
తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల గ్యాలరీల్లోని యాత్రికులకు అన్నప్రసాదాలు అందిస్తున్న శ్రీవారి సేవకులు
A record in Tirumala | ఒకే రోజు 9.42 లక్షల మందికి అన్నప్రసాదాల పంపిణీ
రథసప్తమిలో రికార్డు' స్థాయిలో సేవలంటున్న టీటీడీ అధికారులు
రథసప్తమి వేడుకలో ఈ ఏడాది తిరుమలలో అరుదైన రికార్డు నమోదైంది. 9.42 లక్షల మంది యాత్రికులకు ఒకే రోజు 14 రకాల అన్న ప్రసాదాలు వడ్డించినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 30 శాతం అధికమని కూడా అధికారులు చెప్పారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పెంచడం తోపాటు శుభ్రత పాటించడం, సిబ్బంది సంఖ్యను పెంచడం వల్ల శ్రీవారి దర్శనానికి యాత్రికుల సంఖ్య పెరిగింది.
"తిరుమలలో శాఖల మధ్య సమన్వయం, రద్దీ నిర్వహణ, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో సఫలీకృతం అయ్యాం" అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సంతృప్తి వ్యక్తం చేశారు.
తిరుమలలో రథసప్తమి నిర్వహించడం అంటే ఒక రోజు బ్రహ్మోత్సవాన్ని తలపిస్తుంది. శ్రీమలయప్పస్వామివారు ఏడు వాహనాలపై ఉదయం నుంచి రాత్రి వరకు విహరిస్తూ శ్రీవారి ఆలయ మాడవీధుల్లోని యాత్రికులకు దర్శనం ఇస్తారు. ఈ సమయంలో గ్యాలరీల నుంచి 3.45 లక్షల మంది యాత్రికులు వాహనసేవలు దర్శించుకున్నట్లు సింఘాల్ వెల్లడించారు.
తిరుమలలో రథసప్తమి వేడుకలు సఫలం కావడంపై టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, టీటీడీ సీవీఎస్ఓ కేవి. మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో కలిసి టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల అన్నమయ్య భవన్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.
తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలోని గ్యాలరీల్లో వాహన సేవల దర్శనానికి వచ్చిన యాత్రికులకు ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా 9.42 లక్షల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేసినట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. దీనికోసం మాడ వీధుల్లో మాత్రమే 220 మంది శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా సేవలు అందించారు.
"యాత్రికులకు రోజంతా సొజ్జ రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, సాంబార్ రైస్, టమోటా రైస్, పులిహోర, చక్కెర పొంగలి, వేడి బాదం పాలు, కాఫీ, పాలు, మజ్జిగ, సుండలు, బిస్కెట్లు భక్తులకు పంపిణీ చేశాం" అని సింఘాల్ చెప్పారు. 6.30 లక్షల మందికి పానీయాలు, 2.90 లక్షల మందికి పాలు, 2.15 లక్షల మందికి వాటర్ బాటిళ్లు పంపిణీ చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు.
శ్రీవారి ఆలయ మాడవీధుల్లో యాత్రికులకు అన్నదానం విభాగం పంపిణీ చేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు
బ్రహ్మోత్సవ తరహా సేవలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాలు, టీటీడీ బోర్డు సూచనలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసిన విషయాన్ని టీటీడీ ఈఓ అనిల కుమార్ సింఘాల్ మరోసారి గుర్తు చేశారు.
"బాధ్యతల వికేంద్రీకరణతో 25వ తేదీ రథ సప్తమి వేడుకలు కూడా టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకుల సమిష్టి కృషితో వైభవంగా నిర్వహించగలిగాం" అని ఈఓ సింఘాల్ స్పష్టం చేశారు.
"తిరుమలలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు వస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, యాత్రికుల నుంచి సేకరిస్తున్నా అభిప్రాయాలు కూడా వసతులు, అన్నప్రసాదాల నాణ్యత పెంపుదలకు మరింత ఉపయోగపడుతోంది" అని కూడా సింఘాల్ చెప్పారు.
