
భూ రీ సర్వే మరో క్రెడిట్ చోరీ : వైఎస్ జగన్
ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా సీఎం చంద్రబాబు మోసాలు చేస్తారని, అవసరానికి రంగులు మార్చే ఊసరవెల్లి కూడా ఈయన్ను చూసి సిగ్గుపడాలని జగన్ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా భూ రీసర్వే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్రెడిట్‌ను దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ భూమండలంపై క్రెడిట్ చోరీని అత్యంత సమర్థంగా చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే.. అవసరానికి రంగులు మార్చే ఊసరవెల్లి కూడా ఈయన్ను చూసి సిగ్గుపడాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Also Read:ప్రకృతి సాగు చేద్దాం.. భూమిని బాగు చేద్దాం
గురువారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపైన, కూటమి ప్రభుత్వం తీసుకున్నంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పాదయాత్రలో పుట్టిన ఆలోచన
భూ రీసర్వే అనేది తన పాదయాత్ర సమయంలో రైతుల కష్టాలు చూశాక వచ్చిన ఆలోచన అని జగన్ గుర్తు చేశారు. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు, 2020 డిసెంబర్‌లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అప్పట్లో సరైన టెక్నాలజీ, సర్వేయర్లు లేకపోయినా.. దాదాపు 40 వేల మంది సిబ్బందిని నియమించి, డ్రోన్లు, హెలికాప్టర్లతో అత్యంత పారదర్శకంగా సర్వే చేయించామని వివరించారు. రూ. 6 వేల కోట్లు ఖర్చు చేసి, 5 సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా భూములను కొలిపించి, రైతులకు శాశ్వత భూ హక్కు పత్రాలు అందించామని జగన్ స్పష్టం చేశారు.
పార్లమెంట్ మెచ్చిన సర్వే.. బాబు ఖాతాలో ఎలా వేసుకుంటారు
వైసీపీ హయాంలో జరిగిన ఈ భూ సర్వేను సర్వే ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ వంటి సంస్థలతో పాటు కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా కొనియాడాయని జగన్ తెలిపారు. ఈ కృషిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్లాటినం గ్రేడ్ ఇచ్చిందని, 2023 డిసెంబర్‌లో పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఈ విషయాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. రైతులకు ఉచితంగా సర్వే రాళ్లు ఇచ్చి, క్యూఆర్ కోడ్ ఉన్న పాస్‌బుక్కులు అందించిన ఘనత తమదేనని.. ఇప్పుడు చంద్రబాబు పాత అలవాటు ప్రకారం అంతా నేనే చేశాను అని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
సర్వే రాళ్ల తొలగింపునకు రూ. 15 కోట్లా? బాబు తీరుపై విస్మయం
చంద్రబాబు పాత్రను రాక్షస పాత్రతో పోల్చిన జగన్.. కేవలం తన ఫోటోలు, పేర్లు ఉన్నాయన్న కారణంతో తాము పాతిన సర్వే రాళ్లను తొలగించేందుకు ప్రభుత్వం రూ. 15 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబూ.. నాలుగు సార్లు సీఎంగా ఉన్నావు, 80 ఏళ్లు వస్తున్నాయి.. ఇలాంటి ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఏనాడైనా ఇలాంటిది చూశావా? చేశావా? అని సూటిగా ప్రశ్నించారు. కేవలం పాస్‌బుక్కుల రంగు మార్చి, తన ఖాతాలో వేసుకోవాలని చూడటం ప్రజలను వంచించడమేనని ఎద్దేవా చేశారు.
రైతులను భయపెట్టిన ఎల్లో మీడియా.. ఇప్పుడు అబద్ధాల వేట
ఎన్నికల సమయంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా భూ సర్వేపై రైతులను భయపెట్టారని, ఇప్పుడు అదే సర్వేను తమదిగా ప్రచారం చేసుకుంటున్నారని జగన్ విమర్శించారు. రైతులకు మేలు చేసే ఆలోచన రాకపోగా, భూములను 22ఏ (నిషేధిత జాబితా)లో పెట్టడం మాత్రమే బాబుకు తెలుసని ఎద్దేవా చేశారు. ఒక బృహత్తర లక్ష్యంతో మొదలుపెట్టిన భూముల సర్వేను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

