ప్రకృతి సాగు చేయాలని... భూమిని బాగు చేసేలా వ్యవసాయం, ఆహార ఉత్పత్తులను పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ ఆహార పంటల ఉత్పత్తులపై హైలెవల్ మీటింగ్... అలాగే రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో ప్రకృతి సేద్యానికి తీసుకుంటోన్న చర్యలను వివరించారు. అలాగే గ్లోబల్ మార్కెట్లో నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ కు ఉన్న డిమాండుకు తగ్గట్టు రాష్ట్రం ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేసేందుకు పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉంది. ప్రకృతి సేద్యం అనేది కేవలం ఒక వ్యవసాయ పద్ధతి మాత్రమే కాదు, వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఒక శక్తివంతమైన ఆయుధం. రాష్ట్రంలో ఇప్పటికే 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ఎటువంటి ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రకృతి సేద్యానికి సంబంధించి ప్రపంచానికే ఏపీని ఓ నమూనాగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. ఎరువుల వినియోగం.. రసాయనాల వినియోగంతో చేసే వ్యవసాయంతో పోలిస్తే, ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. రైతులకు మొదటి సంవత్సరం నుంచే అధిక నికర ఆదాయం లభిస్తోంది... రైతులు బలోపేతం కావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది అని ముఖ్యమంత్రి వివరించారు.
పర్యావరణానికి మేలు చేసేలా... గ్లోబల్ మార్కెట్టుకు తగ్గట్టుగా
ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమిలో కార్బన్ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే పర్యావరణానికి మేలు జరుగుతుంది. అలాగే నీటి వినియోగం తగ్గడంతో పాటు. బయోడైవర్సిటీ పెరిగేలా చూసుకోవచ్చు. అలాగే భూసారం తగ్గకుండా... భూమిని మరింత బలంగా... పోషకాలు ఉండేలా చేసుకోవచ్చు. ఫార్మర్ టు ఫార్మర్ అనే పద్దతిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి గ్రామానికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక ప్రకృతి సేద్యంలో అనుభవజ్ఞులైన రైతులు ఇతర రైతులకు శిక్షణ ఇచ్చేలా వ్యవస్థను రూపొందించాం. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లలో ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి వీలుగా సరైన మార్కెటింగ్ వ్యవస్థను, సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. టెక్నాలజీని ఉపయోగించి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని, పర్యావరణాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులను సిద్దం చేస్తోంది. అయితే ప్రకృతి సాగును ప్రొత్సహించేందుకు మెరుగైన పారిశ్రామిక పద్దతులు, ఆర్థిక ప్రొత్సాహకాలు అవసరం. వ్యాపార సంస్థలు తమ ఆర్థిక లాభాల పరంగానే కాకుండా... పర్యావరణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్టులో ఉన్న డిమాండ్ ను అంచనా వేసుకుంటూ... అంతర్జాతీయంగా రాష్ట్ర ఉత్పత్తులను ఎగుమతులు చేసేలా భారీ ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు... ఓ పెద్ద బిజినెస్ ఆపర్చునిటీగా నిరూపించే దిశగా ఏపీలోని రైతులను సిద్దం చేస్తున్నాం అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఏపీ నుంచి ఉద్యాన, ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈకి ప్రతిపాదించారు. దావోస్ లో ఆ దేశ విదేశీ వాణిజ్య మంత్రి థాని బిన్ అహ్మద్ తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఏపీలో దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనపై ఇరువురు నేతలు చర్చించారు. యూఏఈ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో విస్తృతంగా మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం వివరించారు. అగ్రిటెక్ , ఫుడ్ టెక్, ఆక్వా టెక్ తో పాటు ఫుడ్ పార్కుల అభివృద్ధి, ఆహార భద్రతా చర్యల గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఆహార ఉత్పత్తులను వేగంగా రవాణా చేసేందుకు వీలుగా ఏపీలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్డు, రైలు నెట్వర్క్ విస్తృతంగా ఉందని యూఏఈ వాణిజ్య మంత్రికి వివరించారు. వీటితో పాటు జాతీయ పారిశ్రామిక కారిడార్లు కూడా రాష్ట్రంతో అనుసంధానమై ఉన్నాయని తెలిపారు. యూఏఈకి చెందిన డీపీ వరల్డ్, షరాఫ్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్ , ఏడీ పోర్ట్స్, యాడ్ నాక్ లాంటి కంపెనీలు ఏపీలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం కోరారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏపీ పనిచేస్తోందని..యూఏఈకి చెందిన టాక్వా, మజ్దార్ లాంటి కంపెనీలతో పాటు ఏడీఐఏ, ముబాద్లా, ఏడీక్యూ లాంటి ఫండింగ్ సంస్థల ద్వారా పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని స్పేస్, డ్రోన్ సిటీల్లో లోనూ యూఏఈ భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించగా... దీనిపై యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి సానుకూలంగా స్పందించారు.