
కుప్పం సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
రాష్ట్రానికి కుప్పం ఓ ప్రయోగశాల వంటిదే..
ఈ ఏడాది రాష్ట్రంలో సంజీవని పథకం విస్తరిస్తామన్న సీఎం చంద్రబాబు
సైకిళ్ల పంపిణీతో గిన్సిస్ రికార్డు
కుప్పంలో 70 వేల మందికి ఉపాధి
పర్యాటకానికి దారులు తెరిచామన్న సీఎం
కుప్పం నియోజకవర్గం ఓ ప్రయోగశాల. ప్రతీ కార్యక్రమాన్నీ ఇక్కడ విజయవంతం చేసి రాష్ట్రంలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. నియోజకవర్గంలో రెండో రోజు శనివారం పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. తుమిసి ప్రజా వేదిక నుంచి చిత్తూరు ఎంపి ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడారు.
"కుప్పంలో రూ. 7088 కోట్లతో 16 పరిశ్రమలు వచ్చాయి. 34 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి" అని ప్రకటించారు.
"నాకు ప్రాణ సమానంగా ఎప్పుడూ నాతోనే ఉండే కుప్పం ప్రజలకు పేరుపేరునా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాకు ఎంతో సహకరిస్తున్న కుప్పం ప్రజలు, ఎప్పుడూ నేను మర్చిపోలేను" అని ఉద్వేగంగా అన్నారు.
గిన్సిస్ రికార్డు
కుప్పంలో మూడు రోజుల కార్యక్రమం నాకు చాలా తృప్తినిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో ఒకేసారి పెద్దమొత్తంలో సైకిళ్లను డెలివరీ చేసిన రికార్డును తుడిచి పెట్టి కుప్పంలో చరిత్ర సృష్టించాం. 24 గంటల్లో 5,555 ఈ - సైకిళ్లు పంపిణీ చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డుతో చరిత్ర సృష్టించాం అని ఆయన అన్నారు. బ్యాటరీ సైకిల్ కు సూపర్ సైకిల్ అని పెరుపెట్టినట్టు ఆయన తెలిపారు. ఈ -సైకిళ్లతో 40 కిలోమీటర్ల వరకు ఈజీగా సైకిల్ మీద వెళ్లి పని చేసుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారతే లక్ష్యంగా 5,500 ఈ-సైకిళ్లు పంపిణీ చేశాం అని ఆయన తెలిపారు. విద్యార్థులు తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణానికి వీలు కలిగింది. నెలకు ఒక్కో కుటుంబానికి రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఆదా అవుతుందని ఆయన వివరించారు.
రాష్టంలో సంజీవని పథకం విస్తరణ
ఎరువుల వినియోగం పెరిగితే అనారోగ్యం ఎక్కువ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. దీని కోసం పైలెట్ ప్రాజెక్టుగా కుప్పంలో ప్రయోగాత్మకంగా సంజీవని ప్రాజెక్టు అమలు చేశామన్నారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడం వల్ల ప్రజారోగ్య రక్షణ కోసం వైద్య సేవలు అందేవిధంగా సంజీవని ప్రాజెక్టును ఈ ఏడాది రాష్ట్రంలో విస్తరిస్తాం అని ఆయన వెల్లడించారు.
70 వేల మందికి ఉపాధి
కుప్పం నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టిన విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా నీటిని తీసుకువచ్చి రైతులకు ఇస్తున్నాం అని గుర్తు చేశారు.
"కుప్పంలో రూ. 7088 కోట్లతో 16 పరిశ్రమలు వచ్చాయి. 34 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి లభించేలా చేస్తాం" అని భరోసా ఇచ్చారు. దీనివల్ల కుప్పం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేవిధంగా ఆదిత్యబిర్లా సంస్థ తో కలిసి మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించాం అని ఆయన చెప్పారు.
కో వర్కింగ్ స్పేస్
వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారు. స్థానికంగా ఒక చోట ఉద్యోగం చేసుకునేలా కోవర్కింగ్ స్పేస్ కూడా శనివారం అందుబాటులోకి తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడించారు. దీనివల్ల కుప్పంలో ప్రతీ ఒక్కరికీ ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం అని వివరించారు. కంగుంది ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి నాంది పలికామనీ, రాక్ క్లైంబింగ్ పార్కుగాను అభివృద్ధి చేశాం అని ఆయన తెలిపారు.
"కుప్పంలో ఫ్లవర్ ఫెస్టివల్ ద్వారా పర్యాటకానికి దారులు తెరిచాం. హోం స్టేలు కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు" అని అభినందించారు.
Next Story

