
ghee | టీటీడీ లెక్కల మాస్టారితో ఆర్థికశాఖ చిక్కుల్లో పడిందా?
నెయ్యి కొనుగోలుపై ప్రభుత్వానికి ఆరు ప్రశ్నలు సంధించిన బీజేపీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కొనుగోలు చేసిన కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. టీటీడీ ఆర్థిక విభాగం కూడా ఈ ఉచ్చులో చిక్కుకునే పరిస్థితి అనివార్యమైంది. నిబంధనల సడలింపు తోపాటు చెల్లింపులు కీలకంగా మారాయి. ఇక్కడే అవినీతికి బీజం వేశారనేది ప్రధాన ఆరోపణ. టీటీడీ ఆర్థిక, గణాంక శాఖ అధికారిపై సీబీఐ క్రమశిక్షణా చర్యలకు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కల్తీ నెయ్యిపై సమగ్ర విచారణ
కమిషన్ ఏర్పాటుకు సీఎం నారా చంద్రబాబు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వైసీపీ, టీడీపీ మధ్య మళ్లీ ఆరోపణల పర్వానికి తెరతీసింది. ఈ విషయం పక్కన ఉంచితే..
టీటీడీకి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయాలంటే ఆర్థిక విభాగం నుంచి నిధులు విడుదల చేయాలి. దీనికి అధిపతిగా ఉన్న టీటీడీ ఎఫ్ ఏ అండ్ సీఓ ( TTD Financial Advisor and Chief Accounts Officer )గా ఓ. బాలాజీపై వివాదం ముసురుకుంటోంది.
"టీటీడీలో ఈ లెక్కల మాస్టర్ లెక్క తేల్చండి" అని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆరు అంశాలను పరిగణలోకి తీసుకుని, విచారణ చేయించాలని కూడా నవీన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కోరారు.
నాణ్యత ఎందుకు తగ్గింది?
టీటీడీకి అవసరమైన వస్తువుల కొనుగోలులో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తారు. మాతృశ్రీ తరిగొండ వెంబమాంబ నిత్యాన్నదాన సత్రంలో వినియోగించే ఉప్పు, పప్పు నుంచి బియ్యం కొనుగోలు వరకు ఈ టెండర్లతో కొనుగోలు చేసే వారు. సరుకుల్లో నాణ్యత లోపిస్తే తిరుస్కరించడానికి ఏమాత్రం వెనుకాడరు.
"టీటీడీలో 2013 నుంచి 2022 వరకు ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లతో ల్యాబ్ పనిచేయించారు. దీనివల్లే ముడి సరుకుల నాణ్యతలో అవినీతి జరిగింది. దానిపై దృష్టి సారించాలి" అని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
తిరుమల ల్యాబ్ లో 2012 నుంచి 2025 వరకు సుమారు 13 సంవత్సరాలు సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయలేదు. శానిటరీ ఇన్స్పెక్టర్లే ముడి సరుకుల నాణ్యతను పరిశీలించడం, అప్రూవల్ చేయడం వల్లే అవినీతికి రాచమార్గంగా మారింది" అని కూడా నవీన్ ఆరోపించారు.
నిబంధనలు సడలింపు
టీటీడీలో ప్రధానంగా లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యి కొనుగోలులో నిబంధనలు సడలించారనేది ప్రధాన అంశంగా మారింది.
1.టీటీడీకి నెయ్యి సరఫరా చేసే పాలకర్మాగారం రోజుకు నాలుగు లక్షల లీటర్ల పాల సేకరణ చేయాలి: ఈ నిబంధన మార్చారు.
2. డెయిరీ నిర్వహణలో మూడేళ్ల అనుభవం ఉండాలి: దీనిని సడలించారు.
3. ఏటా టర్నోవర్ 250 కోట్ల రూపాయలు ఉండాలి అనేది నిబంధన.
