మదనపల్లె:రెక్కలు విప్పిన బర్డ్ ఫ్లూ..
x

మదనపల్లె:రెక్కలు విప్పిన బర్డ్ ఫ్లూ..

సదుంలో వందల కోళ్లు మృతి


కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ప్రజలకు ఇబ్బంది లేదు..

రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాం

కలెక్టర్ నిశాంత్ కుమార్ భరోసా

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ ( Bird flu) రెక్కలు విప్పింది. వందలాది కోళ్లు చనిపోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను ఖననం చేయడానికి ఎనిమిది రాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు చేశారు. కోళ్లు అసహజ మరణానికి గురైనా, మనుషులకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే సమాచారం ఇవ్వడానికి మదనపల్లె అన్నమయ్య జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.


"బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని చర్యలు తీసుకున్నాం. అని అన్నమయ్య మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చెప్పారు. అత్యవసర సేవలు లేదా సందేహాలు ఉంటే.. 7013914401, 9398262752 నంబర్లకు ఫోన్ చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు.

సదుం మండలంలో బర్డ్ ఫ్లూ

పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం రెండు కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ సోకినట్టు గుర్తించారు. పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లె, కంభంవారిపల్లెలో ముగ్గరు రైతుల కోళ్ల ఫారాల్లో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోయాయి. అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లె ఫారాల నుంచి కోళ్ల అవశేషాలను మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో ఉన్న హై సెక్యూరిటీ ల్యాబ్ కు పంపించారు.
"కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది" అని పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ స్పష్టం చేశారు. దీంతో పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లెలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా బ్లీచింగ్ పౌడర్, సున్నం ఉపయోగించి కోళ్లను ఖననం చేయించామన్నారు.
"కంభంవారిపల్లెలోని కోళ్ల ఫారానికి చెందిన శాంపిల్స్ నివేదిక కోసం వేచిచూస్తున్నాం" అని పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ స్పష్టం చేశారు.

భయం వద్ద .. పరిహారం ఇస్తాం..

సదుం మండలంలో గుర్తించిన బర్డ్ ఫ్లూ పై చర్యలు తీసుకునేందుకు పశుసంవర్ధక శాఖకు తగిన ఆదేశాలు జారీ చేశామని అన్నమయ్య మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చెప్పారు.
"బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కోళ్లు నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తాం" అని కలెక్టర్ నిశాంత్ కుమార్ భరోసా ఇచ్చారు. సదుం మండలం నుంచి ఇతర ప్రాంతాలకు కోళ్ల సరఫరా జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. సదుం మండలం మినహా ఎక్కడా కోళ్ల అసాధారణ మరణాలు లేవనే విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

కంట్రోల్ రూం ఏర్పాటు
సదుం మండలంలో బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడిన నేపథ్యంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
కోళ్లు అసాధారణ మరణానికి గురైనట్టు గమనిస్తే సెల్: 7013914401 (అమ్మవారిపల్లి), 9398262752 (పుత్తవారిపల్లె) నెంబర్లకు సమాచారం ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ సూచించారు. బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ సమస్య వల్ల ప్రమాదం లేదనే విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.
"బర్డ్ ఫ్లూ కోళ్ల నుంచి మనుషులకు సోకే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఆహార జాగ్రత్తలు పాటిస్తే చాలు" అని గుణశేఖర్ సూచించారు. వంద డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలో వేడి చేసిన చికెన్ తినడం వల్ల సమస్య ఉండదని ఆయన తెలిపారు.
Read More
Next Story