తిరుమలకు వరుస కట్టిన  ప్రత్యేక ఉత్సవాల నేపథ్యం ఏమిటంటే..
x

తిరుమలకు వరుస కట్టిన ప్రత్యేక ఉత్సవాల నేపథ్యం ఏమిటంటే..

మార్చి 3న శ్రీవారి ఆలయం 10.30 గంటలు మూత.


ఫిబ్రవరి 26 నుంచి వార్షిక తెప్పోత్సవాలు

మార్చి 3న చంద్రగ్రహణం

అదేరోజు కుమారధార తీర్థ ముక్కోటి

ఐదు రోజలు ఆర్జిత సేవలు రద్దు

తిరుమలకు ప్రత్యేక ఉత్సవాలన్నీ ఒకే రోజు వరుసగా వచ్చాయి. మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం కారణంగా ఆలయం 10.30 గంటల పాటు మూసివేస్తారు. దీంతో శ్రీవారికి సుదీర్ఘ విరామం లభించబోతోంది. అదే రోజు శేషాచలం అడవుల్లోని కుమారధార తీర్థ ముక్కోటి కూడా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ముందే ఫిబ్రవరి 26వ తేదీ ప్రారంభమయ్యే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి రెండో తేదీ ముగుస్తాయి.

తిరుమలలో వార్షిక ఉత్సవాలతో సహా ఆరు రోజులపాటు విశేష ఉత్సవాలు కలిసి రావడం అరుదని టీటీడీ అధికారులు పరిగణిస్తున్నారు. ఫిబ్రవరి 26 వ తేదీ నుంచి మార్చి రెండో తేదీ వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల నిర్వహణకు సన్నద్ధం కావాలని టీటీడీ అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి అధికారులు సిబ్బందికి సూచించారు.

తిరుమల పద్మావతి అతిథి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో అధికారులతో టీటీడీ అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి సమీక్షించారు.
"తెప్పోత్సవాల నేపథ్యంలో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి ఐదో తేదీ వరకు పుష్కరిణిలోకి యాత్రికులను స్నానానికి అనుమతించరు" అని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయండని ఆయన ఆదేశించారు.

26 నుంచి తెప్పోత్సవాలు


తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహిస్తునే ఉంటారు. అందులో పుష్కరిణిలో శ్రీవారి తెప్పోత్సవానికి కూడా ప్రత్యేకత ఉంది. అత్యంత లోతైన నీటిపై ఉభయ దేవేరులతో శ్రీవారు తెప్పలపై ఊరేగే సమయంలో అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేని విధంగా, యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడానికి టీటీడీ అధికారులు సమాయత్తం అవుతున్నారు.

తిరుమల వరాహస్వామిక్షేత్రం. శ్రీవారిని దర్శనానికి ముందు ఇక్కడి పురిణిలో పణ్యస్నానాలు చేయడానికి యాత్రికులు ఆసక్తి చూపిస్తారు.
తిరుమలలో 23వ తేదీ తెప్పల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ట్రైల్ రన్.
పుష్కరిణీలో పుష్కలంగా నీరు నిలువ ఉంచే విధంగా చర్యలు.
పుష్కరిణి, తెప్పలకు ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణ.
వరాహస్వామి ఆలయం, నాలుగు మాడవీధుల్లో పందిళ్ల ఏర్పాటు
యాత్రికులకు సూచనలు చేయడానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు.
ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి ఐదో తేదీ వరకు పుష్కరిణిలో స్నానానికి యాత్రికులను అనుమతించరు.
పుష్కరిణి వద్ద ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో అవసరమైన సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు.
పుష్కరిణీ వద్ద అందుబాటులో గజ ఈతగాళ్లు.
తెప్పోత్సవాలు ప్రాశస్త్యం భక్తులకు తెలిసేలా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఏర్పాట్లు.

సేవలు రద్దు..

తిరుమలలో తెప్పోత్సవాల నేపథ్యంలో ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి ఒకటి, రెండో తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేశారు.

10.30 గంటలు శ్రీవారి ఆలయం మూత..

చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం 10.30 గంటల పాటు మార్చి మూడో తేదీ మూత వేయనున్నారు. దీంతో శ్రీవారి దర్శనంతో పాటు ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు.
మూడో తేదీ మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు ఉంటుంది. గ్రహణానికి ఐదు గంటల ముందే ఆలయం ప్రధాన ద్వారం మూసి వేయడం తిరుమలలో ఆచారం.
తిరుమలలో యాత్రికులకు ఇబ్బంది లేకుండా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రాంభగీచా, సీఆర్వో కార్యాలయం వద్ద దాదాపు 40 వేల పులిహోర ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
"యాత్రికులకు అన్నప్రసాదాల పంపిణీకి ఏర్పాటు చేస్తాం" అని టీటీడీ ఈఓ సిహెచ్. వెంకయ్య చౌదరి చెప్పారు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశామని తెలిపారు.

సేవలు రద్దు ...

చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో ఆర్జిత సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చెప్పారు. మార్చి మూడో తేదీ (మంగళవారం) అష్టదళ పాదపద్మారాధన సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలు కూడా రద్దు చేశామన్నారు.

త్రీన కుమారధార తీర్థ ముక్కోటి


తిరుమల శేషాచలం అడవుల్లోని తీర్థాల్లో కుమారధార తీర్థ ముక్కోటి కూడా ఒకటి. మార్చి మూడో తేదీ ఈ ఉత్సవం నిర్వహణకు కూడా టీటీడీ యంత్రాంగం ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది.
కుమారధార తీర్థ ముక్కోటి మాఘ మాసంలో పౌర్ణమిరోజు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవానికి వచ్చే యాత్రికులు ప్రకృతి ఒడిలో కొండల పైనుంచి జాలువారే జలపాతం. సెలయేటిలో స్నానాలు ఆచరించడానికి యాత్రికులు ఆసక్తి చూపిస్తారు.

"మార్చి మూడో తేదీ ఉదయం ఐదు నుంచి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తాం" అని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం తొమ్మది గంటల తరువాత యాత్రికలకు అన్నప్రసాదాల పంపిణీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
Read More
Next Story