
తిరుమల బాలాజీనగర్ లో స్థానికుల నివాసాలు తనిఖీ చేస్తున్న టీటీడీ అధికారులు
తిరుమలలో తనిఖీలతో కలవరం..
టీటీడీ విజిలెన్స్, పోలీసులు గుర్తించిన ఆ 11 మంది అనుమానితులెవరు?
తిరుమల క్షేత్రం యాత్రికులతో రద్దీగా ఉంది. ఎవరి పనుల్లో వారు ఉన్నారు. స్థానికులు నివసించే బాలాజీనగర్ లో సోమవారం ఉదయం యూనిఫాం ధరించిన 90 మంది టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది సోమవారం తనిఖీలు చేశారు. ఒక్క ఇల్లు వదలకుండా గాలించారు. అనుమానాస్పదంగా ఉన్నారంటూ 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు పత్రాలు లేని 16 వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారణ చేస్తున్నారని సమాచారం.
"తిరుమలలో అసాంఘిక శక్తులను కట్టడి చేయాలనే ప్రధాన లక్ష్యం. యాత్రికుల భద్రత కోసం నాకాబందీ నిర్వహించాం" అని తిరుమల టూ టౌన్ సీఐ శ్రీరాముడు చెప్పారు.
తిరుమలలో స్థానికులు..
తిరుమలకు రోజుకు కనీసంగా లక్ష మందికి పైగానే యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు. వారికి తోడు తిరుమలలోని దుకాణాలు, హోటళ్లలో పనిచేయడానికి, కాంట్రాక్టు సిబ్బంది రోజూ 20 వేల మందికి పైగానే తిరుపతి నుంచి వెళుతుంటారు. వారితో పాటు తిరుమల బాలాజీనగర్, ఆర్బీసీ సెంటర్ ప్రాంతాల్లో దాదాపు 1,100 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారి నిర్మించుకున్న ఇళ్లను కూడా కొందరు అద్దె ఇచ్చినట్లు టీటీడీ వర్గాల సమాచారం. ఆ ఇళ్లలో తిరుపతి లేదా చిత్తూరు జిల్లా ప్రాంతేతరులు కూడా నివసిస్తున్నారనేది టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ తోపాటు పోలీసులు సందేహిస్తున్నారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తుల వల్ల తిరుమలలో ఎలాంటి భద్రతా సమస్యలు ఎదురుకాకూడదని టీటీడీ విజిలెన్స్ వింగ్, పోలీసులు, అటవీశాఖ యంత్రాంగం తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తోంది.
కలవరం రేపిన తనిఖీలు..
టీటీడీ విజిలెన్స్ విభాగం ( TTD Vigilance and Security Wing), తిరుమల డీఎస్పీ సారధ్యంలో పోలీసులు, ఏపీ ఫారెస్ట్, టీటీడీ ఫారెస్ట్, ఫైర్, టీటీడీ రెవెన్యూ, BD టీమ్స్ (Bomb Disposal Squad BD Team ), ఎక్సైజ్, ఆరోగ్యశాఖల సిబ్బంది సుమారు 90 మంది ఒకేసారి రంగంలోకి దిగారు. ఆరు బృందాలుగా ఏర్పడిన ఆ శాఖల సిబ్బంది ఐదారు వరుసలుగా ఉన్న కాలనీల్లో ఆరు ప్రత్యేక బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. స్థానికులకు ఇది మామూలే. అన్ని విభాగాల సిబ్బంది ఒకేసారి రావడం చూస్తున్న సమీప ప్రాంతాల్లోని యాత్రికులు ఏమి జరుగుతోందని ఆసక్తిగా గమనిచారు.
తనిఖీలతో ఏమి చేశారు..?
తిరుమలలో స్థానికులు నివసించే బాలాజీనగర్ లో ఇళ్లలో అనమతి తీసుకున్న వారే ఉంటున్నారా? ఆ ఇళ్లలో కొత్త వ్యక్తులు ఉంటున్నారా అనే విషయాలు ప్రధానంగా పరిశీలించారు. ఆరు బృందాల్లోని సిబ్బంది ఆ శాఖలకు సంబంధించి అంశాలను ఎవరి పరిధిలో వారు తనిఖీ చేశారు.
"820 ఇళ్లను తనిఖీ చేస్తే, సరైన గుర్తింపుకార్డులు లేని 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం. గుర్తింపు పత్రాలు లేని 11 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం" అని డీఎస్పీ చెప్పారు. స్థానికులతో సమావేశమైన అధికారులు ఇళ్లను గుర్తు తెలియని వ్యక్తులకుఅద్దెకు ఇవ్వవద్దని సూచించారు. సరైన గుర్తింపు లేకుండా ఎవరినీ పనులకు తీసుకోవద్దని కూడా ప్రత్యేకంగా గుర్తు చేశారు. తిరుమల పవిత్రత, భద్రతకు భంగం కలిగిస్తే, ఏమాత్రం ఉపేక్షించమని హెచ్చరించారు.
Next Story

