
'తిరుపతి'లో విద్యుత్ బిల్లుకు 'స్టార్ట్ షాక్'
రెండు రకాల డిస్కనెక్షన్ చార్జీల వెనుక కథ ఇదీ..
విద్యుత్ వినియోగదారులను స్మార్ట్ గా అదనపు చార్జీలతో బాదుడు ప్రారంభమైంది. సకాలంలో బిల్లు చెల్లించని వారి నుంచి రెండు రకాల ఫైన్ పడుతోంది. స్మార్ట్ సిటీలో కేబుల్ ఉన్న ప్రాంతాల్లో ఒకరకం, విద్యుత్ స్తంభాల నుంచి కనెక్షన్ ఉంటే మరో రకం అపరాధ రుసుం విధిస్తున్నారు.
విద్యుత్ బిల్లు జారీ అయిన గడువుకు ఒక రోజు దాటితే సర్చార్జి ( Surcharge )పేరుతో మరో 25 రూపాయలు అదనంగా భారం. డిస్కనెక్షన్ చార్జి రూ. 100, ఇంకొన్ని ప్రదేశాల్లో 300 వసూలు చేస్తున్నారు. ఇలా ఎందుకు అంటే మాకు వచ్చేది వంద రూపాయలే. 200 స్మార్ట్ సిటీ కార్పొరేషన్ వెళుతుంది. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు.
"విద్యుత్ బిల్లు జారీ అయిన 15 రోజుల్లోపు చెల్లిస్తే ఇలాంటి అపరాధ రుసుం, సర్ చార్జీ ఉండదు" అని ఏపీ ఎస్పీడీసీఎల్ తిరుపతి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సి. గంగాధరరెడ్డి వివరించారు.
తిరుపతిలో విద్యుత్ వ్యవస్థ
తిరుపతి నగరంలో విద్యుత్ కనెక్షన్ల వివరాలు పరిశీలిద్దాం. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ డివిజన్ లో నివాసాలకు 2,85,369 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 11, 75 కిలోవాట్లు వినియోగించే పరిశ్రమల సర్వీసులు 43,071 ఉన్నాయి. హెటెన్షన్ (హెచ్. టీ) కింద 862 కనెక్షన్లు ఉన్నాయి. ఈ సర్వీసుల్లో సకాలంలో బిల్లలు చెల్లించని వినియోగదారులు ప్రతి నెలా వేల సంఖ్యలోనే ఉంటుంది. నగరంలో నెలకు సరాసరిన 500 నుంచి 600 డిసీ కనెక్షన్ల కింద చేరతాయని అధికారుల ద్వారా తెలిసిన సమాచారం.
ట్రౌ డౌన్ చేసినా..
2024 25 సంవత్సరానికి ముందు యూనిట్ కు 40 పైసలు చొప్పున 2700 కోట్లు వైసీపీ ప్రభుత్వంలో ట్రూ అప్ చార్జీల పేరిట వసూలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ట్రూ డౌన్ చేసి 927 కోట్ల రూపాయలను 2025 నవంబర్ నుంచి ప్రతినెల జారీ చేస్తున్న బిల్లులో ప్రభుత్వం మైనస్ చేస్తుంది. నిజానికి ఇది పేద వర్గాలే కాకుండా, అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న వారికి ఉపశమనం కలిగించింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ట్రూ అప్ చార్జీలను టిడిపి కూటమి ప్రభుత్వం డౌన్ చేసింది. 26 ఏళ్లతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా గతంలో 17వేల కోట్ల రూపాయలు అదనపు భారం మోపారనీ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి ఆరోపించారు. 9సార్లు చార్జీలు పెంచి 32 వేల కోట్ల రూపాయలు కూడా భారం మోపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు ఏపీ ఈ ఆర్ సి కి సమర్పించిన నివేదికలో 15,654 కోట్ల రూపాయల తగ్గుదల చూపించాయి. ఈ లోటు 2026 27 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భర్తీ చేయడానికి కమర్షియల్, పరిశ్రమల విద్యుత్ కనెక్షన్లపై భారం మోపడానికి ఏపీ ఈఆర్సి సిద్ధమైంది. ఈ విషయాన్ని కాసేపు పక్కన ఉంచుదాం.
అపరాధ భారం..
విద్యుత్ వినియోగదారుడు సకాలంలో బిల్లు చెల్లించకుంటే బాదుడు తప్పనిసరి అవుతుంది. ఇందులో కూడా లేట్ ఫీజు కింద రెండు రకాల పద్ధతుల్లో నగదు వసూలు చేస్తున్నారు. కరెంట్ బిల్లు జారీ అయిన తర్వాత డిస్కనెక్షన్ డేట్ కు ముందే బిల్లు చెల్లిస్తే సరి. లేదంటే ఆలస్యమైంది అనే పేరుతో 100, 300 ఫైన్ పడుతుంది. సర్చార్జి కూడా తప్పదు. అదేమిటి ఒకసారి పరిశీలిద్దాం..