అభిప్రాయ సేకరణలో వ్యతిరేకమే లేదు..
అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ
రథసప్తమి సందర్భంగా యాత్రికుల నుంచి వాట్సాప్, ఐవీఆర్ఎస్, శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయాలు సేకరించామని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి గుర్తు చేశారు. భక్తులు టీటీడీ కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన చెప్పారు.
"తిరుమల ఉత్తరమాడ వీధిలో ఒక భక్తుడు కూడా సదుపాయాలు బాగా లేవు" అని చెప్పకపోవడం టీటీడీ కృషికి నిదర్శనమని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు యాత్రికులు గ్యాలరీలకు సమీపంలో అదనపు మరుగు దొడ్లు, స్క్రీన్లు ఏర్పాటు చేయాలని చేసిన సూచనల అమలు చేస్తామన్నారు.
రథసప్తమి నాటి వేడుకలో ప్రత్యేక సేవలు..
తిరుమలలో ఏ ఉత్సవం నిర్వహించాలన్నా, టీటీడీ ముందస్తు కార్యాచరణతో యంత్రాంగాన్ని సంసిద్ధం చేస్తుంది. ఏ విభాగం తీసుకున్న బాధ్యతలను ఆ విభాగం సక్రమంగా నిర్వహించడానికి సెక్టోరల్ అధికారులను కూడా ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా ఏర్పాటు చేశారు. టీటీడీ, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, పోలీస్, వైద్య శాఖ, శ్రీవారి సేవకులు, వలంటీర్లు ఎవరి పరిధిలో వారు సేవలు అందించారు. మాడవీధుల్లో ఏర్పాటు చేసిన సీపీ కెమెరాలతో ఇవన్నీ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పర్యవేక్షించారు. దీంతో అత్యసవర సేవకులకు కూడా ఎలాంటి అవరోధం లేకుండా ఏర్పాట్లు చేశారు.
అందులో ప్రధానంగా..
1) మాడవీధుల్లో యాత్రికులకు అన్నప్రసాదాలు, పానీయాలు పంపిణీకి దాదాపు 220 మంది శ్రీవారి సేవకుల సేవలు పనిచేశారు.
2) అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా, పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని 1800 మంది పోలీసులు, 1414 మంది విజిలెన్స్ సిబ్బంది, 150 మంది ట్రాఫిక్ సిబ్బంది సేవలు అందించారు.
3) గతంలో ఎన్నడూలేని విధంగా 3.56 లక్షల గ్యాడ్జెట్స్, బ్యాగులు లగేజీ కేంద్రాల్లో డిపాజిట్ చేశారు. అవన్నీ ఏమాత్రం తప్పిపోకుండా లగేజీకేంద్రాల్లో సిబ్బంది తరలించడం, యాత్రికులకు సకాలంలో అందించడానికి నిరంతరాయంగా సేవలు అందించారు. ఈ సంఖ్యతో పోలిస్తే, గత ఏడాది కంటే 73 శాతం అధికం.
4) తిరుపతి నుంచి తిరుమలకు 1932 ట్రిప్పుల్లో 6,0425 మంది యాత్రికులు ప్రయాణించారు. తిరుమల నుంచి తిరుపతికి 1942 ట్రిప్పులతో 82,241 మంది ప్రయాణించడానికి ఏర్పాట్లు సఫలం అయ్యాయి.
5) రథసప్తమి సందర్భంగా శ్రీవారి వాహనసేవల ముందు 1000 కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
6) గ్యాలరీల్లో పారిశుద్ధ్యం మెరుగుదలకు 590 పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అందించారు.
వైద్య సేవలు
అత్యవసర వైద్య సహాయం అవసరమైన భక్తులకు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్సుల ద్వారా వైద్య సేవలు అందించారు.
రథ సప్తమి రోజున 23 వేల మంది యాత్రికులకు వైద్య సేవలు అందించారు. 94 మందిని అంబులెన్సుల ద్వారా తిరుపతిలోని ఆస్పత్రులకు తరలించారు.
Next Story

