రెండు నెలల్లో తెలంగాణ ఇంటి పార్టీ ఏర్పాటు
x
కల్వకుంట్ల కవిత (File)

రెండు నెలల్లో తెలంగాణ ఇంటి పార్టీ ఏర్పాటు

శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత


తెలంగాణ ప్రజల పక్షాన పనిచేసే రీతిలో రెండు నెలల్లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నాలుగేళ్ల మనో వేదన తీరిందని చెప్పిన కవిత, "తెలంగాణ ఇంటి పార్టీ" ఏర్పాటు చేయనున్నట్లు కవిత వెల్లడించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో న్యాయస్థానం క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్రీవారి దర్శనానికి వచ్చినట్లు చెప్పారు. గురువారం సాయంత్రం ఆమె తన భర్త అనిల్ తో కలిసి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. వేకువజామున భర్త అనిల్ తో కలిసి శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న తరువాత కల్వకుంట్ల కవిత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

"నేను నాలుగు సంవత్సరాలుగా పడుతున్న మనో వేదన స్వామి వారి దయతో తీరిపోయింది" అని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. నా ఇమేజీని దెబ్బతీయడానికి కుట్ర చేశారని, దీనికి దేశ ప్రజలే సాక్ష్యమని కల్వకుంట్ల కవిత ఆవేదన చెందారు. రాజకీయ కుట్ర న్యాయస్థానం ముందు నీరుగారిందని, దానికి తిరుమల బాలాజీ ఆశీస్సులు మెండుగా ఉండడమే అన్నారు.
"ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పేరు నమోదు చేసినప్పటి నుంచి సత్యం, న్యాయం , ధర్మం మా వైపు ఉందని నేను చెప్తూ వచ్చాను. స్వామి వారి దయతో కంప్లీట్ గా క్లీన్ చిట్ వచ్చింది.. అందుకే కాలినడకన వచ్చి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నాను" కవిత చెప్పారు.

తెలంగాణ ఇంటి పార్టీ..

తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ ఇంటి పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కుటుంబం కోసం కాకుండా ప్రజల కోసమే పనిచేసే పార్టీ అవసరం ఉందని, ఆ దిశగా పనిచేసే పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు కవిత చెప్పారు.
"తెలంగాణ ఇంటి పార్టీగా ఉండాలనే లక్ష్యాలతో ఏర్పాటు చేసే రాజకీయ పార్టీకి శ్రీవారి దయ, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా" అని కవిత ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పని చేయడానికి రానున్న రోజుల్లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాం.. ఆ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు, దయ ఉండాలని కోరుకున్నాను.
తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని, బాగుండాలని కోరుకున్న.. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలు, ప్రజలు బాగుండాలని స్వామి వారిని కోరుకున్నాను అని వ్యాఖ్యానించారు.


Read More
Next Story