పేరు విద్యుత్ సంస్థకు
స్మార్ట్ సిటీ గా ఎంపిక చేసిన పట్టణాల్లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. తిట్లు విద్యుత్ సంస్థలకు, ఆదాయం తిరుపతి నగరపాల సంస్థకు దక్కుతోంది.
ఉదాహరణకు: వినియోగదారుడికి విద్యుత్ బిల్లు 2026 ఫిబ్రవరి 6వ తేదీ జారీ అయిందని అనుకుందాం. ఈ బిల్లు 15 రోజుల్లోపు చెల్లిస్తే బిల్లులో వచ్చిన మొత్తం మాత్రమే చెల్లించడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే..
సబ్ చార్జీ బాదుడు..
బిల్లు అందుకున్న తర్వాత 15 రోజులకు ఒకరోజు దాటినా సరే 25 రూపాయలు సర్చార్జీ (surcharge) పేరిట అదనంగా చెల్లించక తప్పదు. దేశంలో సర్చార్జి అనేది ఒకేసారి విధించిన విషయాన్ని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి గుర్తు చేశారు.
"గల్ఫ్ యుద్ధం సమయంలో (కువైట్ పై ఇరాక్ దాడి చేయడం) ముడి చమురు దిగుమతి చేసుకోవడంలో ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో మాత్రమే సార్ విధించారు" అని కందారపు మురళి చెప్పారు. విద్యుత్ బిల్లు జారీ అయిన తర్వాత 15 రోజులు దాటితే సర్చార్జి విధించడం ఏమిటి? అని ఆయన అని ఆయన ప్రశ్నించారు.
రెండు రకాల జరిమానా..
విద్యుత్ బిల్లులు గడువు లోపల చెల్లించకుండా ఏమారితే మాత్రం అపరాధ రుసుం భారం తప్పదు. ఇది కూడా రెండు రకాల కేటగిరీలతో డిస్కనెక్షన్ చార్జ్ (ఆలస్యంగా చెల్లించిన వారికి) వసూలు చేస్తున్నారు. విద్యుత్ బిల్లు జారీ చేసిన నెల రోజులు లోపు చార్జీలు చెల్లించాలి. ఉదాహరణకు 2026 జనవరి 6వ తేదీ బిల్లు ఇచ్చారనుకోండి. ఫిబ్రవరి ఆరో తేదీ లోపల బిల్లు చెల్లించాలి.
స్తంభాల నుంచి కనెక్షన్: ఈ పద్ధతి అనుసరిస్తే 25 రూపాయలు సర్చార్జి భారం పడుతుంది. బిల్లు చెల్లించడంలో గడువుకు ఒక రోజు దాటినా ఆలస్యం వల్ల జరిమానా నివాసాలైతే 100 రూపాయలు చెల్లించాలి. దీనిని డిస్కనెక్షన్ చార్జిగా పరిగణిస్తారు.
భూగర్భ కేబుల్: నిర్ణీత నెల గడుపుకు ఒకరోజు దాటినా సరే 300 రూపాయలు కొన్ని చోట్ల వసూలు చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ కేబుల్ ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా చార్జీ ఉంటుంది. దీనికి అదనంగా మరో 25 రూపాయలు సర్చార్జి కూడా చెల్లించక తప్పదు.
"తిరుపతి డివిజన్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 300 రూపాయల జరిమానా పద్ధతి ఉంటుంది" అని ఏపీఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి గంగాధర్ రెడ్డి ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. ఈ పరిస్థితి తిరుపతి నగరంలో అన్ని ప్రాంతాల్లో లేదని ఆయన చెప్పారు.
"ఆ 300 రూపాయల్లో రూ. వంద డిస్కనెక్షన్ చార్జీ విద్యుత్ సంస్థకు అందుతుంది. మిగతా 200 రూపాయలు తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ కు జమ అవుతుంది" అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగాధర్ రెడ్డి చెప్పిన మాట.
తిరుపతి నగర పాలక సంస్థ (Tirupati municipal corporation) నగరంలో అనేక ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి సహకారం అందించింది. నగరంలో అనేక చోట్ల విద్యుత్ కంటైనర్ లాంటి బాక్సులు ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించింది. మిగతా ప్రదేశాల మాదిరిగానే ఈ ప్రాంతాల్లో కూడా పారిశుద్ధ్యం పనులు చేయడంలో శ్రద్ధ తీసుకుంటారు.
"అందువల్లే వినియోగదారులు అపరాధ రుసుముగా చెల్లించే 300 రూపాయల్లో 200 స్మార్ట్ సిటీ కార్పొరేషన్కు వెళుతుంది" అని ఈ ఈ చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. బిల్లు అందిన 15 రోజుల లోపు చెల్లిస్తే ఎలాంటి అపరాధ రుసుం, సర్చార్జి వినియోగదారులపై భారం పడదు అని ఆయన స్పష్టం చేశారు.
Next Story

