చేయండి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మొదట రాజకీయ సమస్యగా మార్చారు. ప్రస్తుతం మత సమస్యగా మార్చడం ద్వారా రాష్ట్రాన్ని అప్రతిష్టతో భ్రష్టు పట్టించే దశకు తీసుకుని వచ్చారని సీపీఎం రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. శాసనమండలి ఛైర్మన్ కు మతం రంగు పులమడంపై ఆందోళన నిరసన వ్యక్తం చేసింది. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే నివేదిక ప్రజల ముందు ఉంచాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. టీడీపీ లౌకికవాదం ఏమైందని ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ప్రశ్నించారు.
తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో సీఐటీయూ ఆధ్వర్యంలో సాగిస్తున్న కార్మికులు చేపట్టిన రెలే దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. సిపిఎం నేత కందారపు మురళి, ఎస్ జయచంద్ర తో కలిసి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గురువారం మీడియాతో మాట్లాడారు.
"శాసనమండలిలో ఛైర్మన్ కు మతం రంగు పులమటం, లడ్డు వివాదానికి రాజకీయ రంగు పులిమి ఇప్పుడు మత వివాదంగా మార్చాలని టిడిపి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే లౌకికవాదానికి పూర్తిగా స్వస్తి పలికి, ఆర్ఎస్ఎస్ లాంటి మతోన్మాద సంస్థలను మించి టిడిపి ప్రవర్తిస్తున్నదన్న భావన కలుగుతోంది" అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు.
"నెయ్యి కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, అనవసర రాద్ధాంతాలతో పూటకో మాట మాట్లాడుతున్నారు. కూటమిలోని ప్రభుత్వ పెద్దలు బాధ్యతా రాహిత్యంగా తయారయ్యారు" అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. రాష్ట్రంలో లడ్డు వివాదం తప్ప మరో సమస్య లేనట్టుగా పాలక, ప్రధాన ప్రతిపక్షాలు గత నెల రోజుల నుంచి మాట్లాడుతుండటం వారి బాధ్యతా రాహిత్యానికి పరాకాష్టగా ఆయన అభివర్ణించారు.
"సిట్ నివేదిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఇవ్వలేదు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ప్రకటన చేయడంలో అర్థం ఏమిటి?" అని ఆయన ప్రశ్నించారు.
ఇదీ మరీ దారుణం..
శాసనమండలిలో ఛైర్మన్ కు మతం రంగు పులమడం దారుణమైన చర్యగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అభివర్ణించారు. లడ్డు వివాదానికి రాజకీయ రంగు పులిమి, ఇప్పుడు మత వివాదంగా మార్చాలని టిడిపి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే లౌకికవాదానికి పూర్తిగా స్వస్తి పలికినట్టు కనిపిస్తోందిన ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ లాంటి మతోన్మాద సంస్థలను మించి టిడిపి ప్రవర్తిస్తున్నదన్న భావన కలుగుతున్నదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణ చేశారు.
"నెయ్యి కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం మాట అటుంచి, అనవసర రాద్ధాంతాలతో పూటకో మాట మాట్లాడుతూ కూటమిలోని ప్రభుత్వ పెద్దలు బాధ్యతా రాహిత్యంగా తయారయ్యారు" అని అన్నారు.
"లడ్డూ సమస్య, ఈ వివాదానికి మొదటి కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబే అని ఆయన అన్నారు. లడ్డూలో జంతు కొవ్వు, రసాయనాలు కలిశాయని పదేపదే ఆరోపణలు చేసి నివేదిక రాకముందే భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడారని, నివేదిక వచ్చిన తర్వాత కూడా నివేదిక బయట పెట్టకుండా అవినీతిపరులను రక్షించే కార్యక్రమంగా వ్యవహరిస్తున్నారని శ్రీనివాసరావు అన్నారు.
కమిషన్ తో ప్రయోజనం ఏమిటి?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే సిట్ నివేదికను బయట పెట్టక ముందే మరొక కమిషన్ వేయటంలో ప్రయోజనం ఏమిటని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఏకసభ్య కమిషన్ లో సిట్టింగ్ జడ్జి ఉన్నారా? అంటే అదీ లేదని దీనివల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ వివాదాన్ని సాగదీస్తూ ప్రయోజనం పొందాలన్న కుట్ర బుద్ధి దాగి ఉందని, ప్రభుత్వంలో చిత్తశుద్ధి కొరవడిందని శ్రీనివాసరావు తీవ్రమైన ఆరోపణలు చేశారు.
వైసీపీకి, టిడిపికి అనిల్ కుమార్ సింఘాల్ లాంటి ఐఏఎస్ అధికారి ఎందుకు ఇష్టుడయ్యారని ప్రశ్నించారు. కేంద్ర బిజెపి పెద్దలను సంతృప్తి పరచడానికే రెండవ దఫా ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించారని లడ్డు కల్తీలో ఆయన బాధ్యుడని సిట్ నిర్ణయించిన తర్వాత చర్యలు తీసుకోకుండా బదిలీతో సరిపెట్టారని కేంద్ర ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరచడానికే ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించందని శ్రీనివాసరావు అన్నారు.
కల్యాణ్ ఈ ప్రకటనలు ఏమిటి?
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లడ్డు కల్తీ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కి సంబంధం లేదని ప్రకటన చేస్తున్నారని సీపీఎం నేత శ్రీనివాసరావు ఆరోపించారు. కల్తీ నెయ్యితో వైఎస్ జగన్ కు సంబంధం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతారని, పూటకో మాటగా అర్థం లేని వ్యవహారంగా కూటమి ప్రభుత్వ తీరు తయారైందని శ్రీనివాసరావు అన్నారు. ప్రజల్లో తీవ్రస్థాయిలో పెరుగుతున్న అసంతృప్తి బయటికి వెల్లడి కానివ్వకుండా ఉండటానికి లడ్డూ లాంటి వివాదాలను రోజూ చర్చనీయాంశం చేస్తూ ప్రజా ఉద్యమాలను, అసంతృప్తిని పక్కదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.
వారంతా హిందువులే కదా..
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని మత రాజకీయాలకు సాధనంగా వాడుకొని భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సమంజసం కాదని శ్రీనివాసరావు హితవు పలికారు.
"వాస్తవంగా లడ్డూ కల్తీకి పాల్పడిన బోలె బాబా హిందువే. సరఫరా చేసింది హిందువులే. కొన్నది హిందువులే. ఈ పాపాలలో భాగస్వాములుగా ఉన్న అధికారులు హిందువులే" అనే విషయాన్ని మరుగుపరిచి రాష్ట్రంలో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు" అని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి నుంచి లౌకిక పార్టీగా ఉన్న తెలుగుదేశం కూడా ఆ బాటలో ప్రయాణించడం ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. లేకుంటే రాష్ట్రంలో అనవసరమైన మత ఉద్రిక్తతలకు ఆస్కారం ఇచ్చినట్లే అని ఆయన హెచ్చరించారు.