రాష్ట్రంలో జిల్లాల విభజన తరువాత రాయలసీమలోని అన్ని జిల్లాల్లో రెండు కేంద్రాలలో గణతంత్రవేడుకలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో మాత్రం నాలుగు కేంద్రాల్లో వేడుకలు నిర్వహించిన అరుదైన రికార్డు నమోదైంది. అందులో తిరుపతిలో రెండు చోట్ల సోమవారం వేడుకలు నిర్వహించడం ప్రత్యేకంగా కనిపించింది. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తరువాత జణగణమణ జాతీయ గీతం రూపుదిద్దుకున్న మదనపల్లె అన్నమయ్య జిల్లా కేంద్రంలో మొదటిసారి ఉత్సవాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా కేంద్రం చిత్తూరులో కూడా సంబరాలు నిర్వహించారు.
తిరుపతికి ఆధ్యాత్మికంగానే కాకుండా జాతీయ పర్వదినాలు నిర్వహించడంలో కూడా ప్రత్యేకత ఉంది. జిల్లా కేంద్రాల్లో ఒక చోట మాత్రమే గణతంత్ర దినోత్సవ వేడుక నిర్వహిస్తే, తిరుపతిలో మాత్రం రెండు చోట్ల నిర్వహించడ ఆనవాయితీగా మారింది. ఈ వేడుకల్లో పోలీస్ జాగిలాలు, అగ్నిమాపక శాఖ, వ్యవసాయ ప్రదర్శనలు ప్రత్యేకంగా కనిపించాయి. మూడు రంగుల నీటితో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది.
తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాలను ముత్యాలరెడ్డిపల్లె (ఎంఆర్.పల్లె) సమీపంలోని పోలీస్ పరేడ్ సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వెంకటేశ్వర్ జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో కలిసి పోలీసు సాయుధ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సుక్షిత పోలీస్ జాగిలం కలెక్టర్, ఎస్పీకి గౌరవ వందనం సమర్పించింది. ముకుళిత హస్తాలతో కలెక్టర్ వెంకటేశ్వర్ పోలీస్ డాగ్ నుంచి వందనం స్వీకరించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సెల్యూట్ కొట్టారు.
పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ జాగిలాల విన్యాసాలు విద్యార్థులను అలరించాయి. బాంబులను గుర్తించడం,
దాడులకు పాల్పడిన ముష్కరులపై ఆట కట్టించడం వంటి విన్యాసాలతో అద్భుత ప్రముఖ ప్రతిభ కనబరిచాయి.
టిటిడి పరిపాలనా భవనంలో..
తిరుపతి జిల్లాలో మొదటి వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనాభరణం ఆభరణంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు చిత్తూరు ఆ తర్వాత తిరుపతి టీటీడీ ఎడి బిల్డింగ్ వద్ద ఉత్సవాలు నిర్వహించడం జరిగేది.
జిల్లాల విభజన తర్వాత తిరుపతి కూడా కేంద్రంగా మారింది. దీంతో పోలీస్ పరేడ్ మైదానం తో పాటు టీటీడీ అధికారులు కూడా ఏడీ బిల్డింగ్ వెనుక వైపు ఉన్న మైదానంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించాయి.
టీటీడీలోని సాయుధ దళాలు ఎస్పీఎఫ్, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లోని ఏపీఎస్పీ, ఆర్ముడ్ రిజర్వు, ఏఆర్, సివిల్ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. టీటీడీ సీవిఎస్ఓ కె.వి మురళీకృష్ణ తో పాటు మిగతా అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతీయ జెండా ఆవిహిష్కరణ
గణతంత్ర దినోత్సవం లో జాతీయ పతాకం ఆవిష్కరణ తర్వాత ప్రదర్శించిన విన్యాసాలు సందర్శకులను కనువిందు చేశాయి. టీటీడీ విజిలెన్స్ విభాగంలో ఉన్న డాగ్ స్క్వాడ్ ఓ ఫ్లవర్ బొకే తీసుకునివెళ్లి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు వేదిక వద్ద అందించడం ద్వారా సెల్యూట్ చేసింది. ఆ జెండాను అందుకున్న ఈఓ కూడా విజిలెన్స్ విభాగం జాగిలానికి వందనం సమర్పించారు.
టీటీడీ ఏడీ బిల్డింగ్ ఆవరణలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కూడా డాగ్ స్క్వాడ్ ప్రదర్శించిన విన్యాసాలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. భూమిలో పాతిన పేలుడు పదార్థాలను గుర్తించడం, డాగ్ స్క్వాడ్ హ్యాండ్లర్స్ వాటిని నిర్వీర్యం చేయడం, అగ్నికిలాల నుంచి జంపింగ్ చేయడం వంటి విన్యాసాలతో సుక్షిత పోలీసు జాగిలాలు అద్భుత ప్రదర్శన చూపించాయి.
మదనపల్లెలో అధికారిక గీతమై..
చిత్తూరు జిల్లాలో మదనపల్లె ఆసియాలోనే పెద్ద రెవెన్యూ డివిజన్. రాష్ర్టంలో పాక్షిక జిల్లాల పునర్జిభన తరువా ఈ పట్టణంలో 77వ గణతంత్ర వేడుకలు మొదటిసారి నిర్వహించారు అది కూడా చారిత్రక బీటీ. కాలేజీ మైదానంలోనే. ఈ కాలేజీ వేదికగానే బెంగాలీ భాష నుంచి ఆంగ్లంలోకి జాతీయ గీతాన్ని తర్జుమా చేయడం చేయడంతో పాటు మొదటిసారి ఇక్కడే గీతాలాపన జరిగిన కేంద్రంగా మదనపల్లెకు దేశ చరిత్రలో గుర్తింపు ఉంది.
జిల్లాల విభజన తరువాత మదనపల్లెను జిల్లా కేంద్రం చేయడంతో బీటీ. కాలేజీ వేదికగా సంబరాలు నిర్వహించారు. ఈ జిల్లాకు మొదటి కలెక్టర్ గా వచ్చిన నిశాంత్ కుమార్ సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులు కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
మరో రికార్డు..
మదనపల్లెలో జిల్లా స్థాయి ఉత్సవాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. స్వాతంత్య్ర పోరాటంలో కీలక నేతల భేటీకి అతిథ్యం ఇచ్చిన బీటీ కాలేజీ (B.T. CoLLAGE) వేదిక అయింది. ఇక్కడే జాతీయగీతం బెంగాలీ భాష నుంచి ఆంగ్లంలోకి అనువదించడం, హోం రూల్ ఉద్యమానికి బీజం వేసిన ఈ కాలేజీ గణతంత్ర వేడుకలకు కూడా మొదటిసారి వేదికగా నిలిచిన చరిత్ర దక్కించుకుంది.
చిత్తూరులో ఉమ్మడి జిల్లా తరహాలో యథావిధిగానే పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్రవేడుకలు నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించి, గౌరవవందనం సమర్పించారు. ఈ ఉత్సవాల నిర్వహణను చిత్తూరు ఎస్పీ ఎస్పి తుషార్ డూడీ పర్యవేక్షించారు.
జిల్లాల విభజనకు ముందు చిత్తూరులో జరిగే స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలకు 14 నియోజకవర్గాల నుంచి యంత్రాంగం తరలివెళ్లేది. విధినిర్వహణలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బంది, సంస్థలకు ప్రశంశాలు పత్రాలు చిత్తూరు వేదిక నుంచి బహూకరించే వారు.
చిత్తూరు జిల్లా ప్రస్తుతం మూడు భాగాలుగా మారడంతో మూడు జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.