దీనిని కూడా సడలించి 150 కోట్లకు తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వ కాలంలో నిర్ణయం తీసుకున్నారు. అనే వ్యవహారం తెరపైకి వచ్చింది.
"కమీషన్ల కోసం అర్హత లేని డెయిరీలకు గేట్లు ఎత్తారు. వారిని వదిలే ప్రసక్తి లేదు" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్పష్టం చేశారు. కల్తీతో పాటు, హవాలా ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారిన విషయాన్ని కూడా ఆయన ఇటీవల మీడియా సమావేశంలో ఆరోపించారు. కల్తీ నెయ్యిలో ఎలాంటి క్లీన్ చిట్ వైసీపీకి దక్కలేదని కూడా నాయుడు స్ఫస్టం చేసిన విషయం తెలిసిందే.
బీజేపీ నేత ఏమన్నారంటే..
కల్తీ నెయ్యి కొనుగోలుకు సంబంధించి దర్యాప్తు చేసిన సీబీఐ సారధ్యంలోని సిట్ దర్యాప్తు బృందం కూడా
టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఓ బాలాజీపై క్రమశిక్షణా చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో బీజేపీ ఆయన వ్యవహార సరళిపై గురి పెట్టింది.
"నెయ్యి కొనుగోలుకు టిటిడి టెండర్ల నిబంధనలను సడలించింది వాస్తవమా కాదా? కోట్లాది రూపాయల సప్లై కాంట్రాక్టును ఎవరికి కట్టబెట్టారు? సడలించమని అధికారులపై ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు?" ఈ కోణంలో విచారణ చేయాలని బీజేపీ నేత నవీన్ డిమాండ్ చేశారు.
టీటీడీ ఖర్చు చేస్తున్న ప్రతి పైసాకు జవాబుదారీతనంగా ఉండాల్సిన టీటీడీ లెక్కల అధికారి ఓ. బాలాజీ పాలకులు, ఉన్నతాధికారులకు జీ హుజూర్ అని చెప్పడం వల్లే ఈ పరిస్థితికి కారణమని ఆయన ఆరోపించారు.
బీజేపీ నేత ఆరు ప్రశ్నలు
టీటీడీ ఎఫ్ ఏ అండ్ సీఓ బాలాజీ పై చర్యలు తీసుకునే ముందు, లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఆయన ఆరు ప్రశ్నలు తెరమీదకు తెచ్చారు.
1. టీటీడీ (FA & CAO) కార్యాలయంలో గత పదేళ్లలో ముడి సరుకుల కొనుగోళ్లకు )ఎన్ని వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు?
2)ఏ ఏ అధికారి సంతకాలతో అనుమతించారు?
3)ఏ కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించారు?
4)క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ టెస్టింగ్ సర్టిఫికెట్ పరిశీలించి బిల్లులు పాస్ చేశారా?
5) శ్రీవారి సొమ్ము ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎందుకు ఖర్చు పెట్టారు?
6) లెక్కల మాస్టర్ బాలాజీ అనుమతితో విడుదల చేసిన ప్రతి పైసాకు ఆడిట్ జరిగిందా?
ఈ విషయాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని నవీన్ కోరారు. దీనివల్ల నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు.
ఆయన ఇంకొన్ని అంశాలు కూడా తెరపైకి తెచ్చారు..
"తిరుమల కొండపై ఉన్న ల్యాబ్ లో ఇప్పటికీ శ్రీలక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్ సిబ్బందితోనే ముడి సరుకుల నాణ్యత పరిశీలిస్తున్నారు. రిటైర్ అధికారిని గతంలో ఇప్పుడు నియమించుకున్నారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టండి.
తిరుమల ల్యాబ్ లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులు రెగ్యులర్ చేస్తేనే బాధ్యతగా పనిచేస్తార. లేకుంటే, నాణ్యతకు మంగళం పాడుతారు" అని అభిప్రాయపడ్డారు.
Next Story

