
తిరుమలలో కల్యాణవీణ మోగిస్తే... ఆరుగురికి ఉచిత దర్శనం..
శుభముహూర్తాలకు కల్యాణ వేదిక వద్ద ఉచిత సేవలు ఇవీ..
తిరుమలలో ఉభయ దేవేరులతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు నిత్య కళ్యాణం జరుగుతుంటుంది. అందువల్ల తిరుమల శ్రీవారి క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం. ఇక్కడ పెళ్లిళ్లకు అన్ని రోజులను శుభ ఘడియలుగానే భావిస్తారు. టీటీడీ ఏర్పాటు చేసిన ఉచిత కల్యాణ వేదిక వద్ద నవ దంపతులయ్యే యువతీ, యువకుడితో పాటు వారి తల్లిదండ్రులతో కలిపి ఆరుగురికి ఉచిత దర్శన సదుపాయం కల్పిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమలలో జరిపించే వివాహానికి చట్టబద్ధత కల్పించే వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు.
హిందూ సంప్రదాయాల్లో వివాహ ఘట్టానికి ముహూర్తాలు ప్రధానం శుభ ముహూర్తంలో పెళ్లి జరిపిస్తే, జీవితం సుఖంగా సాగుతుందనేది ఓ విశ్వాసం. జ్యోతిష శాస్త్రవేత్తలు, పంచాంగం ప్రకారం ఈ ఏడాది శుభ ముహూర్తాల తేదీలు వెల్లడించారు. 2016 నుంచి ఈ వేదికపై 26,777 మంది దంపతులయ్యారు.
ముహూర్తాలతో సంబంధం లేకుండా ఇక్కడ పేదలే కాదు. అన్ని వర్గాల హిందువులు వివాహాలు జరిపించడానికి ఇష్టపడతారు. ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలలో చాలామంది సత్యనారాయణ వ్రతం ఇళ్లవద్దే పూర్తి చేసుకుంటారు. నవ దంపతులను వారి తల్లిదండ్రులు తిరుమలకు తీసుకువచ్చి వివాహాలు జరిపించడానికి ఆసక్తి చూపిస్తారు. వారికోసం టీటీడీ వసతులు అందుబాటులో ఉంచింది. తిరుమలలో పెళ్లి చేసుకోవడానికి ఏం చేయాలి? సింపుల్ గా వివాహ రిజిస్ట్రేషన్ ఎలా జరిపించాలి. వారికి టీటీడీ ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచింది అనే విషయాలు తెలుసుకుందాం.
ఉచిత వివాహాల వేదిక
తిరుమలలో పాపవినాశనం వెళ్లే మార్గంలో టీటీడీ కల్యాణ వేదిక ఏర్పాటు చేసింది. ఇక్కడ వివాహాలు ఉచితంగా జరిపించడానికి వసతులు అందుబాటులో ఉంచిన విషయాన్ని టీటీడీ మంగళవారం గుర్తు చేసింది. తిరుమల కల్యాణ వేదికకు నూతన వధూవరుల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
తిరుమలలోని కల్యాణ వేదికలో 2016 ఏప్రిల్ 25 నుంచి 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు దాదాపు 26,777 వివాహాలు అయ్యాయి.
2016-17 సంవత్సరంలో 2731 వివాహాలు జరిగాయి.
2017-18: 4705
2018-19: 5047
2019-20: 4443
2020-21: 91
2021-22: 1298
2022-23: 2133
2023-24: 2458
2024-25 డిసెంబర్ వరకు)లో 3871 మంది దంపతులయ్యారు.
వేదిక వద్ద ఉచితంగా..
తిరుమలలో వివాహాలు జరిపించడానికి అన్ని వర్గాల హిందువులు ఆసక్తి చూపిస్తారు. శ్రీవారి క్షేత్రంలో యువతీ యువకులకు పెళ్లిళ్లు చేయించడం మొక్కుబడిగా కూడా భావిస్తారు. పేదలు, మధ్యతరగతి హిందువులు ఖర్చు లేకుండా వివాహం జరిపించడానికి టిటిడి ఈ వసతిని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఆర్థికంగా స్థితి వంతులు కూడా ఇక్కడ పెళ్లిళ్లు జరిపించడానికి ఎక్కువ ఇష్టపడతారు.
