జగన్ జనం బాటలో.. ఆలయాల మాట..
x
మాజీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి (ఫైల్)

జగన్ జనం బాటలో.. ఆలయాల మాట..

పులివెందులలో రెండు రోజుల పర్యటనకు ఈరోజు మధ్యాహ్నం రాక నేపథ్యం ఇదీ.


తిరుమల లడ్డు ప్రసాదం పై శాసనసభలో మంగళవారం కీలక చర్చ జరగనున్నది. ఇదే సమయంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్. జగన్ పులివెందుల నియోజకవర్గం బాట పట్టారు. రెండు రోజుల పర్యటన కోసం జగన్ మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందులకు చేరుకోనున్నారు. బుధవారం వరకు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆలయాల విగ్రహ ప్రతిష్టాపనతో కార్యక్రమాలతో పాటు క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.

ప్రజల సమస్యలు వినడం, వినతిపత్రాలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడానికి కార్యక్రమం ఖరారు చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత జగన్ పులివెందులలో ప్రతి పర్యటనలో రెండు రోజులు గడపడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేయడం వెనుక కూడా ప్రత్యేక ఆలోచన ఉందని భావిస్తున్నారు.

పులివెందులపై ఫోకస్

2024 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వైయస్ జగన్ బెంగళూరు, తాడేపల్లి నివాసం, పులివెందులలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. తాజా పర్యటన వివరాల్లోకి వస్తే,
బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరే వైయస్ జగన్ మంగళవారం పులివెందులలోని భాకరాపురం వద్ద ఉన్న హెలిపాడుకు చేరుకుంటారు. అక్కడ నుంచి పులివెందులలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చిన తర్వాత జగన్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించడంతో పాటు సమస్యలు తెలుసుకునేందుకు ప్రజలతో భేటీ కానున్నారు. ఆ తర్వాత రాత్రికి పులివెందులలోని నివాసంలో బస్ చేసే ఆయన బుధవారం ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లికి చేరుకుంటారు. ఈ గ్రామంలో కొత్తగా నిర్మించిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవంలో పాల్గొని పూజలు చేస్తారు. తిరిగి బాకరాపురంలోని క్యాంప్ ఆఫీస్ కు చేరుకునే జగన్ ప్రజలతో సమావేశం అవుతారు. విడతల వారీగా ప్రజా దర్బార్ నిర్వహించే జగన్ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించే విధంగా కార్యక్రమం ఖరారు. బుధవారం రాత్రికి పులివెందులలో బస చేసే ఆయన మరుసటి రోజు తిరిగి బయలుదేరి బెంగళూరుకు వెళతారు.
పులివెందుల నియోజకవర్గం 1978 నుంచి 2024 ఎన్నికల వరకు వైయస్ కుటుంబీకులే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 12 సార్లు జరిగిన ఎన్నికల్లో వారిదే హవా. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు పులివెందులలో కూడా ప్రభావం చూపించాయి.

టిడిపి పంజా..

పులివెందుల నియోజకవర్గం పై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. పులివెందుల నుంచి హ్యాట్రిక్ సాధించిన వైయస్ జగన్ 2024 ఎన్నికల లో 59 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికలతో పోలిస్తే మెజారిటీ భారీగా తగ్గింది అంటే టిడిపి అభ్యర్థి బీటెక్ రవి (మా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి) గట్టి పోటీ ఇవ్వడం వల్ల వైఎస్ జగన్ కు 30 వేల మెజార్టీ తగ్గింది. దీనికి తోడు గత ఎన్నికల నుంచి వైయస్ జగన్ కుటుంబానికి ఎదురు దెబ్బలు తగలడం ప్రారంభమైంది. వైయస్సార్ కుటుంబం ఆధిపత్యాన్ని గండి కొట్టడం అంత సులభం ఏమీ కాకున్నా, పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు వైసీపీని ఆత్మ రక్షణలో పడేశాయి.
"ఉప ఎన్నికలు రీపోలింగ్ వైసిపి గత్యంతరం లేని స్థితిలో బహిష్కరించడమే నిదర్శనం"
ఈ పరిణామాల నేపథ్యంలో వైయస్ జగన్ పులివెందులపై వ్యక్తిగతంగా దృష్టి నిలిపారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులను సమన్వయం చేసే వ్యవహారంలో బాబాయ్ కొడుకు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పై కూడా జగన్ మండిపడిన దాఖలాలు ఉన్నాయి. టిడిపి నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో వైయస్ జగన్ బెంగళూరు తర్వాత తాడేపల్లి, అంతకంటే ఎక్కువ పులివెందులపై దృష్టి సారిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

అసెంబ్లీలో లడ్డుపై చర్చ.. సొంతూరులో ఆలయ బాట..

పులివెందులలో మంగళవారం నుంచి రెండు రోజులు వైయస్ జగన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. శాసనమండలిలో తిరుమల లడ్డూపై వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడే విధానం ఆధారంగా అసెంబ్లీలో ఈ రోజు ప్రత్యేక చర్చకు అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వైఎస్. జగన్ సహా ఆ పార్టీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరవుతున్న విషయం తెలిసిందే. హిందూత్వ వ్యతిరేకి అనే ముద్రకు దూరం కావడానికి జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆ తరువాత పీఠాధిపతుల వద్దకు వెళ్లే వారు. పూజలు, ఆశీర్వచనాలు తీసుకుని, హిందూత్వాన్ని పాటిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తాజా పర్యటనలో ఆయన పులివెందులలో కూడా ఆలయ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం హాజరు కావడానికే పర్యటనకు వస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Read More
Next Story