శ్రీశైల మల్లన్న.. ఈ ఘోరం ఏంది స్వామి..!
x

శ్రీశైల మల్లన్న.. ఈ ఘోరం ఏంది స్వామి..!

శివ భక్తులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడి నలుగురు మరణించారు. కొందరు గాయపడ్డారు.


శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లన్నను దర్శించుకున్న శివ భక్తులు ఆనందంగా ఊరికి తిరిగి బయలుదేరారు. ఆత్మకూరు వద్ద శుక్రవారం రాత్రిబొలెరో వాహనం బోల్తా పడిన దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు తాండా వద్ద బొలేరో ప్రయాణిస్తుండగా, బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.


కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 25 మంది భక్తులు బొలెరో వాహనంలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లారు. స్వామి దర్శనం అనంతరం శుక్రవారం సాయంత్రం సొంత ఊరికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆత్మకూరు సమీపానికి రాగానే అదుపుతప్పిన బొలెరో రోడ్డు పక్కన లోయలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది.

మృతుల వివరాలు
ఆదోని పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న కొంతమంది శివ భక్తులు శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. ఈ ప్రమాదంలో చంద్రమ్మ ( 31), గిడ్డయ్య ( 42) శశికళ ( 40), లక్ష్మి ( 28 ) గా గుర్తించారు. వారందరిదీ ఆదోని టౌన్ ఇందిరానగర్ కు చెందినవారుగా గుర్తించారు. ఆత్మకూరు పోలీసులు ఈ దుర్ఘటనపై విచారణ జరుపుతున్నారు. శివ భక్తులు ప్రమాదానికి గురయ్యారని విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన బాధితులను వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు బాధితులు ఆదోని పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉండే నివాసితులుగా ఆ ప్రాంత మీడియా ప్రతినిధి ఒకరు చెప్పారు.
Read More
Next Story