కల్తీ నెయ్యి మంటలు: వైసీపీ, టీడీపీ మధ్య చిచ్చు.. తిరుపతిలో ఆంక్షలు
x

కల్తీ నెయ్యి మంటలు: వైసీపీ, టీడీపీ మధ్య చిచ్చు.. 'తిరుపతి'లో ఆంక్షలు

తిరుపతిలో పోలీస్ సెక్షన్ 30 act అమలులో ఉంటుందన్న ఎస్పీ.


తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన కల్తీ నెయ్యి వ్యవహారంలో మాటల మంటలు చెలరేగాయి. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసిన నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ అలజడికి రాజకీయ పార్టీలు కేంద్ర బిందువుగా మార్చుకున్న తిరుపతిలో పోలీసు శాఖ ఆంక్షలు విధించింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబును మాజీ మంత్రి అంబటి రాంబాబు పరుష పదజాలంతో దూషించిన ఘటన ఉద్రిక్తతకు కారణమైందని పోలీసు శాఖ అంచనా వేసింది. దీంతో జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉంచడానికి ఫిబ్రవరి నెల చివరి వరకు పోలీసు ఆంక్షలు అమలు చేస్తూ, శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పోలీస్ సెక్షన్ 30 act విధించినట్లు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ప్రకటించారు.
"జిల్లాలో రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఒకే సమయం. ఒకే ప్రదేశంలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించకూడదు" అని ఆయన హెచ్చరించారు. ఈ తరహా కార్యక్రమాల వల్ల శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందనే పోలీస్ సెక్షన్ 30 యాక్టు అమలులోకి తెచ్చామని ఆయన చెప్పారు.

కారణం ఇదీ..

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే విషయమై అధికార టీడీపీ కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కల్తీ నెయ్యి వినియోగంపై దాదాపు 15 నెలల పాటు దర్యాప్తు చేసిన సీబీఐ నెల్లూరు ఏసీబీ కోర్టులో జనవరి 21వ తేదీ చార్జిషీట్ దాఖలు చేసింది.

అంబటి వ్యాఖ్యలతో ఉద్రిక్తత

"కల్తీ నెయ్యిలో గొడ్డు మాంసం వంటి ఆనవాళ్లు కాకుండా, కూరగాయల ప్రేరకాలు ఉన్నాయి" అని సీబీఐ తన చార్జిషీటులో ప్రస్తావించింది. దీంతో తమ పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చిందంటూ టీడీపీ కూటమిపై ఎదురుదాడికి దిగారు. ఈ పరిస్థితుల్లో టీటీడీ కూటమి నేతలు ఏర్పాటు చేసిన హోర్డింగులపై వైసీపీ అభ్యంతరం చెబుతూ, ధర్నాలకు దిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబును పరుష పదజాలంతో దూషిస్తూ, గుంటూరులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాపితంగా ఉద్రిక్తత పరిస్థితికి దారి తీసింది. పోలీసులు ఆదివారం రాత్రి అంబటి రాంబాబును అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. ఇదే పరిస్థితుల్లో మరో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడి ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

తిరుపతిలో ఆంక్షలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. తిరుపతిలో కూడా పరిస్థితి అదుపుతప్పకుండా, రాజకీయ పార్టీలు, వాటి సంస్థల నిరసనలపై ఆంక్షలు విధించినట్లు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు స్పష్టం చేశారు. ఆయన ఏమన్నారంటే..
"పోలీస్ 30 యాక్టు ప్రకారం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 28వ తేదీ వరకు తిరుపతి జిల్లాలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించడానికి వీలు లేదు" అని ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు సభలు లేదా ఊరేగింపు నిర్వహించాలి అనుకుంటే ముందుగా అధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
"సభ/ర్యాలీ నిర్వహించే ప్రదేశం, సమయం తదితర వివరాలు స్పష్టంగా రాయాలి. పరిస్థితులను అంచనా వేసిన తరువాత కూడా మంజూరు చేసిన అనుమతిని ఎప్పుడైనా రద్దు చేసే హక్కు పోలీసు శాఖకు ఉంటుంది" అని ఎస్పీ స్పష్టం చేశారు.
"వివాహాలు, అంత్యక్రియలు, వాటికి సంబంధించిన కార్యక్రమాలకు ఈ ఉత్తర్వులు వర్తించవు" అని వివరించారు. పోలీసు ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై పోలీస్ యాక్ట్ – 1861, ఇతర సెక్షన్లతో కూడిన చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
Read More
Next Story