
మదనపల్లె వద్ద స్వాధీనం చేసుకున్న బస్తాల్లోని గంజాని పరిశీలిస్తున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి , డీఎస్పీ ఎస్. మహేంద్ర
స్మగ్లర్ల బుర్రకు పదునెక్కువ..! ఉల్లిపాయల మాటున గాంజా ఘాటు
రూ.44 లక్షల గాంజా స్వాధీనంతో.. మదనపల్లెలో చెక్ పెట్టిన పోలీసులు.
మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటే స్మగ్లర్లు ఆలోచనలకు పదును పెట్టి, రూటు మారుస్తున్నారు. ఉల్లిపాయల (ఎరగడ్డలు) మాటున కోస్తాంధ్ర నుంచి గాంజా సరఫరా చేస్తున్న కూలీలు మదనపల్లెలో అడ్డంగా దొరికారు. 179 కిలోల గాంజా తోపాటు ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.
"మార్కెట్ లో ఈ గాంజా రూ. 44.65 లక్షలు ఉంటుంది" అని మదనపల్లె డీఎస్పీ ఎస్. మహేంద్ర తో కలిసి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి మీడియాకు చెప్పారు.
తిరుపతి నుంచి బయలుదేరింది. ఆ ఆటోకు నంబర్ ప్లేట్ లేదు. లోపల ఏమి బస్తాలు ఉన్నాయో తెలియదు. తిరుపతి దాటిన తరువాత కల్యాణిడ్యాం సమీపంలో ఒకటి. ఘాట్ రోడ్డు దాటిన తరువాత భాకరాపేట వద్ద మరో అటవీశాఖ చెక్ పోస్టు ఉంది. పీలేరు సమీపంలో జాతీయ రహదారి విస్తరణ వల్ల అక్కడ చెక్ పోస్టు లేదు. ఆ ఆటో సునాయాసంగా ఎలాంటి తనిఖీలు లేకుండా సాగిపోయింది. మదనపల్లెకు సమీపంలో యర్రగానిమిట్ట వద్ద నంబర్ లేని ఆ లగేజీ ఆటోను మదనపల్లె తాలూకా సీఐ కె. కళా వెంకటరమణ నిలపడంతో స్లగ్లింగ్ వ్యవహారం బట్టబయలైంది.
ఉక్కుపాదం మోపినా...
రాష్ట్రంలోని కోస్తాంధ్ర ఏజెన్సీ నుంచి గాంజా (గంజాయి) రవాణా జరగకుండా కట్టడి చేయడానికి పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలతో పాటు ప్రత్యేకంగా ఈగల్ టీం ( Police Eagle Team) కూడా ఏర్పాటు చేసింది. రాయచోటి అన్నమయ్య జిల్లాగా ఉన్నప్పుడు అనేకసార్లు గాంజా స్వాధీనం చేసుకున్నారు. అందులో 2025 అక్టోబర్ 28న 34 కిలోల గాంజాతో పాటు పాటు 14 మంది నిందితులను అరెస్టు చేసిన సంఘటన ప్రధానమైంది. ఇటీవల బీ. కొత్తకోటలో 20 కిలోలు, మూడు రోజుల కిందట మదనపల్లెలోనే 21 కిలోల గాంజా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మళ్లీ భారీగానే ఉల్లిపాయల మాటున గాంజా తరలిస్తున్న నిందితులు పోలీసులకు చిక్కారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం నంబర్ లేని ఈ ఆటోలో కోస్తా ప్రాంతం నుంచి గాంజా తరలిస్తున్నట్లు పోలీసుల ద్వారా తెలిసింది. పట్టుబడిన నిందితులు కూడా గాంజా తరలించడం, విక్రయించడం ఓ వ్యసనంగా మార్చుకున్నారు. దీని వెనుక ఉన్న కింగ్ పిన్స్ బయటికి రాకపోవడం గమనార్హం.
ఉల్లిపాయాల మాటున
మదనపల్లె ప్రాంతంలోకి అక్రమంగా గాంజా తరలిస్తున్నారనే సమాచారం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మదనపల్లె తాలూకా ఇన్స్పెక్టర్ కె. కళా వెంకటరమణ సిబ్బందితో కలిసి ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో తిరుపతి, మదనపల్లె ప్రధాన రహదారిలోని యర్రగానిమిట్ట వద్ద నంబర్ లేని లగేజీ ఆటోను నిలిపారు.
"ఉల్లిగడ్డలు తీసుకుని వస్తున్నాం సర్" అని ఆటోలోని వారి సమాధానంతో పోలీసులు సంతృప్తి చెందలేదు. లగేజీ ఆటోలో తనిఖీ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. ఉల్లిపాయల బస్తాల కింద ఉంచిన బస్తాల్లో గాంజా ఆకు ఘాటును గ్రహించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
"బస్తాల్లో 179 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. దీని విలువ రూ.44.65 లక్షల రూపాయలు ఉంటుంది" అని అన్నమయ్య మదనపల్లె జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వివరించారు. మదనపల్లెకు గాంజా తరలిస్తూ పట్టుబడిన నిందితులు ఇద్దరు పట్టణానికి చెందిన చంద్రాకాలనీకి చెందిన వారే అని ఎస్పీ ధీరజ్ చెప్పారు. ఆటో డ్రైవర్ ఆవుల నాగరాజ (23), ఆవుల సుగుణ (29) చంద్ర కాలనీలో నివాసం ఉంటారని ఆయన వివరించారు. ఈ ముఠాలో ఉన్న మరో నలుగురు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ గారు తెలిపారు.
ఈ ఘటనపై Crime No. 49/2026 (NDPS Act) కింద కేసు నమోదు చేశామని మదనపల్లె తాలూకా సీఐ కె. కళా వెంకటరమణ చెప్పారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు సాగుతోందని ఆయన తెలిపారు.
సూత్రధారులు ఎక్కడ
మదనపల్లె వద్ద తాజాగా స్వాధీనం చేసుకున్న రూ. 44. 65 లక్షల విలువన గాంజా ద్వారా మరో ప్రశ్న కూడా తెరమీదకు వచ్చింది. పోలీసుల కనుగప్పడం ద్వారా వ్యూహాలు మార్చి, కూలీలు స్మగ్లింగ్ చేస్తున్నారనే విషయం మరోసారి స్పష్టమైంది. కోస్తాంధ్ర నుంచి సునాయాసంగా గాంజా తరలిస్తున్నారనే విషయంమరో బయటపడింది. చిల్లరగా విక్రయించడానికి తీసుకుని వస్తున్న పాత నేరాలకు పాల్పడిన వారే మళ్లీ ఇలా చేస్తున్నారనేది పోలీసుల ద్వారా తెలిసిన సమాచారం. దీనివెనుక ఉన్న నెట్ వర్క్ మాత్రం తెరపైకి రాకపోవడమే ఇందులో ట్విస్ట్.
Next Story

