ఆపరేషన్ గరుడా...  ప్రక్షాళన దిశగా అడుగులు...
x

ఆపరేషన్ గరుడా... ప్రక్షాళన దిశగా అడుగులు...

సామాన్యభక్తులే ప్రామాణికంగా టీటీడీ పరిపాలనలో పారదర్శకత, సేవల్లో జవాబుదారీతనం లక్ష్యంగా ప్రక్షాళనకు అడుగులు వేస్తున్నారు. వివాదాల శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారం నిగ్గుదేలే అవకాశం కూడా ఉందంటున్నారు.


"యాత్రికుల మనోభావాలను పరిశీలిస్తే, సేవలు మరింత మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది" అని

టీటీడీ ఈఓ జే. శ్యామలరావు అధికారులకు బాధ్యతలు గుర్తు చేశారు. గంటల వ్యవధిలోనే సూక్ష్మంగా పరిస్థితిని ఆవళింపు చేసుకున్న ఆయన తీరు బాగాలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. "శ్రీవారిసేవా టికెట్లు, దర్శనం, అన్నదాన సత్రాల నిర్వహణ సరిగా లేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు.


పరిపాలనా వ్యవహారాల్లో ప్రక్షాళనకు టీటీడీ ఈఓ జె. శ్యామలరావు అడుగులు వేస్తున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే తన ప్రాధమ్యాలను ఆయన స్పష్టం చేశారు. తిరుమలలో బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే ఆదివారం ఆయన కార్యాచరణలోకి దిగారు. ప్రధానంగా విపరీతమైన ఆరోపణలు ఉన్న శ్రీవాణి ట్రస్ట్ లో వాస్తవాలు నిగ్గు తేల్చడానికి వారం రోజుల గడువు నిర్ణయించుకున్నట్లు ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని వ్యవహారాల్లో తీరు బాగాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా పాలక మండలి తీసుకునే నిర్ణయాలు ఆన్ లైన్లో ఉంచకపోవడాన్ని ఆయన ప్రస్తావించడం గమనార్హం.

రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎన్. చంద్రబాబు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చారు. తిరుమల నుంచే ప్రక్షాళన చేపడతానని ప్రకటించిన రెండు రోజుల వ్యవధిలోనే టీటీడీ ఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావును నియమించారు. ఆ మేరకు బాధ్యతలు చేపట్టిన టీటీడీ ఈఓ శ్యామలరావు కూడా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు.
తిరుమలలో వాస్తవ పరిస్థితిని స్వయంగా అంచనా వేయడానికి మొదటి రోజు ఆయన క్యూలలో ఉన్న భక్తులతో కలిశారు. వారికి అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. ఆహార పదార్ధాల్లో నాణ్యత కొరవడిందనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన వెంగమాంబ అన్నదాన సత్రంలో పరిశీలించడంతో పాటు, స్వయంగా అక్కడే భోజనం రుచి చూశారు. అన్నదాన కేంద్రం వంటశాలలో పరిశీలించిన ఆయన పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
విస్తృతంగా సమీక్షలు
టీటీడీ ఈవో జె.శ్యామలరావు సోమవారం కూడా అన్ని విభాగాధిపతులతో సమీక్షించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్‌వో నరసింహ కిషోర్‌తో పాటు టీటీడీ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, సంతృప్తికరమైన సేవలు అందించాలన్నారు. దర్శనం, వసతి, నాణ్యమైన అన్నప్రసాదాలు, పారిశుధ్యం, ఇతర సౌకర్యాలను అత్యున్నతంగా అందించడం అందరి బాధ్యత అంటూ, "ఆదివారం తన తనిఖీలో భక్తుల అభిప్రాయాలు, వారి అంచనాలను చేరుకోవడానికి ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది " అని ఈవో అధికారులకు సూచించారు. మరితం బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
ఈ సూచనలు పాటించండి
ప్రతి విభాగంలో చెక్ లిస్ట్, టైమ్‌లైన్‌, ఫీడ్‌బ్యాక్ యంత్రాంగం ఏర్పాటు చేయడంతో పాటు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ సిద్ధం చేయాలని ఆయన జేఈవో వీరబ్రంహ్మంను ఆదేశించారు. అందులో ప్రధానంగా శ్రీవారి దర్శనం, ఆన్‌లైన్ కోటా విడుదల, ఆలయానికి సంబంధించి సేవా టిక్కెట్లు, రిసెప్షన్ విభాగంలో వసతి విధానాలు, ఇంజినీరింగ్ పనులపై సంబంధిత అధికారులతో ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. అంతకుముందు టిటిడి ఈఓ తిరుమలలోని ముళ్ళకుంట ప్రాంతంలోని వసతి గృహాలు, లడ్డు కౌంటర్లను తణిఖీ చేసి భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సమీక్షలో ఎస్‌బీబీసీ సీఈఓ షణ్ముగకుమార్, ఎఫ్ఏసీఓ బాలాజీ, డీఎల్ఓ వీర్రాజు, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు హాజరయ్యారు. జేఈఓలు మినహా, మిగతా అధికారులంతా టీటీడీలో శాశ్వత అధికారులే.
శ్రీవాణి ట్రస్ట్
దేశంలోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో ఆలయాల నిర్మాణం, కొన్ని జీర్ణోద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని 2018 ఆగష్టు 28వ తేదీ జరిగిన పాలక మండలి సమావేశంలో 388 తీర్మానం ఆమోదించారు. 2019 సెప్టెంబర్ లో ట్రస్ట్ సేవలు ప్రారంభమయ్యాయి. రూ. 10,500 దాతల నుంచి ఆన్లైన్ లో వసూలు చేశారు. ఇందులో దాతకు విఐపీ టికెట్ కోసం రూ. 500 మిగతా సొమ్ము జాతీయ బ్యాంక్ లో ప్రారంభించిన ట్రస్ట్ లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ నిధులు దారిమళ్లాయి అనే ఆరోపణల నేపథ్యంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డితో కలసి శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో వారు కొన్ని విషయాలు వెల్లడించారు. " శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 8.25 లక్షల యాత్రికుల నుంచి ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా రూ. 860 కోట్లు అందాయి" అని వైవి. సుబ్బారెడ్డి గత ఏడాది సెప్టెంబర్ లో వెల్లడించారు. "దేవాదాయ శాఖతో పాటు 176 ప్రైవేటు ఆలయాల కోసం కేటాయించాం. రూ. 10 లక్షల వంతున వెనుకబడిన ప్రాంతాల్లో 2,273 నిర్మాణం, దేవాదాయ శాఖ ద్వారా 1,953, సమరసత సంస్థ ద్వారా 320 ఆలయాల జీర్ణోద్ధరణ చేయడానికి నిధులు మంజూరు చేశాం" అని వారు గత ఏడాది స్పష్టం చేశారు. దీనిపై ఈ ఏడాది తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి కొందరు ప్రతినిధులు ముందుకు వచ్చి, నిజనిర్ధారణ చేశారు. వారి నివేదకకు ఎంతమేరకు చట్టబద్ధత ఉంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇదిలావుండగా,..
... ఆరోపణల ముసురు
గత ఐదేళ్ల కాలంలో టీటీడీలో పాలనా వ్యవహారాలు, నిధుల వినియోగంపై కూడా అనేక ఆరోపణలు ముసురుకున్నాయి. అందులో శ్రీవాణి ట్రస్ట్ (శ్రీవెంకటేశ్వర ఆలయాల నిర్మాణం ట్రస్ట్) కూడా ఒకటి. ఈ విషయాలపై ఒకరిద్దరు మినహా మాట్లాడే సాహసం చేయలేదు. అందులో ప్రధానంగా పేరిట వసూలు చేసిన నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు దుమారం రేపాయి. కీలక వ్యక్తులు శ్వేతపత్రం విడుదల చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో నూతనంగా ఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావును మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు కూడా.. "వారం, లేదా నెలాఖరులోపై అన్ని విషయాలపై సమగ్ర అవగాహన చేసుకుని, తరువాత మాట్లాడతా" అని వ్యాఖ్యానించారు. పరిపాలనా వ్యవహారాలు చక్కదిద్దడంతో పాటు గత పాలనలో తిరుపతి అభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులు, శ్రీవాణి ట్రస్ట్ గుట్టు బయటపడే అవకాశం లేకపోలేదని టీటీడీ వ్యవహారాలను దగ్గరగా గమనించే అధికారులు, కొందరు మీడియా ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
Read More
Next Story