తిరుమల నుంచి పాపవినాశనం వెళ్లే మార్గంలో కల్యాణవేదిక ఏర్పాటు చేశారు. ఇక్కడ పెళ్లి చేయించడానికి టీటీడీ కొన్ని వసతులు ఉచితంగా అందుబాటులో ఉంచింది. పురోహితుడు, మంగళ వాయిద్యాలు. పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణం టీటీడీ ఉచితంగా అందిస్తుంది. వివాహానికి కావాల్సిన ఇతర సామాగ్రిని మాత్రం వధూవరులే తీసుకురావాల్సి ఉంటుంది. వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలి. పెళ్లికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలి.
టీటీడీ కల్పించే సదుపాయాలు
తిరుమలలో కల్యాణ వేదికపై వివాహాలు జరిపిస్తే, నవదంపతుల తోపాటు వారి తల్లిదండ్రులతో కలిపి ఆరుగురికి శ్రీవారి దర్శనానికి ఉచితంగా రూ.300 ప్రత్యేక ప్రవేశం ద్వారా అనుమతిస్తారు. తిరుమలలోని ఏటీసీ వద్ద ఉన్న క్యూలో శ్రీవారి దర్శనానికి వెళ్లవచ్చు. మ్యారేజ్ రిసెప్షన్ కేంద్రంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఉచితంగా లడ్డూలను లడ్డూ కౌంటర్ వద్ద తీసుకోవచ్చు.
ఆన్లైన్లో బుకింగ్
తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేందుకు ఆన్లైన్లో కల్యాణవేదిక స్లాటును బుక్ చేసుకునే సదుపాయాన్ని 2016 మే 9వ తేదీ నుంచి టీటీడీ కల్పించింది. https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి.
రాష్ట్ర ప్రభుత్వం తిరుమల లోని ఎస్ఎంసి (SMC) వసతి గృహాల సముదాయం లోని 233వ గదిలో హిందూ వివాహ రిజిస్టర్ వారి కార్యాలయాన్ని అందుబాటులో ఉంచింది.
1)ఈ సైట్ లోని కల్యాణ వేదిక కాలమ్ లో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదు చేయాలి.
2)వధూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయాలి. ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయాలి.
3) వయసు ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికెట్ లేదా పదో తరగతి మార్కుల లిస్టు/ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదా పంచాయతీ కార్యదర్శి/ మున్సిపల్ అధికారులు ధృవీకరించిన బర్త్ సర్టిఫికేట్ నెంబర్ నమోదు చేయాలి.
4) వీటితోపాటు అందులో వివాహ తేది, సమయాన్ని వారే నిర్ణయించుకుని అప్లోడ్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ పత్రం జారీ అవుతుంది.
5)కొత్తగా పెళ్లి చేసుకునే వారు ఆ అక్నాలెడ్జ్మెంట్ పత్రం తీసుకుని వధూవరులు ఇరువురు వారి సంబంధిత MRO (తహసిల్దార్) గారి దగ్గర ఇదే మొదటి వివాహం (UN MARRIED CERTIFICATE) అని ధృవీకరణ పత్రం తీసుకొని ఆరు గంటల ముందు తిరుమల చేరుకుని కల్యాణ వేదిక వద్ద ఉన్న కార్యాలయంలో MRO (తహసిల్దార్) దగ్గర సంతకం చేసుకొన్న అక్నాలెడ్జ్మెంట్ పత్రం, మిగతా అన్ని పత్రాలు (వధూవరులు, తల్లిదండ్రులు ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రం) జిరాక్స్ పత్రాలు అక్కడి సిబ్బందికి ఇచ్చి వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి.
6) తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేవారికి అవకాశాన్ని బట్టి ఒక Rs.50/-రూమ్ CRO/ARP కార్యాలయం వద్ద తీసుకోవచ్చు.
7) ఆన్లైన్లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకోవడానికి హిందూ మతస్తులై ఉండాలి. వధువుకు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ద్వితీయ వివాహములు, ప్రేమ వివాహములు ఇక్కడ చేయు. వివరాలకు ఫోన్ – 0877- 2263433 సంప్రదించవచ్చు.
గ్రూప్ ఫోటో కానుక
ఉచిత కల్యాణ వేదిక వద్ద వివాహం పూర్తయిన తర్వాత నవ దంపతులకు వారి తల్లిదండ్రులతో కలిసి గ్రూప్ ఫోటో తీస్తారు. ఆ ఫోటో ఓ కానుకగా వారికి అందిస్తారు.
Next Story

