
భక్తి, ప్రకృతి సౌందర్యాల సమ్మేళనం
శ్రీవారిసేవలో పరిమళిస్తున్న పుష్పసోయగం
ఆహ్లాదం పంచుతున్న తిరుమలలోని నందనవనాలు
శ్రీవారికి రోజూ 300 కిలోలతో పుష్ప కైంకర్యం
ఏడాదికి 2.70 లక్షల కిలోల పుష్పాల వినియోగం
61 ఎకరాల్లో విస్తరించిన టీటీడీ ఉద్యానవనాలు
టీటీడీ ఉద్యానవన విభాగం శ్రీవారి పుష్ప కైంకర్యానికి వెన్నుముక
శేషాచలం అడవులు ప్రకృతి తీర్చిదిద్దిన ఒక నందనవనం. తిరుమల (Tirumala )శ్రీవారి కోలువైన ఈ క్షేత్రం ఆధ్యాత్మిక నిత్యకల్యాణం పచ్చతోరణం. ఏడాది పొడువునా నిర్వహించే 450 పైగా ఉత్సవాలకు ఇక్కడి ఉద్యానవనాలు కూడా సేవలు అందిస్తున్నాయి. తిరుమలలోని 54 అలంకార ఉద్యానవనాల్లో వికసించే ప్రతి పువ్వు శ్రీవారి సేవకు అంకితం అవుతోంది.
కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం పురాణాల్లో పుష్ప మండపంగా భావిస్తారు. శ్రీవారి పుష్ప కైంకర్యానికి విశేష ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తిరుమలలో స్వామివారికి నిత్యం పుష్ప కైంకర్యాలు నిర్వహిస్తుంటారు. అంత ప్రాముఖ్యత కలిగిన పుష్ప కైంకర్యాలకు నిర్విఘ్నంగా పుష్పాలను సరఫరా చేస్తూ స్వామివారి పుష్ప కైంకర్యాలకు టీటీడీ (TTD ) ఉద్యానవన విభాగం వెన్నుముకగా నిలుస్తోంది.
టీటీడీ (Tirumala Tirupati Devasthanams TTD) ఉద్యానవన విభాగం 1991 నుంచి తిరుమల, తిరుపతిలోని ఉద్యానవనాల అభివృద్ధి, సంరక్షణ తోపాటు శ్రీవారి ఆలయానికి అవసరమైన పుష్పాల సరఫరాలో కీలకంగా ఉంది.
ఏడాదికి 2.70 లక్షలు టన్నుల పువ్వులు..
తిరుమల, తిరుపతిలో 61 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ ఉద్యానవనాల నిర్వహణ జరుగుతోంది. 54 ఎకరాలు అలంకార ఉద్యానవనాలు, ఏడు ఎకరాల్లో పుష్పాల ఉత్పత్తి తోటలు ఉన్నాయి. తిరుమలలో ఏడాదికి దాదాపు 450కు పైగా ఉత్సవాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. శ్రీవారి తోపాటు ఉత్సవ మూర్తులు, అనుబంధ ఆలయాలకు అవసరమైన పూ తోటల పెంపకంలో టీటీడీ ఉద్యానవన విభాగం కీలకపాత్ర పోషిస్తోంది.
శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలకు సంవత్సరానికి సుమారు 2.60 లక్షల నుంచి 2.70 లక్షల కిలోల పుష్పాలు అవసరం. నిత్య ధూపదీప నైవేద్యాలకు రోజూ సగటున 300 కిలోల పుష్పాలు వినియోగిస్తున్నారు. తిరుపతిలోని స్థానిక ఆలయాలు, బయటి దేవాలయాల అవసరాలకు అదనంగా సంవత్సరానికి సుమారు 3 లక్షల కిలోల పుష్పాలు సరఫరా అవుతున్నాయి. దేశ, విదేశాల నుంచి పుష్పాలను సేకరించడంతో పాటు ఎప్పటికప్పుడు పుష్పాలను సరఫరా చేసేందుకు శ్రీవారి పుష్ప కైంకర్యంలో టీటీడీ ఉద్యానవన విభాగం విశేష కృషి చేస్తోంది.
విదేశీ పుష్పాలు
బ్యాంకాక్, మలేషియా, ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాల నుండి కూడా నాణ్యమైన పుష్పాలను సేకరిస్తూ టీటీడీ ఉద్యానవన విభాగం స్వామివారి కైంకర్యాలకు పుష్పాలను సరఫరా చేస్తోంది.
ఏటా కార్తీక మాసంలో వచ్చే శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున నిర్వహించే పుష్పయాగ మహోత్సవానికి 16 నుంచి 18 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలను సేకరిస్తారు. ఆ రోజు స్వామివారికి రోజూ సమర్పించే అన్ని రకాల పుష్పాలు, పత్రాలను దాదాపు 10 టన్నులు సేకరించి పుష్ప కైంకర్యం నిర్వహిణలో టీటీడీ ఉద్యానవన విభాగానిదే కీలకపాత్ర.
పుష్పాల సేకరణ
టీటీడీ మూడు మార్గాల్లో పుష్పాలను సమకూర్చుకుంటోంది. టీటీడీ సొంత పుష్ప తోటలు, భక్తుల విరాళాలు, రిజిస్టర్డ్ రైతు సంఘాల ద్వారా కొనుగోలు చేసి పుష్పాల సరఫరా నిర్వహిస్తున్నారు. తిరుమల, తిరుపతి పరిసరాల్లోని అలంకార ఉద్యానవనాలు, సర్కిళ్ల సంరక్షణలో దాతల పాత్ర విశేషంగా ఉంది. 20 ప్రాంతాల్లో దాతల సహకారంతో ఉద్యానవనాల సంరక్షణ జరుగుతోంది. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో మరో 16 ప్రాంతాల్లో ప్రత్యక్షంగా నిర్వహణ జరుగుతోంది.
తిరుమలలోని గీతోపదేశం పార్క్, నామాల పార్క్, గరుడ సర్కిల్, లేపాక్షి సర్కిల్, శ్రీవారి పుష్ప ఉద్యానవనం వంటి ప్రాంతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Next Story

